దశాబ్దాలుగా పశ్చిమ ఆసియాలో 'శాంతికి చిరునామా'గా, 'బిజినెస్ హబ్'గా వెలిగిపోయిన దేశం యూఏఈ. ముఖ్యంగా దుబాయ్ నగరం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులకు, పెట్టుబడిదారులకు ఒక స్వర్గధామం. కానీ, ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు మరియు క్షిపణులు ఈ నమ్మకాన్ని ఒక్కసారిగా దెబ్బతీశాయి. అజేయమైన రక్షణ వ్యవస్థ ఉన్నప్పటికీ, ఇరాన్ దాడులు యూఏఈ ఆర్థిక మూలాలను కదిలించాయి. అసలు యూఏఈకి ఇరాన్ వల్ల ఎంత నష్టం జరిగింది..? ఆ దేశం ఎందుకు వెనకా ముందు చూడకుండా ఇరాన్‌పై ఎదురు దాడికి దిగింది..? యూఏఈ ఆదాయంలో పర్యాటక రంగం గుండెకాయ వంటిది. యుద్ధం మొదలైనప్పటి నుండి పర్యాటకుల రాక 60 శాతం పడిపోయింది. విమానశ్రయాలు మూతబడటం, విమానాలు రద్దు కావడంతో రోజువారీ ఆదాయ నష్టం సుమారు 600 మిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో దాదాపు రూ. 5,000 కోట్లు అని అంచనా. ఒకప్పుడు పర్యాటకులతో కళకళలాడే బుర్జ్ ఖలీఫా పరిసరాలు, దుబాయ్ మాల్స్ ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి. కేవలం హోటల్ బుకింగ్స్ రద్దు కావడమే కాకుండా, ఎమిరేట్స్ వంటి దిగ్గజ ఎయిర్‌లైన్స్ రోజుకు వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోతున్నాయి.
దుబాయ్ రియల్ ఎస్టేట్ అంటే ప్రపంచంలోనే ఒక బ్రాండ్. కానీ యుద్ధ భయంతో విదేశీ పెట్టుబడిదారులు తమ ప్రాజెక్టులను హోల్డ్‌లో పెట్టారు. ప్రాపర్టీ మార్కెట్ ఇండెక్స్ ఏకంగా 32 శాతం కుప్పకూలింది. అంటే, యుద్ధానికి ముందు ఒక ఇల్లు లేదా ఆఫీస్ స్పేస్ విలువ 100 రూపాయలు ఉంటే, ఇప్పుడు అది 68 రూపాయలకు పడిపోయింది. బిలియన్ల కొద్దీ డాలర్ల విలువైన విలాసవంతమైన విల్లాలు, అపార్ట్మెంట్లకు ఇప్పుడు కొనే నాధుడు కరువయ్యారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడ్డ వేలాది మంది బ్రోకర్లు, కన్సల్టెంట్లు వీధిన పడే పరిస్థితి వచ్చింది.యూఏఈ కేవలం పర్యాటక దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతులకు అది ఒక 'టాక్స్ హెవెన్'. ఇరాన్ దాడుల భయంతో సుమారు 15 బిలియన్ డాలర్లు.. అంటే రూ. 1.25 లక్షల కోట్లు.. పెట్టుబడులు యూఏఈ నుండి సింగపూర్, స్విట్జర్లాండ్ వంటి సురక్షిత దేశాలకు తరలిపోయాయని ఆర్థిక నిపుణుల అంచనా. పెట్టుబడిదారులు తమ డబ్బును వెనక్కి తీసుకోవడం వల్ల స్థానిక బ్యాంకుల లిక్విడిటీపై ఒత్తిడి పెరిగింది. దుబాయ్‌లోని 'జెబెల్ అలీ' పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఓడరేవులలో ఒకటి.
