పోయి కౌంటీ క్రికెట్ ఆడు… బెథెల్ కు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ సలహా…!

ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతోంది. ఆడిన ఆరు మ్యాచులలో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో ప్లేసులో నిలిచింది. గత సీజన్‌లో కలసికట్టుగా ఆడి టైటిల్ సాధించిన ఆ జట్టు

Post Published By: dialnews
Updated : 24 April 2026, 7:10 PM IST

ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతోంది. ఆడిన ఆరు మ్యాచులలో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో ప్లేసులో నిలిచింది. గత సీజన్‌లో కలసికట్టుగా ఆడి టైటిల్ సాధించిన ఆ జట్టు.. ఈ సీజన్‌లోనూ అలాంటి ప్రదర్శనే చేస్తోంది. అయితే తుది జట్టు విషయంలో ఆర్సీబీ పెద్దగా మార్పులు చేయలేదు. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లను తుది జట్టులోకి తీసుకోవడంతో ఆర్సీబీకి కొత్త చిక్కు వచ్చి పడింది. తుది జట్టులోకి తీసుకున్న ఆటగాళ్లు సత్తాచాటుతుండటంతో ప్రతిభ ఉన్నప్పటికీ పలువురు ఆటగాళ్లు బెంచ్‌కే పరిమితం అవుతున్నారు.ఆర్సీబీ విదేశీ ప్లేయర్లలో ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, జోష్ హేజిల్‌వుడ్‌లను తుది జట్టులోకి తీసుకుంటోంది.

హేజిల్ వుడ్ అందుబాటులో లేనప్పుడు జాకబ్ డఫీని ఆడించింది. అతడు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. దీంతో మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ అతడు మళ్లీ బెంచ్‌కే పరిమితం అవుతున్నాడు. ఇక ఇంగ్లాండ్‌కు చెందిన విధ్వంసకర ప్లేయర్లు జాకబ్ బెథెల్ , జోర్దన్ క్రాక్స్ లాంటి వారు సైతం అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.ముఖ్యంగా జాకబ్ బెథెల్.. టీ20 ప్రపంచకప్ 2026లో సత్తాచాటాడు. భారత్‌తో జరిగిన సెమీస్‌లో 45 బంతుల్లో సెంచరీ కొట్టాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు. కానీ అతడికి మాత్రం ఐపీఎల్‌ 2026లో ఆడే అవకాశం రావడం లేదు.

ఈ నేపథ్యంలో ఇదే విషయంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బెథెల్ లాంటి ప్రతిభావంతుడు బెంచ్‌పై కూర్చోవడం ఏమాత్రం బాలేదని వ్యాఖ్యానించాడు. ఓపెనర్‌గా, వన్ డౌన్‌లో అతడు సత్తాచాటగలడని పేర్కొన్నాడు.తన కెరీర్‌లో ముఖ్యమైన ఇలాంటి సమయంలో అతడు బెంచ్‌పై కూర్చొని టైమ్ వేస్ట్ చేయొద్దని కుక్ సూచించాడు. అతడికి ఐపీఎల్‌లో ఆడే అవకాశం రావట్లేదు కాబట్టి.. తిరిగి ఇంగ్లాండ్‌కు వచ్చి కౌంటీ క్రికెట్‌లో ఆడాలని చెప్పాడు. కాగా ఐపీఎల్ 2026లో ఆర్సీబీ ఆరు మ్యాచులు ఆడింది. లీగ్ స్టేజ్‌లో మరో 8 మ్యాచులు ఆడాల్సి ఉంది. మరి ఇప్పటికైనా అతడికి ఆడే అవకాశం వస్తుందా.. లేదా అన్నది తేలాల్సి ఉంది.

Published : 
  • 24 April 2026, 7:10 PM IST