హార్ముజ్‌ మళ్లీ క్లోజ్‌… ఈ యుద్ధం ఇక ఆగదా…?

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా - ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంతో పరిస్థితులు నెమ్మదిగా కుదుటపడుతున్నాయని ప్రపంచ దేశాలు భావిస్తున్న తరుణంలో ఇరాన్ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది.

Post Published By: dialnews
Updated : 22 June 2026, 5:50 PM IST

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా - ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంతో పరిస్థితులు నెమ్మదిగా కుదుటపడుతున్నాయని ప్రపంచ దేశాలు భావిస్తున్న తరుణంలో ఇరాన్ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ వాణిజ్యానికి, ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన 'హర్మూజ్ జలసంధి'ని మళ్లీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ నిరంతర దాడులు చేయడం, అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని దారుణంగా ఉల్లంఘించడమే తమ ఈ కఠిన నిర్ణయానికి ప్రధాన కారణమని ఇరాన్ స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ దురాక్రమణను ఇరాన్ తీవ్రంగా ఖండించింది.

ముఖ్యంగా లెబనాన్‌లోని స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుండటాన్ని తప్పుబట్టింది. కాల్పుల విరమణ ఉల్లంఘన పట్ల తమ ప్రతిస్పందనలో హర్మూజ్ జలసంధి మూసివేత అనేది కేవలం మొదటి అడుగు మాత్రమేనని, దాడులు ఇలాగే కొనసాగిస్తే రాబోయే రోజుల్లో తమ చర్యలు మరింత తీవ్రంగా ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ సంయుక్త సైనిక విభాగ కేంద్రమైన 'ఖతమ్-అల్ అన్బియా' అధికారికంగా వెల్లడించింది. దీనికి తోడు, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ 'IRGC' అంతర్జాతీయ నౌకలకు కఠిన హెచ్చరికలు జారీ చేసింది. ఆంక్షలు అమల్లో ఉన్నందున వాణిజ్య నౌకలేవీ జలసంధి వైపు రావద్దని, ఒకవేళ నిబంధనలు అతిక్రమించి వస్తే వాటి భద్రతకు ముప్పు వాటిల్లుతుందని స్పష్టం చేసింది.

సైనికంగా ఇంత కఠిన వైఖరిని ప్రదర్శిస్తున్నప్పటికీ, ఇరాన్ దౌత్యపరమైన మార్గాలను పూర్తిగా మూసివేయలేదు. మధ్యంతర ఒప్పందంపై అమెరికాతో చర్చలు జరిపేందుకు ఇరాన్ ప్రతినిధుల బృందం స్విట్జర్లాండ్‌కు వెళ్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఈ చర్చల నిమిత్తం త్వరలోనే స్విట్జర్లాండ్ వెళ్లనున్నట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య సాంకేతిక అంశాలపై శుక్రవారమే చర్చలు జరగాల్సి ఉన్నప్పటికీ, అవి వాయిదా పడ్డాయి. ప్రస్తుతం ఏదైనా మధ్యంతర ఒప్పందం అధికారికంగా అమలు దశలోకి వస్తే తప్ప, ఈ వివాదానికి శాశ్వత ముగింపు లభించదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. హర్మూజ్ జలసంధి మూసివేత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. పర్షియన్ గల్ఫ్ నుంచి అరేబియా సముద్రం, ఓమన్ సింధుశాఖలకు వెళ్లే ఏకైక సముద్ర మార్గం ఇదే. ప్రపంచ ముడి చమురు సరఫరాలో దాదాపు 20 శాతానికి పైగా నౌకలు ఈ ఇరుకైన జలసంధి గుండానే ప్రయాణిస్తాయి. ఇప్పుడు ఇరాన్ దీన్ని దిగ్బంధించడంతో, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమనే ప్రమాదం ఏర్పడింది.

చమురు రవాణా నిలిచిపోయి, సప్లై చైన్ దెబ్బతింటే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగి, ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా జోక్యం చేసుకుని కాల్పుల విరమణకు అంగీకరించాలని ఇజ్రాయెల్‌ను కోరినప్పటికీ, ఇజ్రాయెల్ ప్రభుత్వం లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తూనే ఉంది. కాల్పుల విరమణ అంగీకారానికి వచ్చిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ ఈ ఉల్లంఘనలకు పాల్పడటం ఇరాన్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అటు చర్చల ద్వారా శాంతికి ప్రయత్నిస్తూనే, ఇటు సముద్ర మార్గాలను మూసివేస్తూ ఇరాన్ ప్రపంచ దేశాలపై ఒత్తిడి పెంచుతోంది. రాబోయే రోజుల్లో అగ్రరాజ్యాలు మరియు పశ్చిమాసియా దేశాల మధ్య జరిగే చర్చల ఫలితాలే ఈ సంక్షోభానికి ముగింపు పలకనున్నాయి. ఆ ప్రయత్నాలు విఫలమైతే మాత్రం యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకునే ప్రమాదం ఉంది.

Published : 
  • 22 June 2026, 5:50 PM IST