ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ ఓటమికి కారణమైన లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మద్ధతుగా నిలిచాడు. జట్టు ఓటమికి ఒక్కడినే బాధ్యుడిని చేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ ఎక్కడ మా చేతుల్లో నుంచి జారిపోయిందో తనకు తెలుసన్నాడు. కానీ ఒకే ఆటగాడిని చూపించి అతనినే నిందించాలనుకోవడం లేదనీ, 16వ ఓవర్ తర్వాత మ్యాచ్ టర్న్ అయిందన్నాడు. బిష్ణోయ్ వేసిన వరుస నోబాల్స్ గురించి ప్రశ్నించగా.. ఒక నోబాల్ వేసినా అతను మరింత బలంగా తిరిగి వస్తాడని నమ్ముతున్నట్టు వ్యాఖ్యానించాడు.అతను ఈ అనుభవం నుంచి నేర్చుకోవాల్సి ఉంటుందని శ్రేయాస్ అభిప్రాయపడ్డాడు.
మాంచెస్టర్ పిచ్ పై 190 పరుగులు చాలామంచి స్కోరుగా చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా చివరి ఓవర్‌లో తిలక్ వర్మ ఆడిన 24 పరుగుల ఇన్నింగ్స్ అసాధారణమని కితాబిచ్చాడు.. అదే సమయంలో జేకబ్ బేతెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతనికి కూడా తగిన గుర్తింపు ఇవ్వాలన్నాడు.టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై కూడా శ్రేయస్ ప్రశంసలు కురిపించాడు. అతనిలో ఏమాత్రం భయం కనిపించలేదనీ, గత కొన్ని నెలలుగా అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నాడనీ కితాబిచ్చాడు. అరంగేట్రం ఒత్తిడిని ఏమాత్రం పట్టించుకోకుండా అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడనీ, అతని కాన్ఫిడెన్స్ చూడటానికి చాలా ఆనందంగా ఉందని ప్రశంసించాడు.
ఇదిలా ఉంటే 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 16 ఓవర్లు ముగిసే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బౌలింగ్‌కు వచ్చిన రవి బిష్ణోయ్ వరుసగా రెండు నోబాల్స్ వేయగా, ఫ్రీ హిట్‌లను జేకబ్ బేతెల్ రెండు భారీ సిక్సర్లుగా బాదాడు. అదే ఓవర్‌లో మరో సిక్స్, ఒక ఫోర్‌తో కలిపి మొత్తం 29 పరుగులు రావడంతో మ్యాచ్ పూర్తిగా ఇంగ్లండ్ వైపు వెళ్లిపోయింది. దీంతో ఇంగ్లీష్ టీం మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య జట్టు 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దవగా.. మూడో టీ ట్వంటీ మంగళవారం ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతుంది.