నేషనలిస్టు సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా...సింపుల్‌గా చెప్పాలంటే ఎన్సీపీఐ. ఇప్పుడు ఈ పార్టీ గురించే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. త్రిపురకు చెందిన పెద్దగా ప్రాచుర్యం లేని ప్రాంతీయ పార్టీ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టీఎంసీ అసమ్మతి ఎంపీలు ఈ పార్టీలో విలీనం అయినట్లు ప్రకటించడమే కారణం. అసలు ఎన్సీపీఐ పార్టీని ఎవరు స్థాపించారు ? ఏ రాష్ట్రంలో ఆ పార్టీ రిజిస్టర్ అయింది ? ఎన్టీఏ కూటమిలో అతిపెద్ద పార్టీగా ఎలా అవతరించబోతంది.నార్త్ ఈస్ట్ ప్రాంతానికి చెందిన ఎన్సీపీఐ పార్టీ...జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది. టీఎంసీ ఎంపీల చేరికలతో దేశ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర పరిణామంగా మారింది. తృణమూల్ నుంచి బయటకు వచ్చిన 20 మంది సభ్యులు...ప్రస్తుతం ఎన్సీపీలో చేరిపోయారు. అంతేకాకుండా ఎన్డీయేకు బయట నుంచి మద్దతు తెలుపుతామని ప్రకటించారు. దీంతో ఇప్పుడు 20మంది ఎంపీలతో ఎన్డీయేలో అతిపెద్ద భాగస్వామిగా ఎన్సీపీఐ మారనుంది.
ప్రస్తుతం ఎన్డీయేలో టీడీపీకి 16మంది, జేడీయూకి 12మంది ఎంపీలు ఉన్నారు. దీంతో టీడీపీ ఎన్డీయే భాగస్వామి పార్టీలో అతి పెద్ద పార్టీగా కొనసాగుతోంది. ఎన్సీపీఐ నుంచి 20 మంది ఎంపీలు ఎన్డీయే భాగస్వామిగా చేరితే టీడీపీని బీట్ చేసి ఎన్డీయేలో అతిపెద్ద భాగస్వామి పార్టీగా ఎన్సీపీఐ అవతరించే అవకాశం ఉంది. అయితే, ఎన్సీపీఐలో విలీనం అంత సులభంగా చెల్లుబాటు అవుతుందా ? అనే ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పదో షెడ్యూల్ లోని యాంటీ డిఫెక్షన్ చట్టం ప్రకారం.. పార్లమెంటులోని ఒక పార్టీకి చెందిన ఎంపీలు వేరే పార్టీతో విలీనం కావాలంటే, ఆ పార్టీ పార్లమెంటరీ విభాగంలో కనీసం మూడింట రెండొంతుల మంది సభ్యులు విలీనానికి అంగీకరించాలి. తిరుగుబాటు ఎంపీలు తమ సంఖ్య ఆ పరిమితిని దాటిందని చెబుతున్నప్పటికీ, దీనిపై తుది నిర్ణయం లోక్‌సభ స్పీకర్ తీసుకోవాల్సి ఉంటుంది. తిరుగుబాటు వర్గాన్ని ప్రత్యేక సమూహంగా గుర్తిస్తారా ? ఎన్సీపీఐలో విలీనాన్ని అధికారికంగా ఆమోదిస్తారా ? అనే అంశాలపై స్పీకర్ నిర్ణయం కీలకంగా మారనుంది.
ఎన్సీపీఐ 2023 జనవరి 20న రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీగా నమోదైంది. అక్కడి గిరిజన ప్రాంతాల అభివృద్ధి, వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యం లక్ష్యంగా ఏర్పాటైంది. ఎన్నికల సంఘం వద్ద నమోదైన విరాళాల మొత్తం కేవలం రూ.1.13 లక్షలు మాత్రమే. దీనికి ఉత్తియా కుందు అధ్యక్షుడిగా...ష్యూలీ కుందు ట్రెజరర్‌గా కొనసాగుతున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే.. రెండు సంస్థలకు కూడా డైరెక్టర్‌గా కూడా ఉన్నారు ష్యూలీ. వాటిలో ఒకటి బిశ్వబజార్ ప్రైవేట్ లిమిటెడ్ కాగా, మరొకటి పశ్చిమ బంగా అసంఘటిత మహిళా కర్మి అసోసియేషన్. ఈ రెండు సంస్థలు కూడా పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలోని బనిపూర్ ప్రాంతంలోనే నమోదయ్యాయి. ఇదే అడ్రస్ ఎన్సీపీఐ పార్టీ అధికారిక కార్యాలయంగా కూడా ఉంది. రాజకీయంగా పెద్దగా గుర్తింపు లేని ఈ అనామక పార్టీ ఇప్పుడు ఒక్కసారిగా జాతీయ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది.
త్రిపురలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీఐ పోటీ చేసింది. ఏడు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని భావించినప్పటికీ, నాలుగు నియోజకవర్గాల్లో నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. చివరకు రెండు స్థానాల్లో మాత్రమే పార్టీ గుర్తుపై అభ్యర్థులు బరిలో నిలిచారు. చౌమనులో పార్టీ అభ్యర్థి 536 ఓట్లు సాధించగా, కైలాశహర్లో 286 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం కలిపి 822 ఓట్లకే పరిమితమైంది. మరో అభ్యర్థి స్వతంత్రుడిగా పోటీ చేసి 376 ఓట్లు సాధించాడు. మొత్తంగా పార్టీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులందరికీ కలిపి 1,198 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంతేకాదు, ఎన్నికల తర్వాత పార్టీ పూర్తిగా కనుమరుగైందని అప్పటి అభ్యర్థులే చెబుతున్నారు. ఆ ఎన్నికల తరువాత పార్టీ పూర్తిగా కనుమరుగైంది. ఎన్సీపీఐకి బెంగాల్‌తో ఉన్న అనుబంధం కేవలం హౌరా జిల్లాలోని సంక్రైల్ చిరునామా మాత్రమే. ఈ పార్టీ ప్రధానంగా త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో పరిమిత స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పార్టీ ఎన్నికల గుర్తు ఏడు కిరణాలతో కూడిన పెన్ నిబ్. అక్కడ పార్టీ వ్యవహారాలను శాంతను సాహా నిర్వహిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్‌లోని అసమ్మతి ఎంపీలు ఈ పార్టీలో విలీనం అయినట్లు ప్రకటించడం జాతీయ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.