నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు మానస సరోవర్ యాత్రికుల పాలిట మృత్యువుగా మారాయి. ఈ వరదల్లో సుమారు 400 మంది యాత్రికులు గల్లంతయ్యారు. వరద తీవ్ర చూస్తుంటే.. గల్లంతైన వారిలో ఎంత మంది ప్రణాలు దక్కుతాయో చెప్పలేమంటున్నారు అధికారులు. ప్రతీ ఏటా ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా.. ప్రతీ ఏటా ప్రాణాలకు తెగించి మానస సరోవర్ యాత్ర చేస్తుంటారు హిందువులు. మానస సరోవర్ యాత్ర అనేది హిమాలయాల్లోని టిబెట్ సరిహద్దుల్లో ఉండే కైలాస పర్వతం, మానస సరోవరం సరస్సు దర్శనం కోసం చేసే అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణం. సముద్ర మట్టానికి సుమారు 19,500 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉండే తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితుల నడుమ ఈ యాత్ర సాగుతుంది. హిందూ, బౌద్ధ, జైన, టిబెటన్ ‘బోన్’ మతాల విశ్వాసాల ప్రకారం కైలాస పర్వతం శివుని నివాసస్థలం.
ప్రపంచానికే ఇది కేంద్ర బిందువని నమ్ముతారు. మానస సరోవరం సరస్సు నీరు అత్యంత స్వచ్ఛమైనదిగా, బ్రహ్మదేవుని మనస్సు నుంచి ఉద్భవించినదిగా భావిస్తారు. అందుకే జీవితంలో ఒక్కసారైనా మానస సరోవర్ యాత్ర చేయాలని ప్రతీ హిందువు భావిస్తాడు. మానస సరోవరంలో ఒకసారి స్నానం చేస్తే.. జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని, కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తే పునర్జన్మ నుంచి విముక్తి లభించి మోక్షం సిద్ధిస్తుందని భక్తుల గాఢ నమ్మకం. మానస సరోవర్, కైలాస పర్వతాల యాత్ర ప్రాచీన కాలం నుంచి వేల ఏళ్లుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక యాత్ర. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కాంద పురాణంలోని 'మానస ఖండ్'లో ఈ యాత్ర ప్రస్తావన ఉంది.
జైన మత తొలి తీర్థంకరుడైన ఋషభదేవుడు కైలాస పర్వత ప్రాంతంలోనే నిర్వాణం పొందారని, అలాగే సిక్కు మత స్థాపకుడు గురు నానక్ దేవ్ కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి ధ్యానం చేశారని ఆధారాలు ఉన్నాయి. 7వ శతాబ్దం నుంచే హిందూ, బౌద్ధ, జైన మునులు, సాధువులు కాలినడకన ఈ కఠినమైన యాత్రను చేయడం ప్రారంభించారు. 1954కి ముందు భారతీయ భక్తులు, సాధువులు ఎలాంటి ప్రత్యేక వీసాలు లేదా పాస్‌పోర్టులు లేకుండా నేరుగా సరిహద్దులు దాటి యాత్ర చేసేవారు. 1959లో టిబెట్‌ను చైనా ఆక్రమించడం, ఆ తర్వాత 1962లో భారత్-చైనా యుద్ధంతో.. సరిహద్దులు మూతపడ్డాయి. దీనివల్ల సుమారు 21 ఏళ్ల పాటు మానస సరోవర యాత్ర పూర్తిగా నిలిచిపోయింది. భారత్, చైనా ప్రభుత్వాల మధ్య దౌత్యపరమైన ఒప్పందం కుదిరింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1981 నుండి అధికారికంగా మానస సరోవర యాత్రను తిరిగి ప్రారంభించారు.
1981 నుంచి ఉత్తరాఖండ్‌లోని 'లిపులేఖ్ పాస్' మార్గం ద్వారా భారత ప్రభుత్వం భక్తుల బృందాలను ఈ పవిత్ర యాత్రకు పంపడం ప్రారంభించింది. ఈ యాత్రలో ముఖ్యంగా రెండు భాగాలు ఉంటాయి. ఒకటి.. మానస సరోవర దర్శనం,స్నానం. రెండు.. కైలాస పర్వతం చుట్టూ దాదాపు 52 కిలోమీటర్ల కఠినమైన నడక. భారత విదేశాంగ శాఖ అధికారికంగా నిర్వహించే యాత్ర ద్వారా, ప్రైవేట్ టూర్ ఆపరేటర్ల ద్వారా.. ఏటా సుమారు 20,000 నుండి 30,000 మంది భక్తులు యాత్రను పూర్తి చేస్తారు. హిమాలయాల భౌగోళిక పరిస్థితుల వల్ల ఇక్కడ ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. కొండచరియలు విరిగిపడటం, క్లౌడ్ బరస్ట్, తుఫానుల వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. 1998లో ఉత్తరాఖండ్‌లోని 'మాల్పా' కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో దాదాపు 200 మందికి పైగా యాత్రికులు అక్కడిక్కడే చనిపోయారు. ప్రైవేట్ మార్గంలో వెళ్లేవారు హెలికాప్టర్లు, చిన్న విమానాలు, మినీ బస్సులను ఉపయోగిస్తారు.
