ఆ రెండింటి మధ్యనే తొలి మ్యాచ్… షెడ్యూల్ పై బీసీసీఐ కసరత్తు…!

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఐపీఎల్ 2026 సీజన్‌పై పడింది. ఓ వైపు పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు ఐపీఎల్ 2026

Post Published By: dialnews
Updated : 12 March 2026, 1:26 PM IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఐపీఎల్ 2026 సీజన్‌పై పడింది. ఓ వైపు పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు ఐపీఎల్ 2026 సీజన్‌పై ప్రభావం పడనుందని వార్తలు వస్తుండగా.. మరోవైపు షెడ్యూ‌ల్‌పై బీసీసీఐ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.ఐపీఎల్ టోర్నీ రూల్స్ ప్రకారం విజేతగా నిలిచిన జట్టు హోమ్ గ్రౌండ్‌లోనే తొలి మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ ఆడిస్తారు. రన్నరప్ టీమ్‌కు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు కేటాయిస్తారు. ఈ క్రమంలోనే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్‌సీబీ, సీఎస్‌కే మధ్య తొలి మ్యాచ్‌ను బీసీసీఐ షెడ్యూల్ చేసినట్లు క్రిక్ బజ్ పేర్కొంది.

సాధారణంగా ఐపీఎల్ మొదటి రోజున లీగ్‌లోని టాప్-4 ఫ్రాంచైజీల్లో ఒకదానిని ఆడించడానికి ఐపీఎల్ నిర్వాహకులు మొగ్గు చూపుతారు. ప్రస్తుతం ఈ లీగ్ లో ఆర్‌సీబీ, సీఎస్‌కే, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యంత విలువైన నాలుగు ఫ్రాంచైజీలుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2026 సీజన్‌ను ఆర్‌సీబీ, సీఎస్‌కే‌తో మొదలయ్యే అవకాశం ఉంది.మార్చి 25 (బుధవారం)న ముంబైలో 10 జట్ల కెప్టెన్లతో సమావేశం నిర్వహించనున్నట్లు బీసీసీఐ ఫ్రాంచైజీలకు సమాచారం అందించింది. అయితే ఈ సమావేశం అజెండాను బీసీసీఐ త్వరలోనే వెల్లడించనుంది. అప్‌కమింగ్ సీజన్‌ నేపథ్యంలో చేసే మార్పుల గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఐపీఎల్ విండోను మార్చి 28- మే 31 వరకు నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది. కానీ మ్యాచ్‌ల షెడ్యూల్‌‌ను వెల్లడించలేదు.

తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సోం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కోసం బీసీసీఐ ఎదురు చూస్తోంది. ఈ ఎన్నికల షెడ్యూల్ ఐపీఎల్ మ్యాచ్‌లకు క్లాష్ కాకుండా చూసే ప్రయత్నంలో ఉంది. చెన్నై, కోల్‌కతా వేదికగా సీఎస్‌కే, కేకేఆర్ హోమ్ మ్యాచ్‌లు ఆడనుండగా.. రాజస్థాన్ రాయల్స్ గౌహతి వేదికగా రెండు మ్యాచ్‌లు ఆడనుంది.

మరోవైపు పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు ఐపీఎల్‌పై ప్రభావం పడనుంది. మార్చి 28 ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభ తేదీ అని ప్రచారం చేస్తున్నా అధికారికంగా బీసీసీఐ ప్రకటించలేదు. గల్ఫ్‌లో యుద్ధం కారణంగా మన దేశంలో గ్యాస్ సిలిండర్లకు తీవ్ర కొరత ఏర్పడుతోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా గృహ వినియోగదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. కమర్షియల్ సిలిండర్‌ల సరఫరాను ఆపేయడంతో హోటళ్లు మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ కొరత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, మార్చి 28 వరకు పరిస్థితులు చక్కబడుతాయని ఆశిస్తున్నట్టు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు.

Published : 
  • 12 March 2026, 1:26 PM IST