దేశవ్యాప్తంగా కోట్ల మంది హిందువుల ఆరాధ్యదైవం.. అయోధ్య బాలరాముడి మందిరంలో ఎవరూ ఊహించని ఒక మహా ఘోరం వెలుగులోకి వచ్చింది. భక్తులు ఎంతో భక్తితో సమర్పించిన కోట్ల విలువైన విరాళాలను కొందరు కేటుగాళ్లు పక్కదారి పట్టించారు. తాజాగా ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి కథనంలో వచ్చిన వివరాలు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. దొంగిలించిన బంగారు ఆభరణాలకు ఎలాంటి ఆధారాలు దొరకకూడదని, ఆ బంగారాన్ని ఏకంగా కరిగించి బిస్కట్లుగా మార్చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. అసలు ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరు? ప్రతిరోజూ ఎన్ని లక్షల రూపాయలు స్వాహా చేశారు? ఈ వీడియోలో పూర్తి షాకింగ్ విషయాలు తెలుసుకుందాం.
అసలు ఈ కుంభకోణం ఎలా బయటపడింది అంటే.. అయోధ్య రామాలయానికి రోజుకు సుమారు 70 నుండి 80 వేల మంది భక్తులు వస్తుంటారు. వీరంతా హుండీల్లో వేసే కానుకలను లెక్కించే సమయంలో తీవ్రమైన తేడాలు వచ్చాయి. అనుమానం వచ్చిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఒక భారీ నెట్‌వర్క్‌ను ఛేదించింది. ఈ దొంగతనంలో ఆలయ ఉద్యోగులతో పాటు కొందరు బ్యాంక్ మాజీ ఉద్యోగులు కూడా ఉన్నట్లు తేలడం సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో 8 మంది ముఖ్య నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
బ్యాంక్ అధికారులు సిట్ కి ఇచ్చిన సమాచారం వింటే నిందితులు ఎంత పక్కాగా స్కెచ్ వేశారో అర్థమవుతుంది. ఈ దొంగతనం బయటపడకముందు.. ఆలయ ట్రస్ట్ అకౌంట్లలో రోజుకు సగటున 16 నుండి 18 లక్షల రూపాయల విరాళాలు డిపాజిట్ అయ్యేవి. కానీ ఎప్పుడైతే ఈ దొంగతనం కేసు నమోదై దర్యాప్తు మొదలైందో.. ఒక్కసారిగా రోజువారీ డిపాజిట్లు 24 నుండి 26 లక్షల రూపాయలకు పెరిగాయి. అంటే దీన్ని బట్టి చూస్తే.. నిందితులు ప్రతిరోజూ హుండీ ఆదాయం నుండి ఏకంగా 6 నుండి 8 లక్షల రూపాయల క్యాష్ నొక్కేసేవారని దర్యాప్తు అధికారులు అంచనా వేస్తున్నారు! ఇలా కోట్లాది రూపాయల భక్తుల సొమ్మును దోచేశారు.
ఇక అన్నింటికన్నా దారుణమైన విషయం ఏంటంటే.. భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల చోరీ. పోలీసులు నిందితుల ఇళ్లపై దాడులు చేసినా కొన్ని విలువైన ఆభరణాల జాడ దొరకలేదు. దీనిపై నిందితులను సిట్ అధికారులు గట్టిగా విచారించగా అసలు నిజం ఒప్పుకున్నారు. దొంగిలించిన నగలను అలాగే ఉంచితే వాటి డిజైన్ల ఆధారంగా దొరికిపోతామని భయపడి.. ఆ నగలన్నింటినీ కరిగించి బంగారు బిస్కట్లుగా మార్చేశారు. ఆనవాళ్లు పూర్తిగా తుడిచేయడానికే ఈ దారుణానికి ఒడిగట్టారు. ఆలయ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న కేడీ బాబును కూడా సిట్ అధికారులు దీనిపై సుదీర్ఘంగా ప్రశ్నించారు.
మరి దొంగిలించిన ఈ రాముడి సొమ్ముతో నిందితులు ఏం చేశారు? విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. ఈ పాపపు సొమ్ముతో నిందితులు భారీగా లగ్జరీ కార్లను, ఖరీదైన మొబైళ్లను కొనుగోలు చేశారు. అంతేకాదు లక్నో, అయోధ్య పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు, ఇండ్లను బినామీల పేర్లతో కొనుగోలు చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. నిందితుడైన రామ్‌శంకర్ యాదవ్ అలియాస్ టిను యాదవ్ ఇంట్లో పోలీసులు జరిపిన సోదాల్లో ఖరీదైన గృహోపకరణాలు, లగ్జరీ వస్తువుల బిల్లులు చూసి అధికారులే షాక్ అయ్యారు. భక్తుల నమ్మకాన్ని నట్టేట ముంచి ఇలా జల్సాలు చేశారు.