టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ముంబై నుంచి అతడు మకాం మార్చేశాడు. పర్మినెంట్ గా బెంగళూరులో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. హార్దిక్ పాండ్యా సన్నిహిత వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి.
అరుదైన పేస్ బౌలింగ్ నైపుణ్యాలున్న హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ కారణాల దృష్ట్యా.. చాన్నాళ్ల క్రితమే టెస్టు ఫార్మాట్‌ను వదిలేశాడు. వన్డే, టీ20లలో టీమిండియా కీలక ఆల్‌రౌండర్‌గా కొనసాగుతున్న ఈ బరోడా ఆటగాడిని తరచూ గాయాలు వేధిస్తున్నాయి. ఒకానొక దశలో వెన్నునొప్పి కారణంగా ఏళ్ల పాటు జట్టుకు దూరమైన అతడు.. ఊహించని రీతిలో కమ్‌బ్యాక్ ఇచ్చాడు. భారత్ 2024 టీ20 ప్రపంచకప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, కొన్నాళ్లుగా హార్దిక్ పాండ్యా తరచూ గాయాల బారిన పడుతున్నాడు.
వెన్నునొప్పి కారణంగా ఐపీఎల్ 19వ సీజన్ లో పలు మ్యాచ్‌లకు దూరమైన ఈ ఆల్‌రౌండర్.. తాజాగా తొడ కండరాల గాయంతో అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు, ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల నుంచి కూడా తప్పుకున్నాడు.ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో హార్దిక్ పాండ్యా పునరావాసం పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో సీవోఈనే తన శాశ్వత శిక్షణా శిబిరంగా మార్చుకోవాలని అతడు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ముంబై నుంచి బెంగళూరుకు మకాం మార్చినట్లు తెలుస్తోంది. దీని కోసం సిటీ శివార్లలో ఓ ప్రాపర్టీని అద్దెకు తీసుకున్నాడు. తన కెరీర్ చరమాంకం వరకు అతడు ఇక్కడే శిక్షణ పొందాలని నిర్ణయించుకున్నాడు.
నిజానికి ముంబైలో తన ఇంటి నుంచి.. ట్రెయినింగ్ సెంటర్‌కు వెళ్లడం హార్దిక్‌కు చాలా కష్టంగా మారింది. సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న క్రికెటర్‌గా సీవోఈలో అతడికి అన్ని సౌకర్యాలూ లభిస్తాయి. గాయం నుంచి కోలుకోవడం నుంచి.. నైపుణ్యాలు మెరుగుపెట్టుకోవడం సహా ప్రతీ విషయంలోనూ అతడికి బీసీసీఐ నుంచి సహకారం ఉంటుంది. అందుకే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్, దేశీ టోర్నీలు, టీమిండియా తరఫున విధుల్లో ఉన్నపుడు మాత్రం అతడు సీవోఈకి దూరంగా జట్టుతో కలిసి ఉంటాడు. మరో ఐదు నుంచి ఆరేళ్ల పాటు హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ కెరీర్ సజావుగా కొనసాగించాలనుకుంటున్నాడనీ అతని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.