ఇది ఇండియా బాస్. ఇక్కడ డబ్బు పలుకుబడి ఉంటే చాలు.. కొండ మీద కోతి కూడా దిగొస్తుంది. న్యాయం అన్యాయం అవుతుంది.. అన్యాయం న్యాయం అవుతుంది. అందుకే ఇద్దరు అమ్మాయిలను రేప్ చేసిన కరడుగట్టిన రేపిస్ట్.. డేరా బాబాకి ఒకటి రెండు కాదు ఏకంగా 16 సార్లు పెరోల్ వచ్చింది. చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కుని ఏళ్ల తరబడి జైలు గోడల మధ్య నలిగిపోతున్న అమాయకులు ఉన్న ఈ దేశంలో.. రేప్ చేసిన వాడు హ్యాపీగా చుట్టపు చూపులా జైలుకు వెళ్లి వస్తున్నాడంటే మన వ్యవస్థ ఎంత పకడ్బంధీగా ఉందో అర్థం చేసుకోండి.సాధారణంగా ఏదైనా చిన్న నేరం చేసి జైలుకెళ్లిన ఖైదీకి, తన ఇంట్లో ఎంతటి కష్టం వచ్చినా, ఇంట్లో వాళ్లు చనిపోయినా కడసారి చూసుకోవడానికి ఒక్కరోజు పెరోల్ దొరకడం కూడా గగనమే. ఎన్నో ఆంక్షలు, మరెన్నో షరతులు పెట్టి కానీ అధికారులు బయటకు పంపరు.
కానీ, ఇద్దరు అమాయక మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టిన ఓ క్రూరమైన నేరస్థుడికి మాత్రం జైలు అనేది ఒక చుట్టపుచూపు లాంటిది. అతనే డేరా సచ్చా సౌదా అధిపతి 'గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా'. అత్యాచారం కేసులో 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న ఈ ఖైదీ.. ఇప్పుడు ముచ్చటగా 16వ సారి పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చాడు.హరియాణాలోని సునారియా జైలులో ఉంటున్న గుర్మీత్‌కు తాజాగా మరో 30 రోజుల పాటు పెరోల్ మంజూరైంది. తన శిష్యురాళ్లపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో 2017లో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అప్పటినుంచి అతను జైల్లోనే ఉన్నాడు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఏకంగా 16 సార్లు అతను జైలు నుంచి దర్జాగా బయటకు వచ్చాడు. లెక్కలు తీస్తే ఈ కాలంలో అతను సుమారు 400 రోజులకు పైగా జైలు బయటే ఉన్నాడు. అంటే శిక్ష అనుభవిస్తున్న కాలంలో కూడా తన ఆశ్రమంలో లగ్జరీ జీవితాన్ని గడిపాడు. ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిన డేరా బాబా.. రాబోయే నెల రోజుల పాటు సిర్సాలోని డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయంలోనే దర్జాగా గడుపుతాడట.
మరి ఇలాంటప్పుడు కోర్టులు అతనికి 20 ఏళ్లు శిక్ష వేయడం ఎందుకు. నామమాత్రంగా అతన్ని జైలులో పెట్టడం ఎందుకంటూ తీవ్రమైన విమర్శలు సామాన్యుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. మన దేశంలో చట్టం ముందు అందరూ సమానమే అని కేవలం పుస్తకాల్లో చదువుకోవడానికేనా అన్న అనుమానం ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు కలుగుతుంది. జైలులో ఉన్న సామాన్య ఖైదీలు అత్యవసర పరిస్థితుల్లోనూ పెరోల్ దొరక్క జైలు గోడల మధ్యే ఏడుస్తూ ఉంటే.. డేరా బాబాకు మాత్రం ఏ పండుగ వచ్చినా, ఏ చిన్న కారణం చెప్పినా వెంటనే నెలల తరబడి పెరోల్ దొరుకుతోంది. దీన్ని చూస్తుంటే కోర్టులు వేసే శిక్ష జైళ్లు అతనికి అమలు చేయవా ? లేక ప్రభుత్వాలు పెయిడ్ హాలిడేస్ ఇస్తున్నాయా ? అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
దీని వెనుక ఏవో అదృశ్య రాజకీయ శక్తులు ఉన్నాయని, ఓటు బ్యాంకు కోసమే రాజకీయ నాయకులు అతనికి ఇలాంటి వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారనేది బహిరంగ రహస్యం. కారణం ఏదైనా.. సమాజం ఎంతో పవిత్రంగా భావించే న్యాయవ్యవస్థపై ఇలాంటి ఘటనలు కోలుకోలేని దెబ్బ కొడతాయి. ఎన్నో బెదిరింపులను ఎదుర్కొని, ప్రాణాలకు తెగించి పోరాడిన బాధితులకు మనం ఇస్తున్న న్యాయం ఇదేనా? రేప్ లాంటి అత్యంత హేయమైన నేరం చేసిన వ్యక్తి ఇలా పదే పదే జైలు నుంచి బయటకు వచ్చి దర్జాగా తిరుగుతుంటే.. సామాన్యులకు చట్టంపై, కోర్టు తీర్పులపై నమ్మకం ఎలా ఉంటుంది ? దొంగకైనా, దొరకైనా శిక్ష ఒకేలా ఉన్నప్పుడే చట్టానికి ఒక అర్థం ఉంటుంది. ఇలా ఒక రేపిస్టుకు లొసుగులను వాడుకుంటూ పదే పదే పెరోల్స్ ఇస్తూ పోతే.. అసలు ఆ శిక్షలకు అర్థం ఉండదు, సమాజంలో చట్టం పట్ల భయమూ ఉండదు.