Top story: ఇరాన్‌ చేతికి చైనా, రష్యా పవర్‌ఫుల్ వెపన్స్ హార్ముజ్‌లో అసలు ఆటకి రీజన్ ఇదేరా ట్రంపూ…!

టార్గెట్ మిస్ అవ్వదు.. గురి తప్పదు.. మొదటి క్షిపణే మీ యుద్ధ నౌకల్ని సముద్ర గర్భంలో కలిపేస్తుంది'. హార్ముజ్‌ అష్టదిగ్బంధన వ్యూహంవేళ అమెరికాకు ఇరాన్ ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇది. ఈ రేంజ్ హెచ్చరిక ఊరికే చేయలేదు.

Post Published By: dialnews
Updated : 17 April 2026, 4:30 PM IST

'టార్గెట్ మిస్ అవ్వదు.. గురి తప్పదు.. మొదటి క్షిపణే మీ యుద్ధ నౌకల్ని సముద్ర గర్భంలో కలిపేస్తుంది'. హార్ముజ్‌ అష్టదిగ్బంధన వ్యూహంవేళ అమెరికాకు ఇరాన్ ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇది. ఈ రేంజ్ హెచ్చరిక ఊరికే చేయలేదు. అమెరికా శక్తివంతమైన యుద్ధ నౌకల్ని మొదటి ప్రయత్నంలోనే ముంచేసే సత్తా ఉందికాబట్టే ఈ వార్నింగ్ ఇచ్చారు. ఇదే నిజాన్ని అంతర్జాతీయ మీడియా ఫైనాన్షియల్ టైమ్స్ కూడా నిర్థారించింది. అమెరికాతో యుద్ధంలో ఇరాన్ వెనుక చైనా ఎంత బలంగా నిలబడిందన్న టాప్ సీక్రెట్స్‌ను బయటపెట్టింది. ఆ డీటెయిల్స్ టాప్ తాజాగా ట్రంప్ చేసిన ట్వీట్ ఇది. ఇరాన్‌కు చైనా ఆయుధాలను సరఫరా చేయకూడదని అంగీకరించిందని ట్రంప్ ప్రకటించాడు. ముఖ్యంగా ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని శాశ్వతంగా తెరిచి ఉంచేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు చైనా మద్దతిస్తోందని పేర్కొన్నాడు.

హార్ముజ్ జలసంధిని తాను శాశ్వతంగా ఓపెన్ చేస్తున్నందుకు చైనా చాలా సంతోషంగా ఉందనీ, ఇది ప్రపంచం కోసం, వారికోసంకూడా తాను చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. త్వరలో తాను చైనా పర్యటనకు వెళ్తున్నానని, జిన్‌పింగ్ తనను ఆలింగనం చేసుకుని ఆహ్వానిస్తారని ధీమా వ్యక్తం చేశాడు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఫైనాన్షియల్ టైమ్స్ సంచలన కథనం ప్రచురించింది. అందులో ఇరాన్‌కు చైనా నుండి ఆయుధాలే కాదు అంతకుమించిన స్పై శాటిలైట్ మద్దతు కూడా అందుతోందని తేల్చేసింది.TEE-01B.. అమెరికాతో యుద్ధంలో ఇరాన్‌కు చైనా అందించిన పవర్‌ఫుల్ వెపన్ ఇదే. ఇది ఒక నిఘా శాటిలైట్. దీనిని చైనా సంస్థ 'ఎర్త్ ఐ కంపెనీ' అభివృద్ధి చేసి ప్రయోగించింది. అనంతరం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌కు చెందిన ఏరోస్పేస్ విభాగానికి దీనిని అప్పగించారు. కక్ష్యలోకి విజయవంతంగా చేరిన తర్వాతే విదేశీ కొనుగోలుదారులకు ఉపగ్రహాలను బదిలీ చేసే 'ఇన్-ఆర్బిట్ డెలివరీ' అనే పద్ధతిలో ఈ ఒప్పందం జరిగింది.

