తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఇప్పుడు చర్చంతా ఒక్కరి చుట్టూనే తిరుగుతోంది. అసెంబ్లీ లోపలైనా, బయటైనా లక్కలతో సహా ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. అధికార పక్షానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు ఆ వ్యక్తి. ఆయనే BRS 'ట్రబుల్ షూటర్', మాజీ మంత్రి హరీశ్ రావు. ఇప్పుడు అన్ని పార్టీలకు ఆయనే ప్రధాన శత్రువుగా మారారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. హరీష్ రావును రాజకీయంగా ఒంటరిని చేసేందుకు అటు ప్రత్యర్థులు, ఇటు సొంత పార్టీలోని కొన్ని శక్తులు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయా అంటే.. ప్రస్తుత పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.
హరీశ్ రావు అంటేనే గణాంకాల గని. ఏ విషయంపై అయినా లోతుగా అధ్యయనం చేసి, పక్కా ఆధారాలతో ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఇటీవలి అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన చేసిన మాటల దాడికి అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టాయి. ధాన్యం కొనుగోళ్లు, మొక్కజొన్న, జొన్న పంటల సమస్యలపై నేరుగా ముఖ్యమంత్రికే హరీష్ రావు బహిరంగ లేఖలు రాయడం విస్తృత చర్చకు దారితీసింది. దీంతో కాంగ్రెస్ మంత్రులు, నేతలు మూకుమ్మడిగా హరీశ్ రావును టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఆయన ఏ చిన్న మాట మాట్లాడినా, వెంటనే మంత్రులు రంగంలోకి దిగి కౌంటర్లు ఇవ్వడం ఇప్పుడు పరిపాటిగా మారింది. కేసీఆర్ కంటే హరీశ్ రావునే టార్గెట్ చేస్తే పార్టీకి, ప్రభుత్వానికి మైలేజీ వస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే గజ్వేల్ కంటే సిద్దిపేటపైనే అధికార పక్షం ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కేవలం ప్రత్యర్థి పార్టీలే కాదు, సొంత పార్టీ బీఆర్ఎస్లోనూ హరీశ్ రావు పరిస్థితిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. 'అవసరమైనప్పుడు వాడుకోవడం.. అన్నీ చక్కబడ్డాక పక్కన పెట్టడం' హరీశ్ రావు విషయంలో జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, ఎన్నికల మేనేజ్మెంట్ అవసరమైనప్పుడు ఆయన్ని వాడుకుని, ఆ తర్వాత ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నం జరుగుతోందని ఆయన అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత నెల 27న జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ, హరీశ్ రావు చేస్తున్న కృషిని గానీ, కనీసం ఆయన పేరును గానీ ప్రస్తావించకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కవిత అరెస్ట్ తర్వాత పరిణామాలు, పార్టీలో జరుగుతున్న అంతర్గత చర్చల్లో హరీశ్ ప్రాధాన్యతపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కూడా ఆయన వర్గాన్ని కలవరపెడుతోంది. రాబోయే కమిటీల్లో లేదా సభ్యత్వ నమోదులో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారా లేదా అన్నది ఇప్పుడు సందిగ్ధంగా మారింది.
కేంద్ర ప్రభుత్వ తప్పిదాలను, విభజన హామీల అమలులో వైఫల్యాలను హరీశ్ రావు నిరంతరం ఎత్తిచూపుతుండటంతో బీజేపీ సైతం ఆయన్ని టార్గెట్ చేసింది. హరీశ్ విమర్శల వల్ల కమలం పార్టీకి డ్యామేజ్ జరుగుతోందని భావించి, రాష్ట్ర కమిటీతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయనపై ప్రతివిమర్శలకు పదును పెడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి వెన్నెముకగా ఉన్న హరీశ్ రావు విశ్వసనీయతను దెబ్బతీయాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గత కొంతకాలంగా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత కూడా హరీశ్ రావుపై పదునైన విమర్శలు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిని ప్రస్తావిస్తూ ఆమె నేరుగా హరీశ్ రావును అటాక్ చేస్తుండటం, ఆయన అనుచరుల్లో తీవ్ర అసహనానికి కారణమవుతోంది.
ఇన్ని వైపుల నుంచి విమర్శలు, వ్యూహాలు చుట్టుముడుతున్నా హరీశ్ రావు మాత్రం తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. సమాచారంతో కూడిన విమర్శలు చేస్తూ ప్రజల్లో తన పట్టును నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. "నన్ను టార్గెట్ చేస్తున్నారంటే.. నేను రాజకీయంగా బలంగా ఉన్నానని అర్థం" అనే ధీమాతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ రాజకీయ చదరంగంలో హరీశ్ రావు తన చతురతతో ప్రత్యర్థుల ఎత్తులను ఎలా చిత్తు చేస్తారో, తన సొంత పార్టీలో తన స్థానాన్ని ఎలా పదిలం చేసుకుంటారో చూడాలి.