ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సెలబ్రిటీల గురించి సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి. తాజాగా అస్సామీ నటి కావేరి బరువా.. అల్లు అర్జున్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. ఆమె చేసిన ఆరోపణలు వైరల్ కావడంతో అల్లు అర్జున్ ఇమేజ్‌పై నెగిటివ్ ప్రభావం పడేలా పోస్టులు దర్శనమిచ్చాయి. అసలు విషయానికొస్తే.. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న నటి కావేరి బరువా.. గతంలో అల్లు అర్జున్‌తో కలిసి తాను చేసిన ఒక యాడ్ షూటింగ్ అనుభవాలను పంచుకుంది. అయితే షూటింగ్ సమయంలో అల్లు అర్జున్‌ను కలవడానికి లేదా ఆయనతో మాట్లాడటానికి ముందు ఆయన టీమ్ తనకు ఏకంగా 42 నిబంధనలు పెట్టిందని ఆమె ఆరోపించింది.
ఒక స్టార్ హీరోను కలవడానికి ఇన్ని షరతులా? అంటూ ఈ వీడియో క్లిప్ నెట్టింట దావానలంలా వ్యాపించింది. ఈ వీడియో వైరల్ అవ్వడం, దానిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించడంతో అల్లు అర్జున్ టీం వెంటనే అప్రమత్తమైంది. ఈ ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు. కావేరి బరువా వీడియోలో చెప్పిన విషయాలు పూర్తిగా అవాస్తవమని, అందులో ఏమాత్రం నిజం లేదని అధికారిక ప్రకటన విడుదల చేశారు. కేవలం సంచలనం కోసమే ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తున్నారని టీమ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతటితో ఆగకుండా ఈ విషయాన్ని తాము చాలా సీరియస్‌గా పరిగణిస్తున్నామని అల్లు అర్జున్ టీమ్ స్పష్టం చేసింది. బన్నీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న ఈ ఫేక్ న్యూస్‌ను పుట్టించిన వారిపై, బాధ్యతారాహిత్యంగా ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు హెచ్చరించింది. సెలబ్రిటీలపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం చట్టరీత్యా నేరమని వారు గుర్తుచేశారు.
చివరగా సోషల్ మీడియా వినియోగదారులకు కూడా అల్లు అర్జున్ కార్యాలయం ఒక విజ్ఞప్తి చేసింది. ధృవీకరించని కంటెంట్‌ను, నిరాధారమైన వీడియోలను షేర్ చేయవద్దని కోరింది. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి పుకార్లను నమ్మవద్దని సూచించింది. పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్న ఐకాన్ స్టార్‌పై ఇలాంటి రూమర్స్ రావడం ఇదే తొలిసారి కాకపోయినా, ఈసారి మాత్రం టీమ్ గట్టిగానే బదులివ్వడం గమనార్హం. ఏదేమైనా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో మీద ఇలాంటి ఆరోపణలు రావడం సంచలనంగా మారిందిప్పుడు. ఇది కావాలని కొందరు ఆయన్ని తక్కువ చేయడానికి చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.