సినిమాల్లోనో లేదంటే సోషల్ మీడియా వీడియోల్లో.. మనం ఓ మాట వింటూ ఉంటాం. మహిళలపై అఘాయిత్యాలు, చిన్నారులపై దారుణాలు చేసిన వారికి మధ్య ప్రాచ్యం అంటే.. గల్ఫ్ దేశాల్లో తక్షణ మరణ శిక్షలు ఉంటాయని. మన దేశంలో కూడా ఆ తరహా ఘటనలు జరిగిన ప్రతీసారి, ఈ విషయం ప్రస్తావనకు వస్తూ ఉంటుంది. అలాంటి చట్టాలు రావాలని డిమాండ్ చేస్తూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం.. మన దేశంలో న్యాయం ఆలస్యం కావడం. జైళ్ళలో వారికి రాచమర్యాదలు జరగడం. న్యాయం జరిగే లోపు సహజంగా మరణించడం వంటివి చూస్తూ ఉంటాం.
కానీ ఏపీలో జరుగుతోన్న కొన్ని కార్యక్రమాలు చూస్తే.. చట్టాలతో పని లేకుండా న్యాయం జరుగుతోంది. ఏం జరిగిందో అర్ధమైనా.. ఎవరూ వ్యతిరేకించలేని న్యాయం జరుగుతోంది. యాదృచ్చికమా మరొకటా.. భయమా, వేరే కారణమా అనేది పక్కన పెడితే.. బాధితులకు తక్షణ న్యాయం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నిందితులు. ఇతర రాష్ట్రాల్లో బాధితులు ఆత్మహత్య చేసుకుంటే.. ఏపీలో మాత్రం నిందితులు చేసుకుంటున్నారు.
ప్రధాన ఘటనలు ఒకసారి చూస్తే.. కడప జిల్లా.. మైలవరం మండలం ఎ.కంబాలదిన్నెలో 3 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన 26 ఏళ్ల రహమతుల్లా మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం అయింది. 13 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడి అరెస్టయిన 62 ఏళ్ల వృద్ధుడు కోర్టుకు తీసుకెళ్ళే క్రమంలో.. దారిలో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. అలాగే ఏడేళ్ళ క్రితం.. 9 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసిన 50 ఏళ్ల రిక్షా డ్రైవర్ సుబ్బయ్య మానసిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇప్పుడు తాజాగా మరో కిరాతకుడు ఇలాగే ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఏడేళ్ల బాలికను హత్య చేసిన నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం అయింది. అతడి మృతదేహాన్ని కురబాలకోట మండలం కనసానివారిపల్లి చెరువులో పోలీసులు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే ముదివేడు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కులవర్ధన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా అనుమానం వ్యక్తం చేసారు పోలీసులు.
నిన్నటి నుంచి పరారీలో ఉన్న కులవర్ధన్.. సడెన్ గా ఆత్మహత్య చేసుకోవడం సంచలనం అయింది. మదనపల్లెలో ఏడేళ్ళ వయసు ఉన్న ఓ పాప కనపడకుండా పోయింది. పోలీసులు పాప కోసం మూడు రోజులుగా గాలిస్తుండగా.. ఎదురుగా ఉన్న ఇంట్లోనే.. ఆ చిన్నారి మృతదేహం గుర్తించారు. విచారణలో.. కులవర్ధన్ బాలికను తీసుకుని వెళ్లి.. అత్యాచారం చేసి హత్య చేసినట్లు గుర్తించారు. హత్య చేసిన తర్వాత డ్రంలో మృతదేహాన్ని ఉంచాడు. చిన్నారికి బాలికకు మాయమాటలు చెప్పి, చాక్లెట్ ఆశజూపి ఇంట్లోకి తీసుకెళ్లి ప్రాణం తీసాడు. మదనపల్లి పట్టణ శివార్లలోని నీరుగట్టువారిపల్లిలోని కాట్లాటపల్లి రోడ్డులో నివసిస్తున్న దంపతుల ఏడేళ్ల కుమార్తె ఆ చిన్నారి.
దీనిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. పాపం చేసిన వాడికి కాలమే సమాధానం చెప్తుంది అంటూ ప్రసంశలు వస్తున్నాయి. సిఎం చంద్రబాబు పదే పదే ఓ మాట అంటూ ఉంటారు. దారుణాలకు పాల్పడే వారికి అదే చివరి రోజు అని.. ఇప్పుడు అదే జరిగింది అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. తుపాకి తుటాలే కాదు.. న్యాయం ఎలా అయినా చేయవచ్చు అంటూ మరికొందరి నుంచి కామెంట్స్ వస్తున్నాయి. బాధితులకు న్యాయం ఎలా జరిగిందో.. 2018 నుంచి సుబ్బయ్య నుంచి.. నేటి కులవర్ధన్ వరకు నిందితులకు స్పష్టమైన క్లారిటీ ఉందనే మాట మాత్రం అన్ని వర్గాల నుంచి వినపడుతోంది.