ఇరాన్ క్షిపణి దాడుల భయం వల్ల బీమా కంపెనీలు షిప్పింగ్ ప్రీమియంలను 300% నుండి 500% పెంచేశాయి. దీనివల్ల చాలా కార్గో షిప్పులు తమ మార్గాన్ని మార్చుకున్నాయి. ఫలితంగా యూఏఈ రీ-ఎగుమతి మార్కెట్ దాదాపు 40% క్షీణించింది. యూఏఈలోని ఫుజైరా చమురు నిల్వ కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడులు జరిగాయి. దీనివల్ల దాదాపు 2 మిలియన్ బారెల్స్ చమురు వృధా అవ్వడమే కాకుండా, ఆ మౌలిక సదుపాయాలను బాగు చేయడానికి మరో 500 మిలియన్ డాలర్ల ఖర్చు అవుతుందని అంచనా.యూఏఈకి వచ్చే ఆదాయంలో చమురు ఎగుమతులు కీలకమైనవి, ఈ దాడుల వల్ల రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం 15% తగ్గింది. కేవలం ఆర్థిక నష్టమే కాదు, ఇరాన్ దాడుల వల్ల దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ కేంద్రాలు, టెలికాం టవర్లను బాగు చేయడానికి యూఏఈ ప్రభుత్వం సుమారు 4 బిలియన్ డాలర్లు అంటే.. రూ. 33 వేల కోట్లు అదనపు బడ్జెట్‌ను కేటాయించాల్సి వచ్చింది. ముఖ్యంగా అత్యాధునిక రక్షణ వ్యవస్థలు క్షిపణులను అడ్డుకోవడానికి చేసే ఒక్కో ప్రయోగానికి లక్షలాది డాలర్లు ఖర్చవుతాయి.
ఆ 'డిఫెన్స్ కాస్ట్' కూడా యూఏఈపై అదనపు భారం. యూఏఈలో 80% కంటే ఎక్కువ జనాభా విదేశీయులే. యుద్ధ వాతావరణం వల్ల ఐరోపా మరియు అమెరికాకు చెందిన నిపుణులు తమ దేశాలకు తిరిగి వెళ్ళిపోయారు. దీనివల్ల టెక్నాలజీ, ఫైనాన్స్ మరియు హెల్త్‌కేర్ రంగాల్లో నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత ఏర్పడింది. ఇది దీర్ఘకాలంలో దేశ వృద్ధిని కుంటుపరుస్తుంది. ఆర్థిక నష్టం ప్రభావం నేరుగా సామాన్య ఉద్యోగులపై పడింది. పర్యాటకులు లేకపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు తమ సిబ్బందిని తొలగిస్తున్నాయి.దుబాయ్ మెరీనాలోని ఫైవ్ స్టార్ హోటళ్లు సైతం వందలాది మందిని ఉద్యోగాల నుంచి తీసేశాయి. మిగిలిన వారికి 20 నుండి 50 శాతం జీతాల్లో కోత విధించడమే కాకుండా, 'అన్‌పెయిడ్ లీవ్' పై పంపిస్తున్నాయి. ఐటీ, సర్వీస్ రంగాల్లో కూడా కొత్త నియామకాలు ఆగిపోయాయి.
పశ్చిమ ఆసియాలో అత్యంత సురక్షితమైన దేశంగా ఉన్న యూఏఈలో ఇలాంటి ఉద్యోగ సంక్షోభం రావడం ఇదే మొదటిసారి. ఇరాన్ వల్ల తమ దేశ ప్రతిష్ట, ఆర్థిక వ్యవస్థ మట్టిపాలవుతుంటే యూఏఈ చూస్తూ ఊరుకోలేదు.అందుకే ప్రపంచ దేశాలు చర్చలు జరుపుతున్నా సరే, యూఏఈ మాత్రం తన విదేశాంగ విధానాన్ని పక్కన పెట్టి ఇరాన్‌పై నేరుగా వైమానిక దాడులకు దిగింది. తమ ఆర్థిక స్థిరత్వానికి ముప్పుగా మారిన ఇరాన్ చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. తమ దేశాన్ని మళ్ళీ 'సేఫ్ జోన్' గా మార్చుకోవాలంటే ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేయడం ఒక్కటే మార్గమని యూఏఈ భావిస్తోంది. ఇరాన్‌లోని లావన్ ఐలాండ్ చమురు శుద్ధి కర్మాగారాన్ని ధ్వంసం చేసింది. ఇది ముమ్మాటికీ ఆర్థిక మనుగడ కోసం చేసిన యుద్ధం.