కాలానికి అతీతమైన అద్భుతం.. నాగబంధం టీజర్ విడుదల చేసిన మహేష్ బాబు..!

మహా శివరాత్రి పర్వదినాన అద్భుతమైన టీజర్ విడుదలైంది. అభిషేక్ నామా దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా తెరకెక్కుతున్న భారీ మైథో-యాక్షన్ చిత్రం 'నాగబంధం' టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు.

Post Published By: dialnews
Updated : 16 February 2026, 12:37 PM IST

మహా శివరాత్రి పర్వదినాన అద్భుతమైన టీజర్ విడుదలైంది. అభిషేక్ నామా దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా తెరకెక్కుతున్న భారీ మైథో-యాక్షన్ చిత్రం 'నాగబంధం' టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు. కిషోర్ అన్నపురెడ్డి, నిశితా నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోంది. టీజర్ చూసిన అనంతరం మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. నాగబంధం ప్రపంచం చాలా ఆకర్షణీయంగా ఉంది, ఈ చిత్రాన్ని వెండితెరపై చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ప్రశంసల వర్షం కురిపించారు. హిమాలయాల మంచు కొండల నేపథ్యంలో సాగే ఈ కథ, కాలానికి అందని ఒక రహస్యాన్ని, దాన్ని కాపాడే దైవశక్తిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది. బ్రహ్మ సృష్టి, విష్ణువు ధర్మం, మహాదేవుని ఆగ్రహం కలగలిసిన కథగా దీనిని అభివర్ణించారు.

చరిత్రలోని అబ్దుల్లీ దండయాత్రల స్ఫూర్తితో, పురాణాలను, చరిత్రను ముడిపెడుతూ ఈ కథను అద్భుతంగా మలిచారు. హిమాలయాల్లోని రహస్య మార్గాల్లో దాగి ఉన్న నాగబంధం ఆలయాన్ని, అందులోని అనంతమైన శక్తిని దుష్టశక్తుల చేతిలో పడకుండా కాపాడే ఒక యోధుని పోరాటమే ఈ సినిమా ఇతివృత్తం. దర్శకుడు అభిషేక్ నామా తన విజన్‌ను ఈ టీజర్‌లో స్పష్టంగా ఆవిష్కరించారు. ఒక్క డైలాగ్ కూడా లేకుండా.. కేవలం విజువల్స్, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తోనే ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ ప్రకృతి అందాలను బంధించగా, జునైద్ కుమార్ అందించిన సంగీతం సన్నివేశాలకు ప్రాణం పోసింది. అశోక్ కుమార్ ప్రొడక్షన్ డిజైన్, ఆర్‌సి ప్రణవ్ ఎడిటింగ్, అత్యున్నత స్థాయి వీఎఫ్ఎక్స్ ఈ సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాయి అనడంలో సందేహం లేదు.

హీరో విరాట్ కర్ణ తన మొదటి సినిమాతోనే ఒక పవర్‌ఫుల్ అవతారంలో కనిపిస్తున్నారు. ముఖ్యంగా మొసలితో చేసే పోరాట సన్నివేశం మరియు శివుడి గెటప్‌లో ఆయన చూపిన రౌద్రం టీజర్‌కే హైలైట్‌గా నిలిచాయి. ఆ పాత్రలో విరాట్ ఒదిగిపోయిన తీరు చూస్తుంటే, ఇది ఆయన కెరీర్‌కు ఒక మైలురాయిగా నిలిచేలా ఉంది. నిర్మాతలు ఇదే తమ తొలి ప్రయత్నం అయినప్పటికీ, ఎక్కడా రాజీపడకుండా భారీ సెట్స్ వేసి, అత్యుత్తమ నిర్మాణ విలువలతో ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, మురళి శర్మ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో జరిగిన మీడియా స్క్రీనింగ్‌లో ఈ టీజర్‌కు స్టాండింగ్ ఒవేషన్ లభించింది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొల్పుకున్న నాగబంధం.. ధర్మానికి విధ్వంసానికి మధ్య జరిగే ఒక ఎపిక్ యుద్ధాన్ని ఈ వేసవిలో ప్రేక్షకులకు అందించడానికి సిద్ధంగా ఉంది.

Published : 
  • 16 February 2026, 12:37 PM IST