ఒప్పందంలో భాగంగా బీజింగ్‌కు చెందిన ఎంపోశాట్ అనే మరో సంస్థకు చెందిన కమర్షియల్ గ్రౌండ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను కూడా వినియోగించుకునేందుకు ఇరాన్‌కు అనుమతి లభించింది. ఈ శాటిలైట్‌ను ఉపయోగించి ప‌శ్చిమాసియాలోని కీలకమైన అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ నిఘా పెట్టింది. మార్చి 13, 14, 15 తేదీల్లో సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ చిత్రాలను ఈ శాటిలైట్ బంధించింది. అదే సమయంలో జోర్డాన్‌లోని మువాఫక్ సల్తీ ఎయిర్ బేస్, బహ్రెయిన్‌లోని అమెరికా ఐదో ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ సమీప ప్రాంతాలు, ఇరాక్‌లోని ఎర్బిల్ ఎయిర్‌పోర్ట్‌ వద్ద కార్యకలాపాలను కూడా ట్రాక్ చేసినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. 'ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్' ఫొటోల తీసిన తర్వాతి రోజు అక్కడ ఉన్న అమెరికన్ విమానాలు దెబ్బతిన్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించాడు.

చైనా మాత్రమే కాదు, ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ బాంబు దాడులు ప్రారంభమైన తర్వాత, అమెరికా-ఇజ్రాయెల్ లక్ష్యాలకు సంబంధించిన రష్యన్ శాటిలైట్ నిఘా సమాచారాన్ని కూడా ఇరాన్ పొందిందని నివేదికలు తేల్చాయి. ఈ వార్తలను రష్యా ఖండించింది. ఇప్పుడు చైనా కూడా అదే చేస్తోంది. తాము ఇరాన్‌కు ఎలాంటి మిలిటరీ మద్దతు అందించడం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవలి రోజుల్లో పదేపదే ఖండించింది. ఇరాన్, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి చైనా చాలా కాలంగా మద్దతు ఇస్తోందని, క్షిపణి ఉత్పత్తికి ఉపయోగపడే 'డ్యూయల్ యూజ్' పారిశ్రామిక భాగాలను అందిస్తోందని అమెరికా ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్‌కు చైనా ఆయుధాల సరఫరా చేయబోమని హామీ ఇచ్చినట్టు ట్రంప్ ప్రకటించాడు. అప్పుడే చైనా నిఘా శాటిలైట్ సహాయానికి సంబంధించిన రహస్యం వెలుగులోకి వచ్చింది.

సాధారణంగా ఇరాన్ తన దాడుల కోసం ఇతర దేశాల సహకారంపై ఆధారపడుతుంది. ఇప్పుడు డ్రాగన్ కంట్రీ సహకారంతో సొంతంగా శాటిలైట్ డేటాను పొందుతుండటం వల్ల, అమెరికా యుద్ధ నౌకలు, విమాన వాహక నౌకల కదలికలను ఇరాన్ ఎప్పటికప్పుడు కనిపెట్టే అవకాశం ఉంది. తద్వారా ఇరాన్ మరింత తెగింపుతో దాడులు చేసే ప్రమాదం ఉంది. తాజాగా ఇరాన్ సైన్యం అలాంటి ప్రకటనే చేసింది. హర్మూజ్‌ జలసంధిపై ఆధిపత్యం కోసం అమెరికా యత్నిస్తే ఊరుకునేది లేదని ఇరాన్ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ సైనిక సలహాదారు మోహ్‌సేన్ రెజాయి హెచ్చరించాడు. తమ మిస్సైల్స్ అత్యంత కచ్చితత్వంతో దాడులు చేయగలవని హెచ్చరించాడు. ఇరాన్ ప్రయోగించే ఫస్ట్ మిస్సైల్‌కే అమెరికా నౌకలు సముద్రంలో మునిగిపోతాయంటూ వార్నింగ్ ఇచ్చారు. చైనా శాటిలైట్ సపోర్ట్ ఉంది కాబట్టే ఆయన ఈ రేంజ్‌లో వార్నింగ్ ఇచ్చాడు. సో.. ట్రంప్ చెబుతున్నట్టు ఇరాన్‌కు చైనా ఆయుధ సరఫరా ఆపేస్తామని హామీ ఇవ్వడం కాదు.. అమెరికా అంతుచూడటమే లక్ష్యంగా పరోక్షంగా పావులు కదుపుతోంది.

 

Published : 
  • 17 April 2026, 4:30 PM IST