భారత ప్రజాస్వామ్యంలో గవర్నర్ వ్యవస్థ ఎప్పుడూ ఒక వివాదాస్పద చర్చగానే మిగిలిపోయింది. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ ఒక రాష్ట్రానికి పెద్ద దిక్కుగా, తటస్థంగా వ్యవహరించాలి. కానీ చరిత్రను తిరగేస్తే, గవర్నర్లు తరచుగా కేంద్రంలోని అధికార పార్టీకి ప్రతినిధులుగా, రాజకీయ ఏజెంట్లుగా మారుతున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం తమిళనాడులో దళపతి విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ పెడుతున్న మెలికలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. ఇది కేవలం ఒక రాష్ట్ర రాజకీయ సమస్య కాదు, ఇది రాజ్యాంగ విలువలపై జరుగుతున్న దాడి.చరిత్రలో గవర్నర్ల ద్వంద్వ వైఖరిపై మనం ఒకసారి కీలక ఉదాహరణలు చూస్తే, గవర్నర్లు ఒకే రకమైన పరిస్థితిలో వేర్వేరు పార్టీల పట్ల వేర్వేరుగా ప్రవర్తించిన సందర్భాలు కోకొల్లలు.
1952 మద్రాస్ ప్రెసిడెన్సీ: స్వతంత్ర భారత తొలి ఎన్నికల్లోనే గవర్నర్ శ్రీప్రకాశ గారు అతిపెద్ద ప్రతిపక్ష కూటమిని కాదని, కాంగ్రెస్‌ను ఆహ్వానించారు. అప్పుడే గవర్నర్ వ్యవస్థకు రాజకీయ రంగు పులిమారు.
2017 గోవా ఉదంతం: 40 సీట్లు ఉన్న గోవాలో 17 సీట్లు గెలిచిన అతిపెద్ద పార్టీ కాంగ్రెస్‌ను కాదని, కేవలం 13 సీట్లు ఉన్న బీజేపీని గవర్నర్ మృదుల సిన్హా ఆహ్వానించారు. అక్కడ 'సింగిల్ లార్జెస్ట్ పార్టీ' సూత్రం కంటే బీజేపీ ప్రయోజనాలకే ప్రాధాన్యత దక్కింది.
2018 కర్ణాటక: ఇక్కడ సీన్ రివర్స్ అయింది. బీజేపీ 104 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిస్తే.. కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి మెజారిటీ ఉన్నా, గవర్నర్ వాజూభాయ్ వాలా "సింగిల్ లార్జెస్ట్ పార్టీయే ముఖ్యం" అని చెప్తూ బీజేపీకి అవకాశం ఇచ్చారు.
2017-18, మణిపూర్ & మేఘాలయ: గోవాతో పాటే మణిపూర్ మరియు మేఘాలయలో కూడా కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ ఆయా రాష్ట్రాల గవర్నర్లు కాంగ్రెస్‌ను పిలవకుండా, వేగంగా కూటమిగా ఏర్పడిన బీజేపీకి అవకాశం ఇచ్చారు. ఇక్కడ 'వేగం' ప్రాతిపదికగా నిలిచింది.
జార్ఖండ్ 2005: జార్ఖండ్‌లో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ, గవర్నర్ సయ్యద్ సిబ్తే రజీ స్వతంత్రుల మద్దతు ఉందని చెప్పిన శిబు సోరెన్‌ను ఆహ్వానించారు. అప్పుడు కూడా 'సింగిల్ లార్జెస్ట్ పార్టీ' సూత్రం పక్కన పెట్టబడింది.
హర్యానా 1982: గవర్నర్ ప్లేట్ ఫిరాయింపు వ్యవహారం ఇది. హర్యానాలో దేవీలాల్ నేతృత్వంలోని కూటమికి మెజారిటీ ఉన్నా, గవర్నర్ మొదట దేవీలాల్‌ను పిలిచి, ఆ తర్వాత వెంటనే మాట మార్చి కాంగ్రెస్ నాయకుడి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇది గవర్నర్ల వ్యవస్థలో అత్యంత వివాదాస్పదమైన ఘట్టం.
అంటే.. ఒక రాష్ట్రంలో కూటమికి అవకాశం ఇస్తారు, మరో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీకి ఇస్తారు. ఈ నిర్ణయాలన్నీ కేవలం బీజేపీకి అధికారం దక్కేలా ఉండటమే ఇక్కడ గమనించాల్సిన విషయం. ప్రస్తుతం తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని TVK 108 సీట్లతో స్పష్టమైన అతిపెద్ద పార్టీగా నిలిచింది. మెజారిటీ మార్కు 118కి ఆయన కేవలం 10 అడుగుల దూరంలో ఉన్నారు. సాధారణంగా ఎస్.ఆర్. బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. మెజారిటీని రాజ్‌భవన్‌లో నిర్ణయించకూడదు, అసెంబ్లీలో 'ఫ్లోర్ టెస్ట్' ద్వారానే తేల్చాలి.
కానీ గవర్నర్ మాత్రం "ముందే 118 మంది మద్దతు లేఖలు చూపించండి" అని పట్టుబట్టడం విజయ్ ని ఇబ్బంది పెట్టడమే. 13 సీట్లు ఉన్న గోవా బీజేపీకి వర్తించని ఈ కండిషన్, 108 సీట్లు ఉన్న విజయ్ కి ఎందుకు వర్తిస్తోంది..? ఇది ఖచ్చితంగా కేంద్రం నుంచి వస్తున్న 'డైరెక్షన్' ప్రకారమే జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గవర్నర్ ఇలా కాలయాపన చేయడం వెనుక ఒక లోతైన వ్యూహం దాగి ఉంది. విజయ్ కి అవకాశం ఇవ్వకుండా సమయం గడిపితే, ఆ గ్యాప్‌లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు లేదా విజయ్ పార్టీ ఎమ్మెల్యేలను చీల్చేందుకు ప్రత్యర్థులకు అవకాశం దక్కుతుంది.
గోవాలో పారికర్ ప్రమాణ స్వీకారం చేశాక కాంగ్రెస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్ళడం మనం చూశాం. ఇప్పుడు తమిళనాడులో కూడా అలాంటి 'ఆపరేషన్ ఆకర్ష్' లేదా 'హార్స్ ట్రేడింగ్' జరిగేలా చేసేందుకే గవర్నర్ వ్యవస్థను వాడుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. విజయ్ విషయంలో గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాయడమే. 108 సీట్లు ఇచ్చి ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు, సాంకేతిక కారణాలు చూపిస్తూ కొత్త నాయకుడిని అడ్డుకోవడం అన్యాయం. ఒక పార్టీకి ఒక న్యాయం, విజయ్ కి మరో న్యాయం ఉండకూడదు. రాజ్యాంగం అందరికీ ఒకటే. ఢిల్లీలోని పెద్దల అడుగులకు మడుగులు వత్తకుండా, గవర్నర్ వ్యవస్థ ప్రజాతీర్పును గౌరవించినప్పుడే ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది.