Top story: బతకనేర్చిన బండ్ల లైఫ్ లో ఎదగాలంటే బండ్లగణేష్ లా ఉండాలా…?

నిర్మాత, చిన్న సైజు నటుడు, కోడిగుడ్ల వ్యాపారి, పార్టీలు మార్చే పొలిటీషియన్ ఇలా మీరు ఏ పేరుతో నైనా పిలుచుకోండి... బట్ వాటన్నిటికంటే బతకనేర్చిన బండ్ల గణేష్ అని అంటే 100% సూటబుల్ ఏమో. బండ్ల గణేష్ అనే వ్యక్తిని కొందరు జోకర్లా చూస్తారు.

Post Published By: dialnews
Updated : 4 May 2026, 12:30 PM IST

నిర్మాత, చిన్న సైజు నటుడు, కోడిగుడ్ల వ్యాపారి, పార్టీలు మార్చే పొలిటీషియన్ ఇలా మీరు ఏ పేరుతో నైనా పిలుచుకోండి... బట్ వాటన్నిటికంటే బతకనేర్చిన బండ్ల గణేష్ అని అంటే 100% సూటబుల్ ఏమో. బండ్ల గణేష్ అనే వ్యక్తిని కొందరు జోకర్లా చూస్తారు. కొందరు అతిగాడు అనుకుంటారు. ఇంకొందరు అవసరం కోసం ,అవకాశాల కోసం ఎంతకైనా తెగిస్తాడని అని అంటారు. ఎవరు ఎలా అనుకున్నా... ఒక చిన్న రైతు బిడ్డ, పెద్దగా చదువు సంధ్య లేని వాడు... పెద్ద బ్యాక్ గ్రౌండ్ కూడా లేనివాడు అసలు జీవితంలో ఈ స్థాయికి ఎదిగాడంటే కచ్చితంగా శభాష్ అనాల్సిందే. దీన్ని చాలా మంది ఒప్పుకోకపోవచ్చు. కానీ లైఫ్ లో ఎదగడానికి ఒక్కొక్కడు ఒక్కొక్క దారి ఎంచుకుంటాడు. అందులో బండ్ల గణేష్ దారి ఒకటి. దానిని మనం తప్పు అనలేము... ఒప్పు అని సమర్థించలేం కూడా. కానీ బండ్ల గణేష్ వ్యవహార శైలి కూడా ఒక సక్సెస్ రూట్ లాంటిదే.

హైదరాబాద్ పార్క్ హయాత్ లో బండ్ల గణేష్ కుమార్తె జనని ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ కి వచ్చిన అతిరథ మహారధుల్ని చూస్తే ఔరా బండ్ల గణేష్.... బయట జనం ఆయన్ని ఎంత తక్కువ అంచనా వేస్తున్నారు అని అనుకోక తప్పదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి ఇద్దరూ స్వయంగా బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్ కి తరలి వచ్చారు.బాబు భువనేశ్వరి దగ్గరుండి తమ ఇంట్లో ఫంక్షన్ లాగా అన్ని జరిపించారు. వధూవరుల చేత ఎంగేజ్మెంట్ రింగ్స్ కూడా వాళ్లే మార్పించారు. దట్ ఇస్ పవర్ ఆఫ్ బండ్ల. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా కుటుంబ సమేతంగా బండ్ల ఫంక్షన్ కి తరలి వచ్చారు.అప్పుడు చూడాలి బండ్ల మార్క్ యాక్షన్. మెగాస్టార్ ఏంటి..? ఆల్ ఇండియా జిగాస్టార్లు కూడా బండ్ల పెర్ఫార్మెన్స్ కి పడిపోవాల్సిందే.

బండ్ల గణేష్ కుమార్తె ఎంగేజ్మెంట్ కి... తెలుగు రాష్ట్రాల్లో పొలిటీషియన్సు, ఎమ్మెల్యేలు మంత్రులు, ఎంపీలు, ఇక మొత్తం టాలీవుడ్ నటులు కదిలి వచ్చారు. పైకి తాను జోకర్లా.... అవకాశవాదిలా కనిపించిన లోన తన పలుకుబడేంటో బండ్ల ఈ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ సందర్భంగా ప్రూవ్ చేసుకున్నాడు.మన అవసరానికి.. ఎవ్వరికైనా నమస్కారం పెట్టాలి. ఎక్కడైనా ఒంగోవాలి. ఏ పనైనా చేయాలి. ఫైనల్ గా మన పని పూర్తవ్వాలి. నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి. ఎవడో ఏదో అనుకుంటాడని... మనం చేసే పని ఆపకూడదు. అది ఎంత చిల్లర పని అయినా సరే. అవసరమైతే నటించాలి. కన్నీళ్లు పెట్టుకోవాలి. అవతల వాడిని దబాయించాలి. మోసం చేయాలి. తప్పుదనుకుంటే నాలుగు తన్నులు తినాలి. కొన్నిసార్లు ప్రేమ కురిపించాలి. బతకడానికి ఇలా రకరకాల విన్యాసాలు చేయాలి. ఏం చేసినా ఎదగాలి. ఇదే బండ్ల గణేష్ ఫార్ములా.

షాద్నగర్ లో పౌల్ట్రీ ఫార్మ్ నడుపుకునే బండ్ల గణేష్... ఒక చిన్న నటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. నిర్మాత అయ్యారు. అప్పులు చేశారు. చెక్ బౌన్స్ కేసుల్లో ఇరుక్కున్నాడు. మొత్తం మీద నిర్మాతగా నిలదొక్కుకున్నాడు. ఒకానొక టైములో పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడు అయ్యాడు. తన మాటకారితనంతో నిత్యం పవన్ కళ్యాణ్ ని నవ్విస్తూ గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. కానీ ఈ అతిని పవన్ కళ్యాణ్ ఎక్కువకాలం భరించలేకపోయాడు. సహజంగానే పవన్ ఎవరిని ఎక్కువకాలం దగ్గరకు తీయుడు. బండ్లను కూడా అంతే. పవన్ కళ్యాణ్ నా దేవుడు. పవ నేశ్వర ....ఈశ్వర.... అని చిడతల భజన చేసిన ......ఎందుకో పవన్ కళ్యాణ్ మాత్రం మళ్లీ బండ్ల గణేష్ ని దగ్గరకు రానీయలేదు. బహుశా తన గురించి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి బండ్ల ఎక్కడో ఏదో దూల నోటితో వాస్తవాలు చెప్పి ఉంటాడని పవన్ అనుమానం.

ఆ తర్వాత కొన్నాళ్లు డబ్బులు లేక సినిమాలు ఆపేసిన గణేష్.... తెలంగాణ కాంగ్రెస్ లో చేరాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అంటూ రాకపోతే కొత్త బ్లేడ్ తో మెడ కోసుకుంటానని ప్రచారం చేసి ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేశాడు. కాంగ్రెస్ వాళ్లు దేశముదురులు. గణేష్ ని వెనక తిప్పుకున్నంత కాలం తిప్పుకొని వదిలేసారు. గురుడు కమ్మ సామాజిక వర్గం కావడంతో వైసిపి వాళ్ళు దగ్గరకు తీయలేదు. ఒకానొక మంచి సమయం చూసి జై చంద్రబాబు అన్నాడు. సరిగ్గా ఎన్నికలకు ముందు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు బాబుకి మద్దతుగా హైదరాబాదులో ప్లకార్డు పట్టుకున్నాడు. గచ్చిబౌలి స్టేడియంలో బాబు కోసం భీకర,భీషణ ప్రతిజ్ఞలు చేశాడు. తెలంగాణ కాంగ్రెస్ విషయంలో ఫెయిల్ అయినప్పటికీ ఇక్కడ బండ్ల ఫార్ములా వర్కౌట్ అయింది. క్యాస్ట్ కూడా కలిసి వచ్చింది. ఊహించినట్లుగానే కూటమి పేరుతో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది.

బండ్ల తన అమాయకత్వాన్ని, కామెడీని, ప్రేమని, నటనని మొత్తం కలబోసి చంద్రబాబు కుటుంబాన్ని పడేసాడు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మొక్కుకున్నానని చెప్పి ఈమధ్య పాదయాత్ర చేసి వచ్చాడు. రెండు మూడేళ్ల క్రితం గణేష్ ఎవరో తెలియని చంద్రబాబు, ప్రచారం వస్తుంది కదా అని హగ్ చేసుకున్నాడు. ఆ రకంగా అటు పొలిటికల్ ఫ్యామిలీస్ కు, ఇటు సెలబ్రిటీ ఫ్యామిలీస్ కి బండ్ల గణేష్ తన అనుకువతో దగ్గరయ్యాడు.బండ్ల గణేష్ పై చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయని, ఆర్థిక నేరస్థురాలు నౌరిన్ ఇంటిని తెలివిగా కొట్టేసాడని, జేబులోంచి రూపాయి తీసి ఎవరికి ఇవ్వడని... ఎలాంటి వాళ్లనైనా మాటలతో పడగొడతాడని... ఏం కావాలంటే అది తెచ్చి ఇస్తాడని , ఇలా గణేష్ అంటే కిట్టని వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఎవరు ఎలా మాట్లాడుకున్నా తన కుమార్తె జనని ఎంగేజ్మెంట్ ఫంక్షన్ లో తన బలం ఏంటో చూపించుకున్నాడు బండ్ల గణేష్. సక్సెస్ అయిన వాడి వెంటే ఈ ప్రపంచం ఉంటుందని... ఆ సక్సెస్ ఎలా వచ్చిందో జనం పట్టించుకోరని బండ్ల గణేష్ నిరూపించాడు. అందుకే సక్సెస్ కావాలనుకునే వాళ్లకు బండ్ల ఒక లైఫ్ లెసన్ ప్రొఫెసర్ లాంటివాడు.

 

Published : 
  • 4 May 2026, 12:30 PM IST