దక్షిణ కొరియా సినిమా ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొరియన్ డ్రామాలకు ఇండియాలో కూడా డిమాండ్ బాగా పెరిగిపోయింది. తాజాగా ఆ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. కే-డ్రామా అభిమానులకు సుపరిచితుడైన ప్రముఖ నటుడు జంగ్ యున్ వూ ఇక లేరు. ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచినట్లు కొరియన్ మీడియా వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడు, ఇంత చిన్న వయసులోనే లోకాన్ని విడిచి వెళ్లడం అభిమానులను, సహచర నటులను దిగ్భ్రాంతికి గురిచేసింది.ఆయన మరణానికి గల కారణాలు ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. అయితే చనిపోవడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఇప్పుడు అందరినీ కలచివేస్తున్నాయి.
గతంలోనే మరణించిన ప్రముఖులు లెస్లీ చియుంగ్, అమీ వైన్‌హౌస్ ఫోటోలను షేర్ చేస్తూ.. మిమ్మల్ని మిస్ అవుతున్నా.. మీపై అసూయగా ఉంది.. బాధగా ఉంది అంటూ ఆయన రాసిన వాక్యాలు చూస్తుంటే.. జంగ్ ఏదో తెలియని అశాంతితో ఉన్నట్లు అనిపిస్తోంది. అంతేకాకుండా అంతకు ముందు రెడ్ మూన్ ఫోటోతో ఆయన పెట్టిన మరో పోస్ట్ కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. వేలాడుతున్నా సరే.. అది ఎలాగైనా కిందకు పడిపోవాల్సిందే అనే అర్థం వచ్చేలా ఆయన రాసిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ వరుస పోస్టులను గమనిస్తుంటే.. ఆయన గత కొంతకాలంగా తీవ్రమైన మానసిక సంఘర్షణ లేదా డిప్రెషన్‌లో ఉన్నారేమోనని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
జంగ్ యున్ వూ 1986లో ఇన్చియాన్‌లో జన్మించాడు. డోంగ్‌గుక్ యూనివర్శిటీలో నటనపై శిక్షణ తీసుకున్న ఆయన.. 2006లో రౌండప్ 3 ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 'స్మైల్ ఎగైన్', 'బ్రైడ్ ఆఫ్ ద సన్', 'ఫైవ్ ఫింగర్స్' వంటి సూపర్ హిట్ సీరియల్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా 'ఫైవ్ ఫింగర్స్'లోని ఆయన అద్భుతమైన నటనకు గాను 2012లో ప్రతిష్టాత్మక SBS న్యూ స్టార్ అవార్డు వరించింది. ఆయన చివరిసారిగా 2019లో వచ్చిన పాపులర్ సిరీస్ 'వెల్‌కమ్ టు వైకికి 2'లో మెరిశారు. ఆ తర్వాత తెరపై పెద్దగా కనిపించకపోయినప్పటికీ.. ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాయి. కేవలం 40 ఏళ్లకే ఆయన జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం పట్ల కొరియన్ చిత్ర పరిశ్రమతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు.