చాలా కాలం పొలిటికల్ బిజీలో ఉండి సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు రూటు మార్చాడు. ఒకప్పుడు సినిమా సినిమాకు మధ్య ఏళ్ల తరబడి వెయిట్ చేయించిన కళ్యాణ్.. ఇప్పుడు కేవలం ఎనిమిది నెలల వ్యవధిలోనే వరుసగా మూడు భారీ చిత్రాలను థియేటర్లలోకి దించుతుండటం విశేషం. 2025 జూలై 24న హరిహర వీరమల్లుతో పీరియడ్ డ్రామాగా పలకరించిన ఆయన.. ఆ వెంటనే సెప్టెంబర్ 25న OGతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించాడు. ఆ సినిమా 300 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు అదే జోరును కొనసాగిస్తూ మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నట్లు అధికారికంగా ప్రకటించేశాడు. నిజానికి 10 రోజుల క్రితం వరకు ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్‌పై ఇండస్ట్రీలో పెద్దగా సందడి లేదు. కానీ మార్కెట్‌లో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. భారీ అంచనాలున్న పెద్ది, ప్యారడైజ్ చిత్రాలు వాయిదా పడుతున్నాయనే వార్తలు రాగానే.. డైరెక్టర్ హరీష్ శంకర్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో స్పీడ్ పెంచేశాడు.
ప్రస్తుతం డబ్బింగ్ పనులు కూడా తుది దశకు చేరుకోవడంతో, సమ్మర్ కానుకగా మార్చి 26న పక్కాగా థియేటర్లలోకి వస్తామంటూ సరికొత్త పోస్టర్‌తో పవన్ ఫ్యాన్స్‌లో జోష్ నింపారు. ఈ సమ్మర్ వార్ అంత ఈజీగా ఏమీ కనిపించడం లేదు. ఉస్తాద్ రాకకు సరిగ్గా వారం ముందే, అంటే మార్చి 19న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ధురంధర్ 2 బరిలో నిలవనుంది. దీనికి తోడు కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న టాక్సిక్ కూడా అదే సమయంలో రావాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే యశ్ సినిమా పోటీ నుండి తప్పుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ టాక్సిక్ రేసులో లేకపోయినా, ధురంధర్ 2 ఇచ్చే కాంపిటీషన్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఎవరొచ్చినా దేఖ్‌లేంగే అంటూ ధీమాగా ఉన్నాడు.
గతంలో గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన క్రేజీ కాంబో కావడంతో.. ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హరీష్ శంకర్ మార్క్ డైలాగులు, పవన్ కళ్యాణ్ స్వాగ్ తోడైతే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఓజి విజయంతో ఫుల్ ఫామ్‌లో ఉన్న పవన్.. ఈ సినిమాతో దుమ్ము దులిపేసి రికార్డులను మడతపెట్టాలని చూస్తున్నాడు. తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించుకోవాలని చూస్తున్నాడు డిప్యూటీ సిఎం. మొత్తానికి 2025 జూలై నుంచి 2026 మార్చి వరకు టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ మేనియా స్పష్టంగా కనిపిస్తోంది. పాలిటిక్స్ అండ్ సినిమాలు.. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఆయన చూపిస్తున్న వేగం చూసి తోటి హీరోలు సైతం ఆశ్చర్యపోతున్నారు. మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్ గా పవన్ చేసే బాక్సాఫీస్ వేట ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే...