నిప్పుల కొలిమిలా యూరప్‌… వడగాలులకు అసలు కారణం ఇదే..!

యూరప్ ఖండం ఒక నిప్పుల కొలిమిలా మారిపోయింది. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం వల్ల వాతావరణంలో తీవ్ర మార్పులు సంభవిస్తున్నాయని, దీని వల్లే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని 'వరల్డ్ వెదర్ ఆట్రిబ్యూషన్' శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Post Published By: dialnews
Updated : 1 July 2026, 4:00 PM IST

యూరప్ ఖండం ఒక నిప్పుల కొలిమిలా మారిపోయింది. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం వల్ల వాతావరణంలో తీవ్ర మార్పులు సంభవిస్తున్నాయని, దీని వల్లే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని 'వరల్డ్ వెదర్ ఆట్రిబ్యూషన్' శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత ఐదు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా జూన్ నెలలో అత్యంత తీవ్రమైన వడగాలులు రికార్డు సృష్టించాయి. యూరప్ దేశాలు భయంకరమైన వడగాలుల దెబ్బకు అల్లాడిపోతున్నాయి. పశ్చిమ యూరప్‌లో మొదలైన ఈ తీవ్రత క్రమంగా సెంట్రల్, ఈస్టర్న్ యూరప్ దేశాలకు విస్తరించింది. చార్ట్ ప్రకారం పోర్చుగల్ లో అత్యధికంగా 42°C, ఫ్రాన్స్ లో 41°C, ఇటలీలో 40°C, జర్మనీలో 38°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. డెన్మార్క్‌లో ఏకంగా 150 ఏళ్ల నాటి రికార్డు బద్దలై.. 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. స్విట్జర్లాండ్‌లో 38.8 డిగ్రీలు నమోదు కాగా, బ్రిటన్ లో జూన్ నెల చరిత్రలోనే అత్యధికంగా 37.3 డిగ్రీలు రికార్డయింది. జర్మనీలో ఏకంగా 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

పెరుగుతున్న వేడి తీవ్రతకు తట్టుకోలేక రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయి. జర్మనీలో ఎండల దాటికి ప్రసిద్ధ 'ఆటోబాన్' హైవేపై ఉన్న కాంక్రీట్ స్లాబ్ లు పేలిపోవడంతో అధికారులు పలు రహదారులను మూసివేశారు. ఫ్రాన్స్ లో రోడ్లు కరిగిపోతుండటంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. విద్యుత్ సరఫరాకు పెద్దగా సమస్య లేనప్పిటికీ.. అణు రియాక్టర్ల కూలింగ్ సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు చెబుతున్నారు. రైల్వే పట్టాలు దెబ్బతినడం, రోడ్లు కరిగిపోతుండటం వల్ల పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వడగాలులు ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయి. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వృద్ధులు ఈ వేడికి విలవిలలాడుతున్నారు. ఒక్క ఫ్రాన్స్ లోనే వడగాలుల కారణంగా వెయ్యి మందికి పైగా చనిపోయారు. పారిస్ పరిసర ప్రాంతాల్లోని ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇటలీలో మరణించే వారి సంఖ్య 40 శాతం పెరిగిందని WHO తెలిపింది. తీవ్రత దృష్ట్యా ఇటలీ, యూకే దేశాల్లో రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేశారు. రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడం పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తోంది.

జర్మనీలోని నర్సింగ్ హోమ్స్ కు అత్యవసరంగా ఏసీలు తీసుకురావాల్సి వచ్చింది. భూమి ప్రమాదకరంగా వేడెక్కుతోందని శాస్త్రవేత్తలు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. 1976 నాటి పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం 3.5 డిగ్రీలు, 2003 తో పోలిస్తే ఇప్పుడు 2 డిగ్రీల అదనపు వేడి రికార్డవుతోంది. 50 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇలాంటి విపత్తులు సంభవించే అవకాశం వందల రెట్లు పెరిగింది. 2003 నాటి విపత్తు తర్వాత యూరప్ దేశాలు మేల్కొని హెచ్చరిక వ్యవస్థలు ఏర్పాటు చేసినా, వాతావరణ మార్పుల వేగం ముందు అవి సరిపోవడం లేదు. WHO యూరప్ చీఫ్ డాక్టర్ 'హన్స్ క్లూగే' మాట్లాడుతూ, గత నాలుగు దశాబ్దాల్లో యూరప్ లో వేడి వల్ల 2 లక్షల మంది చనిపోయారని, భవిష్యత్తులో మిలియన్ల మంది ప్రభావితం అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్కిటిక్ మంచు వేగంగా కరగడం వల్లే యూరప్ ఖండం ఇంత వేగంగా వేడెక్కుతోందన్నారు. గ్లోబల్ వార్మింగ్ ముప్పు ఎంత వేగంగా మన మీదకు దూసుకొస్తుందో చెప్పడానికి ప్రస్తుత యూరప్ పరిస్థితే ఒక సజీవ సాక్ష్యం అని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Published : 
  • 1 July 2026, 4:00 PM IST