Top story: విజయ్ కి ఒక న్యాయం…పారికర్ కు ఒక న్యాయమా..? గోవా ఫార్ములా ఇక్కడ వర్తించదా..? గవర్నర్ వ్యవస్థ గతంలో ఏం చేసింది..?

తమిళనాడు 2026 ఎన్నికల ఫలితాలు రాజకీయాలను తలకిందులు చేశాయి. విజయ్ నేతృత్వంలోని TVK ఏకంగా 108 స్థానాల్లో విజయం సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. దశాబ్దాల ద్రావిడ రాజకీయాలకు చెక్ పెట్టినా, సీఎం

Post Published By: dialnews
Updated : 8 May 2026, 10:55 AM IST

తమిళనాడు 2026 ఎన్నికల ఫలితాలు రాజకీయాలను తలకిందులు చేశాయి. విజయ్ నేతృత్వంలోని TVK ఏకంగా 108 స్థానాల్లో విజయం సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. దశాబ్దాల ద్రావిడ రాజకీయాలకు చెక్ పెట్టినా, సీఎం కుర్చీకి మాత్రం 118 అనే అంకె అడ్డుగా నిలుస్తోంది. మరి 2017లో గోవాలో తక్కువ సీట్లు వచ్చిన పార్టీ సీఎం ఎలా అయింది..? విజయ్ కి ఒక న్యాయం.. పారికర్ కి ఒక న్యాయమా..? ఈ పొలిటికల్ గేమ్ ఏంటో క్లియర్ గా చూద్దాం. విజయ్ 108 సీట్లు సాధించి రికార్డు సృష్టించారు.మెజారిటీకి కావాల్సింది 118. అంటే కేవలం 10 సీట్ల దూరం. ఈ పరిస్థితిలో రాజ్యాంగం ఏం చెప్తుంది..? సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న విజయ్ ని గవర్నర్ ఆహ్వానించి, అసెంబ్లీలో బలం నిరూపించుకోమనాలి. ఒకవేళ ఆయన నెగ్గకపోతే అప్పుడు ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసే అవకాశం ఉంటుంది. కానీ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మాత్రం "ముందే 118 మంది మద్దతు లేఖలు చూపించండి" అని కోరుతున్నారు. ఇది విజయ్ ని ఇబ్బంది పెట్టడం కాదా..?

2017లో గోవాలో కాంగ్రెస్ 17 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ కేవలం 13 సీట్లు గెలిచిన బీజేపీకి గవర్నర్ మృదుల సిన్హా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చారు. అక్కడ "ముందే మద్దతు లేఖలు" అనే నియమం ఎందుకు వర్తించలేదు..? 13 సీట్ల పార్టీకి మద్దతు కూడగట్టే టైమ్ ఇచ్చి, 108 సీట్లు గెలిచిన విజయ్ కి ఆ ఛాన్స్ ఇవ్వకపోవడం వెనుక రాజకీయం ఏంటి..? బీజేపీ విషయంలో ఒక రూల్.. విజయ్ విషయంలో మరో రూలా..? ప్రస్తుతం విజయ్ కి 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఇప్పటికే విజయ్ కి మద్దతు ఇవ్వడానికి సిద్ధమని సంకేతాలు ఇచ్చింది. మిగతా చిన్న పార్టీలు లేదా స్వతంత్రుల మద్దతుతో 118 మార్కును అందుకోవడం విజయ్ కి కష్టమేమీ కాదు. విజయ్ రెండు చోట్ల (పెరంబూర్ మరియు తిరుచ్చి ఈస్ట్) పోటీ చేసి గెలిచారు. రాజ్యాంగం ప్రకారం ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాలి. అప్పుడు అసెంబ్లీ బలం 233 అవుతుంది. అప్పుడు మెజారిటీ మార్క్ 117 కి తగ్గుతుంది. గవర్నర్ ఇంకా 234 స్థానాల లెక్కనే చూస్తూ 118 మంది మద్దతు అడగడం టెక్నికల్‌గా సరైనదేనా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది.

1994 ఎస్.ఆర్. బొమ్మై కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది "మెజారిటీని రాజ్‌భవన్ (లేదా లోక్ భవన్) లో కాదు, అసెంబ్లీ హౌస్ లోనే నిరూపించుకోవాలి" అని. గవర్నర్ గారు ఎమ్మెల్యేల సంతకాల కోసం పట్టుబట్టడం సుప్రీంకోర్టు స్ఫూర్తికి విరుద్ధం కాదా..? గోవాలో పారికర్ విషయంలో లేని సంతకాల గొడవ, ఇక్కడ విజయ్ విషయంలోనే ఎందుకు..? హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు ఎవరిని పిలవాలి అనే విషయంలో సర్కారియా కమిషన్ ఒక ఆర్డర్ ఇచ్చింది. ఇక్కడ మూడు ఆప్షన్స్ ఉన్నాయి.మొదటి ఆప్షన్.. ఎన్నికల ముందే ఏర్పడిన కూటమికి, రెండవ ఆప్షన్ ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి, అంటే కమీషన్ ప్రకారం ఇక్కడ విజయ్ కి ఈ అవకాశం దక్కాలి. అలాగే మూడవ ఆప్షన్, ఎన్నికల తర్వాత ఏర్పడిన కూటమికి అవకాశం ఇవ్వాలి. సెకండ్ ఆప్షన్ ప్రకారం 108 సీట్లు ఉన్న విజయ్ కే మొదటి అవకాశం ఇవ్వాలి. కానీ గవర్నర్ మూడో ఆప్షన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా..? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. గోవాలో 13 సీట్లు ఉన్న బీజేపీని పిలిచినప్పుడు, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు.

ఇప్పుడు తమిళనాడులో కూడా విజయ్ కి ఛాన్స్ ఇవ్వకుండా ఆలస్యం చేయడం అంటే.. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను లాక్కోవడానికి లేదా విజయ్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి సమయం ఇస్తున్నట్లే కదా..?. ఇంత పెద్ద ప్రజా తీర్పు వచ్చినప్పుడు, సాంకేతిక కారణాలు చూపిస్తూ కొత్త నాయకుడిని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికే గండం కాదా? అంటూ నిపుణులు మండిపడుతున్నారు. ఏది ఏమైనా గవర్నర్ వ్యవస్థ ఇక్కడ 'చెక్‌మేట్' ఆడాలని చూస్తోందా..? గోవాలో పారికర్ విషయంలో చేసినట్లే ఇక్కడ విజయ్ కి కూడా ఒక 'ఫ్రీ హ్యాండ్' ఎందుకు ఇవ్వడం లేదు..? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ ని సీఎం కాకుండా ఆపడం అంటే ప్రజాతీర్పును అవమానించడమే. గతంలో బీజేపీ విషయంలో గవర్నర్లు చూపిన ఉదారత.. ఇప్పుడు విజయ్ విషయంలో ఎందుకు కనిపించడం లేదు..? ఇది వ్యవస్థల పక్షపాతమా..? లేక రాజకీయ కుట్రలా..? అనేది కాలమే నిర్ణయించాలి.

Published : 
  • 8 May 2026, 10:55 AM IST