టాలీవుడ్ రాక్‌స్టార్, టాలెంటెడ్ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా లెవెల్లో వరుస భారీ చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. అయితే, కేవలం సంగీత దర్శకుడిగానే కాకుండా.. ఇప్పుడు వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు డీఎస్‌పీ సిద్ధమయ్యారు. ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీని ఊపేసిన వేణు యెల్దండి దర్శకత్వంలో ఒక విలేజ్, డివోషనల్ డ్రామా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘ఎల్లమ్మ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాతోనే దేవి శ్రీ ప్రసాద్ వెండితెరపై హీరోగా పరిచయం కాబోతున్నారు.అయితే, ఎన్నో కథలు విన్న తర్వాత, ఎన్నో డిస్కషన్స్ తర్వాత దేవి శ్రీ ప్రసాద్ అసలు ‘ఎల్లమ్మ’ అనే సినిమాకే ఎందుకు ఓకే చెప్పారు? ఆయన హీరోగా మారడానికి ఈ సబ్జెక్ట్‌నే ఎందుకు ఎంచుకున్నారు? అనే బలమైన కారణాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా రివీల్ చేశారు.
దేవి శ్రీ ప్రసాద్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక ఆసక్తికరమైన వీడియోను షేర్ చేస్తూ, ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. "నా చిన్నతనం నుండి నాలో జానపద కళలపై ఉన్న మక్కువ, నన్ను చుట్టుముట్టిన అద్భుతమైన సాంప్రదాయాలు, సంస్కృతులే దీనికి కారణం. మా నాన్న స్వగ్రామమైన వేదురుపాకలో జరిగే ‘అమ్మోరు జాతర’ వేడుకలు నాపై ఎంతో ప్రభావం చూపించాయి. నేను ‘ఎల్లమ్మ’ చిత్రానికి ‘యస్’ చెప్పడానికి ప్రధాన కారణం ఇదే" అంటూ డీఎస్‌పీ పేర్కొన్నారు.మన మూలాల్లోకి తిరిగి వెళ్లడం, ఆ పాత జ్ఞాపకాలను, సాంప్రదాయాలను మళ్లీ అనుభవించడం ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ తండ్రి, దివంగత ప్రముఖ రచయిత సత్యమూర్తి పుట్టిన ఊరు తూర్పుగోదావరి జిల్లాలోని వేదురుపాక. అక్కడి మట్టి వాసన, సంస్కృతి, చిన్నప్పటి జాతర జ్ఞాపకాలే ఆయనను ఈ సినిమా వైపు అడుగులు వేసేలా చేశాయి.
ఇక ఈ చిత్రంపై విడుదల చేసిన ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటూ, అంచనాలను పెంచేస్తోంది. ఈ సాలిడ్ విలేజ్ సబ్జెక్టులో దేవి శ్రీ ప్రసాద్ కేవలం హీరోగా నటించడమే కాకుండా, తన మార్క్ సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. నటనతో పాటు మ్యూజిక్ బాధ్యతలను కూడా ఆయనే భుజాన వేసుకోవడంతో సినిమాపై టాలీవుడ్‌లో భారీ క్రేజ్ నెలకొంది. ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్.. ఈ విలేజ్ డివోషనల్ డ్రామా ‘ఎల్లమ్మ’తో హీరోగా ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారో చూడాలి.