Top story:ఖతార్ ఎనర్జీ సంచలన ప్రకటన… 5 ఏళ్ల పాటు గ్యాస్ కట్? రాస్ లఫాన్ విధ్వంసం వెనుక అసలు నిజాలివే…!

ఖతార్‌లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై జరిగిన క్షిపణి దాడులు ప్రపంచ ఇంధన ముఖచిత్రాన్ని మార్చేయబోతున్నాయనే విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. ఖతార్ ఎనర్జీ విడుదల చేసిన తాజా గణాంకాలు కేవలం ఒక

Post Published By: dialnews
Updated : 21 March 2026, 1:50 PM IST

ఖతార్‌లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై జరిగిన క్షిపణి దాడులు ప్రపంచ ఇంధన ముఖచిత్రాన్ని మార్చేయబోతున్నాయనే విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. ఖతార్ ఎనర్జీ విడుదల చేసిన తాజా గణాంకాలు కేవలం ఒక దేశం ఎదుర్కొనే నష్టాలను మాత్రమే కాకుండా, రాబోయే ఐదేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా సామాన్యుడి జేబుకు చిల్లు పడబోయే సంక్షోభాలను మన కళ్ళ ముందు ఉంచుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ఎగుమతి కేంద్రమైన రాస్ లఫాన్ కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు, అది గ్లోబల్ ఎనర్జీ హబ్. దీనిపై దాడి అంటే ప్రపంచం మొత్తానికి గ్యాస్ సరఫరా చేసే 'గుండె'పై దాడి చేయడమే.

ఖతార్ ఎనర్జీ అంచనా ప్రకారం, ఏటా 20 బిలియన్ డాలర్ల అంటే మన కరెన్సీలో సుమారు రూ.1.67 లక్షల కోట్లు ఆదాయం గాలిలో కలిసిపోనుంది. ఇది కేవలం అమ్మకాల ద్వారా వచ్చే నష్టం మాత్రమే కాదు. దీనివల్ల ఖతార్ చేపట్టాలనుకున్న భవిష్యత్తు ప్రాజెక్టులు, ఇతర దేశాల్లో పెట్టుబడులు అన్నీ నిలిచిపోతాయి. ఈ భారీ లోటును పూడ్చుకోవడానికి ఖతార్ తన అంతర్జాతీయ నిల్వలను వాడాల్సి వస్తుంది, ఇది గల్ఫ్ దేశాల ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. దాడుల వల్ల 12.8 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి నిలిచిపోయింది.

ఇది ఖతార్ మొత్తం ఎగుమతుల్లో 17 శాతంగా ఉందంటే.. ఏ స్థాయిలో ప్రభావం ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ 17 శాతం గ్యాస్ ప్రధానంగా యూరప్, ఆసియా దేశాలకు వెళ్లేది. ఇప్పుడు ఆయా దేశాలు తమ విద్యుత్ ప్లాంట్లు, పరిశ్రమలను నడపడానికి ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుక్కోవాలి. సప్లై తగ్గడం వల్ల మార్కెట్‌లో డిమాండ్ పెరిగి, ఎల్‌ఎన్‌జీ ధరలు గతంలో ఎన్నడూ లేని స్థాయికి చేరుకుంటాయి. దీర్ఘకాలిక ఒప్పందాలపై 'ఫోర్స్ మెజూర్' ప్రకటించడం అంటే, "మేము మీకు గ్యాస్ సరఫరా చేయలేము, మా చేతుల్లో ఏమీ లేదు" అని అధికారికంగా చేతులెత్తేయడం.

దీని కారణంగా జపాన్, దక్షిణ కొరియా, చైనా, భారత్ వంటి దేశాలు ఖతార్‌తో కుదుర్చుకున్న 15-20 ఏళ్ల సుదీర్ఘ ఒప్పందాలకు ఇప్పుడు దిక్కు లేకుండా పోయింది. ఐదేళ్ల పాటు ఈ పరిస్థితి ఉంటుందని చెప్పడం అంటే, ఈ దేశాలు ఇప్పుడు అమెరికా లేదా ఆస్ట్రేలియా నుంచి భారీ ధరలకు గ్యాస్ కొనాల్సి వస్తుంది. ఒక గ్యాస్ ప్లాంట్ దెబ్బతింటే దానిని బాగు చేయడం సాధారణ విషయం కాదు. అక్కడ వాడే అత్యాధునిక యంత్రాలు, భారీ టర్బైన్లు, క్రయోజెనిక్ ట్యాంకర్లు మళ్లీ తయారు కావడానికి సంవత్సరాలు పడుతుంది.

యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, నిపుణులు అక్కడికి వచ్చి పని చేయడానికి భయపడటం వల్ల మరమ్మత్తులు మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. షెల్ సంస్థ నడుపుతున్న 'పర్ల్ జిటిఎల్' ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్-టు-లిక్విడ్ ప్లాంట్. ఇది అత్యున్నత నాణ్యత గల డీజిల్, కిరోసిన్, విమాన ఇంధనం, లూబ్రికెంట్స్ తయారు చేస్తుంది. ఈ ప్లాంట్ దెబ్బతినడం వల్ల విమానయాన సంస్థలకు ఫ్యూయల్ కొరత ఏర్పడి, విమాన ప్రయాణ ధరలు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇంజిన్ ఆయిల్స్ కొరత వల్ల రవాణా రంగం ఇబ్బంది పడుతుంది.

కండెన్సేట్ అనే ముడి సరుకు 24% లోటు ఉండనుంది. ఇది పెట్రోకెమికల్ పరిశ్రమలకు ముడిసరుకు. ప్లాస్టిక్ నుంచి మందుల తయారీ వరకు దీని అవసరం ఉంటుంది. ఎల్పీజీ 13% లోటు ఎదుర్కొనే అవకాశం ఉంది. వంట గ్యాస్ ధరలపై ఇది నేరుగా ప్రభావం చూపుతుంది. హీలియం 14% లోటు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఇది అత్యంత కీలకంగా చెప్పుకోవచ్చు. హాస్పిటల్స్‌లో ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ల కూలింగ్ కోసం హీలియం వాడతారు. ఐటి రంగంలో చిప్ తయారీకి కూడా ఇది అవసరం. హీలియం కొరత ఏర్పడితే వైద్య, సాంకేతిక రంగాలు స్తంభిస్తాయి.

ఇక ఈ ప్రభావం భారత్ పై కూడా తీవ్రంగా పడే అవకాశం ఉంది. భారత్ తన గ్యాస్ అవసరాల్లో సగానికి పైగా ఖతార్ నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు గ్యాస్ రాకపోతే, దేశంలోని ఫర్టిలైజర్ ప్లాంట్లు మూతపడతాయి, తద్వారా సాగు ఖర్చు పెరిగి ఆహార పదార్థాల ధరలు పెరుగుతాయి. అలాగే ఈ దాడుల వెనుక ఉన్న శక్తులపై ఖతార్ ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది. ఇది గల్ఫ్ ప్రాంతంలో ఒక పూర్తిస్థాయి యుద్ధానికి దారితీయవచ్చు. హోర్ముజ్ జలసంధితో పాటు రాస్ లఫాన్ సురక్షితం కాదని తేలడంతో, ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరిగి సముద్ర మార్గంలో రవాణా భారం అవుతుంది. ఖతార్ ఎనర్జీ ప్రకటన కేవలం ఆర్థిక నష్టం గురించి మాత్రమే కాదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్.

Published : 
  • 21 March 2026, 1:50 PM IST