Top story:ఇదే నిజమైన రాతి యుగం…! బీ1 బ్రిడ్జిపై దాడికి రిటర్న్ గిఫ్ట్ రెడీ…ఇరాన్ హిట్ లిస్టులో గల్ఫ్ దేశాలు…!

"ఇరాన్‌ను తిరిగి రాతి యుగంలోకి తీసుకెళతాం". వైట్‌హౌస్‌ సాక్షిగా ఇరాన్‌కు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ఇది. ఈ హెచ్చరిక చేసిన గంటల వ్యవధిలోనే అన్నంతపనీ చేశాడు ట్రంప్. మిడిల్ ఈస్ట్‌లో అత్యంత ఎత్తైన వంతెనను అమెరికా ధ్వంసం చేసింది.

Post Published By: dialnews
Updated : 4 April 2026, 1:50 PM IST

"ఇరాన్‌ను తిరిగి రాతి యుగంలోకి తీసుకెళతాం". వైట్‌హౌస్‌ సాక్షిగా ఇరాన్‌కు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ఇది. ఈ హెచ్చరిక చేసిన గంటల వ్యవధిలోనే అన్నంతపనీ చేశాడు ట్రంప్. మిడిల్ ఈస్ట్‌లో అత్యంత ఎత్తైన వంతెనను అమెరికా ధ్వంసం చేసింది. ఈ దాడిలో 8 మంది మృతి చెందగా.. 90 మందికిపైగా గాయపడినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. వంతెనపై దాడి చేసిన తర్వాత ఇరాన్‌పై మరిన్ని దాడులు జరగబోతున్నాయని ట్రంప్ పేర్కొన్నాడు. దాడికి సంబంధించిన దృశ్యాలను డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్‌ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ఇరాన్‌లోని అతిపెద్ద వంతెన కుప్పకూలింది. ఇది ఇకపై ఎప్పటికీ ఉపయోగపడదు. మున్ముందు ఇంకా చాలా ఉన్నాయని పేర్కొన్నాడు. సమయం మించిపోకముందే ఇరాన్ ఓ ఒప్పందానికి రావాలని హెచ్చరించాడు. ఈ దాడి యుద్ధాన్ని మరింత విధ్వంసక మలుపు తిప్పబోతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఎందుకంటే, ఇది ఇరాన్‌కు అత్యంత కీలకమైన బ్రిడ్జి, అంతేకాదు, టెహ్రాన్‌ ఇజ్జత్‌కా సవాల్ కూడా. అమెరికా దాడి చేసిన బీ1 వంతెన టెహ్రాన్, కరాజ్ నగరాలను కలుపుతుంది. దీని స్తంభం ఎత్తు సుమారు 136 మీటర్లు. పశ్చిమ ఆసియాలోనే అత్యంత ఎత్తైన వంతెనగా పేరుగాంచింది. దీనిని సుమారు 400 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించారు. ఇది ఇరాన్ గర్వకారణంగా భావించే మౌలిక సదుపాయాల్లో ఒకటి. అంతేకాదు, ప్రస్తుత యుద్ధంలో ఇరాన్ బాలిస్టిక్ మిస్సైళ్ల తరలింపునకు ఇది కీలకంగా వ్యవహరిస్తోంది. అమెరికా రక్షణశాఖ నివేదికల ప్రకారం, టెహ్రాన్‌లోని ఆయుధ కర్మాగారాల నుండి పశ్చిమ ఇరాన్‌లోని లాంచింగ్ సైట్లకు బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్ విడిభాగాలను తరలించడానికి ఈ వంతెన కీలకంగా మారింది. ఈ వంతెనపై దాడి ద్వారా కేవలం సైనిక స్థావరాలనే కాకుండా, సైన్యానికి సహకరించే పౌర మౌలిక సదుపాయాలను కూడా తాము లక్ష్యం చేసుకోగలమని అమెరికా సంకేతాలిచ్చింది. ఈ భారీ వంతెన కూలిపోవడం వల్ల ఇరాన్ రక్షణ సరఫరా వ్యవస్థకు పెద్ద విఘాతం కలిగింది. తద్వారా ఇరాన్ తమతో సంధికి రావాలని అగ్రరాజ్యం భావిస్తోంది. కానీ, ఇరాన్ నుంచి మరో రకమైన స్పందన వచ్చింది.

