అగ్ర నేతలను చంపేస్తే.. ఇరాన్ మా దారిలోకి వచ్చేస్తుంది.. ఇరాన్ తో వార్ స్టార్ట్ చేయకముందు ఇజ్రాయిల్, అమెరికా వేసుకున్న అంచనా ఇది. కానీ వార్ ఎన్ని రోజులు చేసినా సరే.. మేము చేయడానికి రెడీ అని.. ఎంత మంది లీడర్స్ ను చంపినా ఇరాన్ తగ్గడం లేదు. అసలు దీనికి రీజన్ ఏంటీ..? అదే మొజాయిక్ డిఫెన్స్ స్ట్రాటజీ.. ఈ మాట ఎప్పుడైనా విన్నారా..? లేదు కదా.. అసలు దీన్ని కనిపెట్టింది, అమెరికా రక్షణ సంస్థ.. డీఏఆర్‌పీఏ.. ప్రస్తుతం యుద్ధ క్షేత్రంలో దీనిని అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తోంది మాత్రం ఇరాన్.అమెరికా వంటి అగ్రరాజ్యాల ఖరీదైన యుద్ధనౌకలు, ఎఫ్-35 జెట్లను ఎదుర్కోవడానికి ఇరాన్ వాడుతున్న ఈ 'మొజాయిక్' వ్యూహంపై వరల్డ్ వైడ్ గా డిస్కషన్ నడుస్తోంది. సాధారణంగా ఏదైనా దేశం యుద్ధం చేయాలంటే భారీ యుద్ధ విమానాలు, పెద్ద పెద్ద నౌకల మీద ఆధారపడుతుంది. కానీ ఇరాన్ దగ్గర అంత టెక్నాలజీ లేదు. అందుకే ఆ దేశం 'మొజాయిక్ వార్ఫేర్' అనే ఒక తెలివైన దారిని ఎంచుకుంది. అంటే ఏనుగును చంపడానికి తేనెటీగల దండు మీద పడ్డట్టు.
అది ఎలా అంటే.. అమెరికా దగ్గర ఒకే ఒక పెద్ద 'ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్' ఉంటుంది, దాని ధర వేల కోట్లు. ఇరాన్ ఏం చేస్తుందంటే, ఆ ఒక్క పెద్ద నౌకను కొట్టడానికి వందల సంఖ్యలో చిన్న చిన్న ఆత్మహుతి డ్రోన్లను పంపిస్తుంది. అమెరికా తన రూ. 20 కోట్ల క్షిపణితో ఇరాన్ పంపిన రూ. 20 లక్షల డ్రోన్‌ను కూల్చాలి. ఇలా వందల డ్రోన్లు వస్తే అమెరికా క్షిపణులు ఖాళీ అయిపోతాయి, కానీ ఇరాన్ దగ్గర డ్రోన్లు ఇంకా మిగిలే ఉంటాయి. ఇదే 'మొజాయిక్'లోని అసలు కిటుకు.ఇంకొకటి ఏంటీ అంటే.. ఇరాన్ తన ఆయుధాలన్నింటినీ ఒకే చోట ఉంచదు. చిన్న చిన్న మొబైల్ లాంచర్లు, భూగర్భ సొరంగాలు, సాధారణ పడవల్లో క్షిపణులను అమర్చుతుంది. అమెరికా ఒక స్థావరాన్ని ధ్వంసం చేసినా, మిగిలిన వందల చిన్న యూనిట్లు దాడులు చేస్తూనే ఉంటాయి. ఒక్క యూనిట్ నాశనం అయినా.. మిగిలిన యూనిట్ లు అటాక్ చేస్తూనే ఉంటాయి. అంటే ఎవడో ఇచ్చే కమాండ్ కోసం ఈ యూనిట్స్ చూడవు.
ఇరాన్ వాడుతున్న డ్రోన్లు, క్షిపణులు చాలా చౌకైనవి. కానీ అవి అమెరికాలోని అత్యంత ఖరీదైన రక్షణ వ్యవస్థలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. డియాగో గార్సియా లేదా ఎల్ఎన్జీ ప్లాంట్లపై జరిగిన దాడుల్లో ఇరాన్ ఇదే పద్ధతిని వాడింది. ఒకేసారి వివిధ దిశల నుండి క్షిపణులు రావడంతో అమెరికా రాడార్లు ఏ దాన్ని అడ్డుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యాయి. ట్రంప్ ఇప్పుడు యుద్ధం ముగించాలని అనుకోవడానికి ప్రధాన కారణం ఈ మొజాయిక్ వ్యూహమే. అమెరికా ఎంత ప్రయత్నించినా ఇరాన్ ఆయుధ సంపత్తిని పూర్తిగా తుడిచిపెట్టలేదు.ఎందుకంటే ఇరాన్ ఆయుధాలు దేశమంతా చిన్న చిన్న ముక్కలుగా విస్తరించి ఉన్నాయి. చిన్న చిన్న యూనిట్స్ కి కమాండర్ లు కూడా ఉంటారు. వాళ్ళ దగ్గర సైబర్ అటాక్ చేసే టీం కూడా ఉంటుంది. ఏ రకంగా అయినా శత్రువును అటాక్ చేసే సత్తా ఉంటుంది. అందుకే ఈ 'అంతులేని తేనెటీగల దాడి'ని తట్టుకోవడం అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెను భారంగా మారింది. "పెద్ద ఆయుధం కంటే.. అనేక చిన్న ఆయుధాలే శక్తివంతమైనవి" అని ఇరాన్ నిరూపిస్తోంది. అందుకే అగ్రరాజ్యం అమెరికా కూడా ఇప్పుడు తన వ్యూహాలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.