ఒక్కరోజు గడిస్తే.. చాలు.. పురపాలకులు ఎవరో తేలిపోనుంది. ఎన్నికల ప్రచారం ముగియడంతో...పార్టీలు, పోటీ చేస్తున్న అభ్యర్థులు...ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఎన్నికల్లో ఒక రోజు రాత్రి పోల్ మేనేజ్‌మెంట్ చేసిన వాళ్లే విజేతలవుతారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ఓటర్లకు నజరానాలు ఇస్తూ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఎన్నికలను పంచభూతాలు శాసిస్తున్నాయి. ఓట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు అభ్యర్థులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.రాజకీయాలంటే ప్రజాసేవ అనే ధోరణి మారిపోయింది. లాభసాటి వ్యాపారంలా మారింది. ఎంత వెచ్చించాం... ఎంత సంపాదించామన్నదే వ్యాపార లక్షణమే ఇప్పుడు కనిపిస్తుంది. దీంతో కాసులున్న వారికే పార్టీలు టికెట్ ఇవ్వగా.. ఎన్నికలకు ముందు రోజు రాత్రి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు డబ్బు పంపిణీనే నమ్ముకుంటున్నారు.
ఒక్కో ఓటుకు 2వేల నుంచి 5వేలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఒక్కో వార్డులో అభ్యర్థులు 40లక్షల నుంచి 60లక్షల వరకు పంపిణీ చేసేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే...పార్టీలు, అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలన్న లక్ష్యంతో...తెర వెనుక ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధాన పార్టీలన్నీ పోల్ మేనేజ్‌మెంట్‌లో నిమగ్నమయ్యాయి. మెజార్టీ పట్టణాల్లో ఒక్కో ఓటర్‌కు 4వేలు పంపిణీ చేస్తుంటే..మరికొన్ని చోట్ల 5 నుంచి 8వేలు పంపిణీ చేస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో 8వేల నుంచి 10వేల చొప్పున అందజేస్తున్నారు. కొన్ని మున్సిపాల్టీల్లో ఓ ప్రధాన పార్టీ ఇప్పటికే పంపిణీ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. దీంతో మిగతా పార్టీలపై ఓటర్లన ఉంచి ఒత్తిడి పెరగడంతో ఒక రోజు ముందే కంప్లీట్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండటంతో మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్...ఓటర్లను ప్రలోభపెట్టడంతో నిమగ్నమయ్యాయి. ఒక్కో పార్టీ ఒక్కో ఓటుకు తక్కువలో తక్కువ పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రధాన పార్టీ 5 వేలు పంపిణీ చేయడంతో..పోటీగా మరో పార్టీ 6వేలు ఓటుకు ఇచ్చినట్లు సమాచారం. ఛైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్న వార్డు మెంబర్లు, కార్పొరేటర్లు...8వేల నుంచి 10వేల దాకా డబ్బులు ఇచ్చారని తెలుస్తోంది. మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్న వారిలో పలువురు 30 నుంచి 50 లక్షలు ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదని పార్టీల నేతలు చెప్పుకుంటున్నారు.
ఔటర్ రింగ్ రోడ్డు సమీప ప్రాంతాల్లో ఓటుకు పది వేలు తక్కువ కాకుండా అభ్యర్థులు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నగదు సమీకరణ ఇబ్బందులు రావడంతో కొందరు నేతలు ఆన్‌లైన్‌లో..ఫోన్‌పే, గూగుల్ పే, వాట్సాప్, ఇతర ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా పంపకాలు చేస్తున్నారట. కొందరు అభ్యర్థులు రోజూ బీరు, బిర్యాణీ అందిస్తున్నారు. ఎన్నికలకు ముందు రోజు ఓటర్లకు బంగారం ఉంగరాలను పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు పెద్ద ఎత్తున చీరలు దిగుమతి చేసే మహిళలకు బహుమతిగా ఇస్తున్నారు. కొందరు అభ్యర్థులు ప్రతీ ఇంటికి 25 కిలోల బియ్యం బస్తాలను పంపిణీ చేస్తున్నారు. యువకులకు విహారయాత్రలకు తీసుకెళ్తాని చెబుతున్నారు. ఓటర్లకు వెండి వస్తువులను కానుకలుగా సమర్పిస్తున్నారు.
ఎన్నికల్లో మద్యం ప్రధాన ఇంధనంగా మారింది. ఓటర్లకు బీరు, బ్రాంది, విస్కీ, కల్లు పంపిణీ చేసి...తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓటర్లను మత్తులో ముంచేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు...ఎన్ని రకాల వ్యూహాలు అమలు చేయాలో అన్ని అమలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రాజకీయ పార్టీలు, పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడమే కాదు...అన్ని రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓటర్లకు బహుమతులు, మద్యం, చికెన్, ఇలా రకరకాలు పంపిణీ చేస్తూ...ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఎల్లంపేట్, మూడు చింతలపల్లి, అమన్‌గల్ మున్సిపాల్టీల్లో పెద్ద ఎత్తున డబ్బు, మద్యం పంచుతున్నట్లు ఓటర్లు చర్చించుకుంటున్నారు. ఎన్నికల్లో గెలిస్తే... మీ సామాజికవర్గానికి సంఘ భవనాలు నిర్మించి ఇస్తామని, మీ వాడకు సిమెంట్ రోడ్డు, ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ కట్టిస్తామంటూ హామీలిస్తున్నారు.