బీ1 బ్రిడ్జిపై అమెరికా దాడికి ఇరాన్ ఇచ్చిన రిప్లై ఇదే. మధ్యప్రాచ్య ప్రాంతంలోని ఎనిమిది ప్రధాన వంతెనల జాబితాను ఇరాన్ విడుదల చేసింది, ఉత్తర నగరమైన కరాజ్‌లోని కీలక మౌలిక సదుపాయాలపై అమెరికా-ఇజ్రాయెల్ దాడికి కౌంటర్‌గా ప్రతీకార చర్య ఉంటుందని సూచించింది. ఈ 'హిట్ లిస్ట్‌ను ప్రచురిస్తూ, ఇరాన్ సెమీ అఫీషియల్ ఫార్స్ న్యూస్ ఏజెన్సీ, ఇరాన్ అత్యంత ఎత్తైన బి1 వంతెనపై రెండు దాడులు జరిగిన తర్వాత, గల్ఫ్ దేశాలు, జోర్డాన్‌లోని పలు ప్రముఖ వంతెనలు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లక్ష్యాలు కావచ్చని తెలిపింది. టర్కీ మీడియా అనడోలు నివేదిక ప్రకారం, ఇరాన్ జాబితాలో కువైట్‌లోని షేక్ జాబర్ అల్-అహ్మద్ అల్-సబా సీ బ్రిడ్జ్, యూఏఈలోని షేక్ జాయెద్ బ్రిడ్జ్, అల్ మక్తా బ్రిడ్జ్, షేక్ ఖలీఫా బ్రిడ్జ్.. సౌదీ అరేబియాను బహ్రెయిన్‌తో కలుపుతున్న కింగ్ ఫహద్ కాజ్వే వంతెన అలాగే జోర్డాన్‌లోని కింగ్ హుస్సేన్ బ్రిడ్జ్, దమియా బ్రిడ్జ్.. అబ్దౌన్ బ్రిడ్జ్ ఉన్నాయి. సో.. ఐఆర్‌జీసీ ఎప్పుడైనా ఈ ఎనిమిది వంతెనలనూ టార్గెట్ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే ఈ యుద్ధం మరింత విధ్వంసం సృష్టించడం ఖాయం. ఎందుకంటే, ఈ వంతెనలపై దాడులు జరిగితే అది కేవలం రెండు దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది.

ఇప్పటివరకు యుద్ధం అమెరికా-ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్‌గా ఉంది. ఒకవేళ ఇరాన్ కనుక గల్ఫ్, జోర్డాన్ దేశాల్లోని వంతెనలను కొడితే.. సౌదీ, యూఏఈ, కువైట్, జోర్డాన్ నేరుగా యుద్ధంలోకి దిగాల్సి వస్తుంది. ఇది మొత్తం మధ్యప్రాచ్యాన్ని అగ్నిగుండంగా మారుస్తుంది. గల్ఫ్ దేశాల మధ్య రవాణా వ్యవస్థ స్తంభిస్తుంది. ముఖ్యంగా కింగ్ ఫహద్ కాజ్వే వంటి వాటిపై దాడి జరిగితే వాణిజ్యం పూర్తిగా నిలిచిపోతుంది. ఈ ప్రాంతం ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ వంటిది. వంతెనలు, రేవులపై దాడులు జరిగితే సరఫరా గొలుసు తెగిపోయి పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. కారాజ్ వంతెన దాడిలో పౌరులు మరణించినట్లే, ఈ 8 వంతెనలపై దాడులు జరిగితే భారీ సంఖ్యలో పౌర నష్టం జరిగే అవకాశం ఉంది. సౌదీ, యూఏఈ ఇప్పటికే ఇరాన్‌పై నేరుగా దాడులు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆ దేశాల్లోని మౌలికవసతులపై దాడులు జరిగితే పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. ఇరాన్ ఇప్పటివరకూ గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై మాత్రమే దాడులు చేస్తూ వచ్చింది. తాజా హిట్ లిస్టులో మౌలిక సదుపాయాలపై దాడి చేస్తామని చెప్పింది. అదే జరిగితే పశ్చిమాసియా రణరంగం గామారడం ఖాయం.

 

Published : 
  • 4 April 2026, 1:50 PM IST