పురుష్.. పురుష్…!

ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన 79వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో (Cannes Film Festival) బాలీవుడ్ అగ్ర కథానాయిక ఆలియా భట్ సందడి చేస్తున్నారు. అయితే, అక్కడ ఆమె కేవలం తన ఫ్యాషన్

Post Published By: dialnews
Updated : 14 May 2026, 7:15 PM IST

ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన 79వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో (Cannes Film Festival) బాలీవుడ్ అగ్ర కథానాయిక ఆలియా భట్ సందడి చేస్తున్నారు. అయితే, అక్కడ ఆమె కేవలం తన ఫ్యాషన్ లేదా సినిమాల గురించి మాత్రమే కాకుండా, భారతీయ చిత్ర పరిశ్రమలో పాతుకుపోయిన పురుషాధిక్యత గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.భారతీయ బాక్సాఫీస్ వద్ద కేవలం పురుష ఆడియన్స్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని సినిమాలు తీయడాన్ని ఆలియా సూటిగా ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా 'బార్బీ' వంటి మహిళా ప్రధాన చిత్రాలు భారీ విజయాలను సాధిస్తున్నాయని, కానీ భారత్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఆమె మాట్లాడుతూ.. "భారత్‌లో ఎప్పుడూ హీరో ప్రాధాన్యం కలిగిన చిత్రాలే ఎక్కువగా తీస్తున్నారు. దాదాపు 75 శాతం సినిమాలు కేవలం మాస్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నారు. మరి మహిళా ప్రేక్షకుల సంగతేంటి? వారికి కావాల్సిన సినిమాలు ఎవరు తీస్తారు?" అని ప్రశ్నించారు. హీరో ప్రధానంగా సాగే యాక్షన్ సినిమాలు తీయవద్దని తాను చెప్పడం లేదని, కానీ సినిమాలు అనేవి ఒక వర్గం కోసం మాత్రమే కాకుండా అందరి కోసం రూపొందాలని ఆలియా స్పష్టం చేశారు. "సినిమాలో ప్రధాన పాత్రలో ఎవరు నటిస్తున్నారు అనేది ప్రేక్షకులు చూడరు, వాళ్ళు కథను మాత్రమే చూస్తారు" అని ఆమె అభిప్రాయపడ్డారు.

అయితే ఆలియా చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభిస్తోంది. ముఖ్యంగా నెటిజన్లు ఆమెను గత విషయాలను గుర్తు చేస్తూ విమర్శిస్తున్నారు. గతంలో తన భర్త రణబీర్ కపూర్ నటించిన 'యానిమల్' చిత్రం అత్యంత హింసాత్మకంగా, పురుషాధిక్యతను చాటేలా ఉందని విమర్శలు వచ్చినప్పుడు.. ఆలియా ఆ చిత్రానికి మద్దతుగా నిలిచిన విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు."యానిమల్ వంటి సినిమాలను సమర్థించినప్పుడు లేని ఇబ్బంది, ఇప్పుడు కాన్స్ వేదికపై ఇలా మాట్లాడటంలో అర్థం ఏముంది?" అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు, ఇటీవల వచ్చిన 'ధురంధర్' చిత్రంపై కూడా ఆమె మౌనం వహించడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు.
మొత్తానికి ఆలియా భట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ మరియు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలలో హాట్ టాపిక్‌గా మారాయి. సినిమాల్లో జెండర్ బ్యాలెన్స్ గురించి ఆమె లేవనెత్తిన పాయింట్ సరైనదే అయినప్పటికీ, ఆమె గత స్టాండ్స్ గురించి నెటిజన్లు చేస్తున్న విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.

Published : 
  • 14 May 2026, 7:15 PM IST