చేసినవి 9 ఆగినవి 19…!

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ అంటేనే ఒక వైబ్రేషన్. పవన్ కళ్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టినా, మాస్ రాజా రవితేజతో ‘మిరపకాయ్’ తీసినా ఆయన స్టైలే వేరు. రీసెంట్ గా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ తో తనలో పస అలాగే ఉందని హరీశ్ శంకర్ మరోసారి ప్రూవ్

Post Published By: dialnews
Updated : 14 April 2026, 9:50 AM IST

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ అంటేనే ఒక వైబ్రేషన్. పవన్ కళ్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టినా, మాస్ రాజా రవితేజతో ‘మిరపకాయ్’ తీసినా ఆయన స్టైలే వేరు. రీసెంట్ గా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ తో తనలో పస అలాగే ఉందని హరీశ్ శంకర్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.‌ అయితే, వెండితెరపై మనం చూసే రంగుల ప్రపంచం వెనుక ఎంతో కష్టం, మరెన్నో నిరాశలు ఉంటాయని హరీష్ శంకర్ తాజాగా బయటపెట్టారు. తిరువీర్ ప్రధాన పాత్రలో నటించిన ‘పాపం ప్రతాప్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న హరీష్ శంకర్, నటుడు తిరువీర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. "సారీ తిరువీర్.. నిజం చెప్పాలంటే ఇప్పటివరకు నువ్వు నటించిన సినిమాలు నేను చూడలేదు. కానీ, ఈ ‘పాపం ప్రతాప్’ ట్రైలర్ చూశాక నీ యాక్టింగ్ నాకు చాలా నచ్చింది. ట్రైలర్ చూస్తున్నంత సేపు నాకు స్క్రీన్ మీద కేవలం ప్రతాప్ పాత్ర మాత్రమే కనిపించింది.నటుడు తిరువీర్ కనిపించలేదు. అది నీ ప్రతిభకు నిదర్శనం" అంటూ కితాబు ఇచ్చారు.

సినిమా దర్శకుడు దుర్గా నరేష్ గురించి మాట్లాడుతూ.. నరేష్ ఈ చిత్రాన్ని ఎంతో కష్టపడి తెరకెక్కించారని హరీష్ శంకర్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సినిమా పరిశ్రమలో ఉండే ఒడిదుడుకుల గురించి ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. నరేష్ గతంలో అనుకున్న చాలా సినిమాలు కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యాయని తెలిసిందని, అయితే దానికేం బాధపడాల్సిన అవసరం లేదని ఆయన ధైర్యం చెప్పారు. హరీష్ శంకర్ తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు."నరేష్.. నీకు ఒక విషయం చెబుతున్నాను. ఇండస్ట్రీలో నేను ఇప్పటివరకు చేసినవి కేవలం 9 సినిమాలు మాత్రమే. కానీ, చర్చల దశలో ఉండి, సెట్స్ పైకి వెళ్లకుండా ఆగిపోయినవి మాత్రం 19 చిత్రాలు. ఇది అందరికీ తెలియని నిజం." ప్రెస్ మీట్లు పెట్టి, హీరోలు ఓకే చెప్పి, ఇక రేపు ఎల్లుండి ముహూర్తం అనగా షూటింగ్ క్యాన్సిల్ అయిన సందర్భాలు కూడా తన కెరీర్‌లో ఉన్నాయని ఆయన వెల్లడించారు.

సినిమా రంగంలో సక్సెస్ అనేది కేవలం హిట్ల మీద మాత్రమే ఆధారపడి ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. హరీష్ శంకర్ మాటల్లో సక్సెస్ అంటే ఒక కొత్త నిర్వచనం వినిపించింది. "మనం ఈ ఇండస్ట్రీకి వచ్చింది మనకు నచ్చిన పనిని చేయడానికి. ఆ నచ్చిన పనిని మనం చేయగలిగితే, అక్కడే మనం సక్సెస్ అయినట్లు లెక్క. మనకు నచ్చిన పని చేసి, అది ప్రేక్షకులకు కూడా నచ్చితే అది బోనస్ అవుతుంది. కాబట్టి ఆగిపోయిన సినిమాల గురించి ఆలోచించకుండా, మనకు దక్కిన అవకాశాన్ని గొప్పగా మలుచుకోవాలి" అని ఆయన హితవు పలికారు. హరీష్ శంకర్ చేసిన ఈ వ్యాఖ్యలు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే దర్శకులకు, టెక్నీషియన్లకు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని సినిమాలు ఆగిపోయినా పట్టుదలతో ముందుకు సాగితేనే ఇండస్ట్రీలో నిలబడగలమని ఆయన తన 19 క్యాన్సిల్డ్ సినిమాల ఉదాహరణతో నిరూపించారు.

Published : 
  • 14 April 2026, 9:50 AM IST