Top story: ట్రంప్‌కు సొంత పార్టీలోనే వెన్నుపోటు? ఇరాన్ కు అనుకూలంగా తీర్మానం షేక్ అవుతున్న వైట్ హౌస్..!

అంతర్జాతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో ఒక ఊహించని సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌తో యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అమెరికా సెనేట్ గట్టి షాక్ ఇచ్చింది.

Post Published By: dialnews
Updated : 25 June 2026, 12:10 PM IST

అంతర్జాతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో ఒక ఊహించని సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌తో యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అమెరికా సెనేట్ గట్టి షాక్ ఇచ్చింది. ట్రంప్ ఏకపక్షంగా యుద్ధానికి వెళ్లకుండా, ఆయన సైనిక అధికారాలను కట్టడి చేస్తూ ఒక చారిత్రాత్మక ఉమ్మడి తీర్మానాన్ని ఆమోదించింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ప్రతిపక్ష డెమొక్రాట్లతో పాటు, ట్రంప్ సొంత పార్టీ అయిన రిపబ్లికన్ సెనేటర్లు కూడా కొందరు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. దీనిపై ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. అసలు అమెరికా పార్లమెంట్‌లో ఏం జరిగింది? ట్రంప్ అధికారాలను ఎలా లాగేసుకున్నారు? ఇరాన్ యుద్ధం ఇక్కడితో ఆగిపోతుందా?

అసలు విషయంలోకి వెళ్తే.. డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి ఇరాన్ పట్ల కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు. రీసెంట్‌గా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పీక్స్‌కి వెళ్లాయి. ఏ క్షణంలోనైనా అమెరికా సైన్యం ఇరాన్‌పై దాడికి దిగొచ్చనే వాతావరణం ఏర్పడింది. అయితే అమెరికా రాజ్యాంగం ప్రకారం.. యుద్ధం ప్రకటించే అధికారం కేవలం పార్లమెంట్ కు మాత్రమే ఉంటుంది. కానీ అధ్యక్షుడికి ఉన్న ప్రత్యేక రక్షణ అధికారాలను వాడుకుని ట్రంప్ ఏకపక్షంగా మిలిటరీ చర్యలకు దిగుతారేమో అని అమెరికా ప్రజాప్రతినిధులు భయపడ్డారు. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ఈ ప్రమాదాన్ని అడ్డుకోవడానికే సెనేట్ రంగంలోకి దిగింది.

సెనేట్‌లో జరిగిన ఓటింగ్‌లో ఈ తీర్మానం 50-48 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఆమోదం పొందింది. ఈ కొత్త తీర్మానం ప్రకారం.. ఇరాన్ నుంచి అమెరికాకు తక్షణ ముప్పు ఉంటే తప్ప, నార్మల్ కండిషన్స్‌లో కాంగ్రెస్ ముందస్తు అనుమతి లేకుండా ట్రంప్ ఎలాంటి సైనిక చర్యలు తీసుకోకూడదు. అంతేకాదు, ఇరాన్ సరిహద్దుల్లో, ఆ పరిసర ప్రాంతాల్లో మోహరించిన అమెరికా సైనిక బలగాలను వెంటనే వెనక్కి పిలిపించాలని ఈ ఉమ్మడి తీర్మానం ఆదేశించింది. శత్రుత్వాన్ని పక్కన పెట్టి దౌత్యపరమైన చర్చలు జరపాలని స్పష్టం చేసింది.

ఈ తీర్మానం నెగ్గడానికి డెమొక్రాట్లు మాత్రమే కారణం కాదు.. ట్రంప్ సొంత పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీకి చెందిన నలుగురు కీలక సెనేటర్లు పార్టీ లైన్ దాటి డెమొక్రాట్లతో చేతులు కలిపారు. దేశ భద్రత విషయంలో ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలు సరికాదంటూ వారు ఈ బిల్లుకు ఓటు వేశారు. దీనిపై డొనాల్డ్ ట్రంప్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. డెమొక్రాట్లతో చేతులు కలిపిన ఆ నలుగురు సొంత పార్టీ సెనేటర్లను ఉద్దేశించి.. 'వీరంతా డెమొక్రాట్లతో చేతులు కలిపిన రిపబ్లికన్ లూజర్స్' అంటూ సోషల్ మీడియాలో ఘాటుగా విమర్శించారు. ఈ బిల్లు అమెరికా దేశ రక్షణ సామర్థ్యాన్ని బలహీనపరుస్తుందని వైట్ హౌస్ గట్టిగా వాదించింది.

మరి సెనేట్ బిల్లు పాస్ చేసినంత మాత్రాన ట్రంప్ ఆగిపోతారా? అంటే దానికి ఒక టెక్నికల్ లూప్‌హోల్ ఉంది. అమెరికా అధ్యక్షుడికి 'వీటో' అధికారం ఉంటుంది. పార్లమెంట్ పాస్ చేసిన ఏ బిల్లునైనా ప్రెసిడెంట్ తన వీటో అధికారంతో తిరస్కరించవచ్చు. ఈ బిల్లును కూడా ట్రంప్ ఖచ్చితంగా వీటో చేస్తారని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ ట్రంప్ వీటో చేస్తే.. ఆ బిల్లు మళ్లీ చట్టం అవ్వాలంటే పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ కావాలి. కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో డెమొక్రాట్లకు అంత మెజారిటీ లేదు. కాబట్టి ఈ తీర్మానం కేవలం ట్రంప్‌ను మానసికంగా, రాజకీయంగా కట్టడి చేయడానికి మాత్రమే పనికొస్తుందని చెప్పాలి. ఏదేమైనా, ఒక దేశ అధ్యక్షుడి యుద్ధ కాంక్షను సొంత పార్టీవారే అడ్డుకోవడం అనేది అమెరికా చరిత్రలో ఒక అరుదైన పరిణామం. ఈ రాజకీయ పోరు రాబోయే రోజుల్లో వైట్ హౌస్‌కు, అమెరికా కాంగ్రెస్‌కు మధ్య ఎలాంటి యుద్ధానికి దారితీస్తుందో చూడాలి.

Published : 
  • 25 June 2026, 12:10 PM IST