ప్రతికూల వాతావరణం వల్ల రన్-వే పై కొండలను ఢీకొట్టడం, వాహనాలు నదుల్లో పడిపోవడం వంటి ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. నేపాల్‌లోని తనహున్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 27 మంది భారతీయ యాత్రికులు చనిపోయారు. 1981 నుండి ఇప్పటి వరకు ఈ యాత్రలో వివిధ కారణాల వల్ల చనిపోయిన వారి మొత్తం సంఖ్య సుమారు 600 నుండి 1,000 మందికి పైనే ఉంటుందని అంచనా. ప్రతీ ఏటా మే నుంచి సెప్టెంబర్ మధ్య సగటున 10 నుండి 25 మంది భక్తులు ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ యాత్రలో ప్రమాదాల కంటే ఆరోగ్యపరమైన కారణాలే ఎక్కువ మంది మరణానికి దారితీస్తాయి. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 15,000 నుండి 19,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంత ఎత్తుకు వెళ్లినప్పుడు ఆక్సిజన్ తీవ్రంగా తగ్గిపోతుంది. దీనివల్ల ఊపిరితిత్తులలో లేదా మెదడులో నీరు చేరి ప్రమాదకరంగా మారుతుంది. మైనస్ డిగ్రీల ఉష్టోగ్రత, కఠినమైన నడక, ఆక్సిజన్ కొరత వల్ల.. వయసు పైబడిన వాళ్లు హార్ట్ పేషెంట్లకు హఠాత్తుగా గుండెపోటు వస్తుంది.
ఈ ప్రాంతం చాలా మారుమూల సరిహద్దుల్లో ఉండటం వల్ల, ప్రతికూల వాతావరణంలో హెలికాప్టర్ ఎయిర్‌లిఫ్ట్ చేయడం సాధ్యం కాక రోగులను ఆసుపత్రులకు తరలించడం ఆలస్యమవుతుంది. మానస సరోవరం మరియు కైలాస పర్వత యాత్ర అత్యంత కఠినమైనది, ప్రాణాపాయంతో కూడుకున్నదని తెలిసినప్పటికీ, శతాబ్దాలుగా హిందువులు ఈ యాత్ర ఆపకపోవడానికి ఆధ్యాత్మిక నమ్మకాలే కారణం. హిందూ విశ్వాసాల ప్రకారం కైలాస పర్వతం పరమశివుడు పార్వతీదేవితో కలిసి ప్రత్యక్షంగా నివసించే ప్రాంతం. దీన్ని దర్శించుకుంటే పునర్జన్మ రాకుండా 'మోక్షం' లభిస్తుందని నమ్ముతారు. మానస సరోవరం బ్రహ్మదేవుని "మనస్సు" నుంచి ఉద్భవించిన సరస్సు అని హిందువుల నమ్మకం
. ఈ యాత్రను ఒక సాధారణ పర్యటనగా కాక, ఒక 'తపస్సు'గా భావిస్తారు హిందువులు. ఈ పవిత్రమైన ప్రయాణంలో ప్రాణాలు పోయినా, అది పరమశివుని చరణాల చెంతే జరిగినట్లు భావిస్తారు. అక్కడికి వెళ్లొచ్చిన చాలామంది అనుభవం ప్రకారం.. కైలాస-మానస సరోవర ప్రాంతంలో ఒక విలక్షణమైన ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. ఆ ప్రకృతి ప్రశాంతత, హిమాలయాల భవ్యత మనుషులను భౌతిక ప్రపంచం నుంచి వేరుచేసి ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి తీసుకెళ్తుంది. సవాలు ఎంత పెద్దదైతే, దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక ఫలితం అంత గొప్పది అనే "దృఢ విశ్వాసమే" ఇన్ని ప్రమాదాలు ఉన్నప్పటికీ భక్తులను కైలాస మానస సరోవరానికి నడిపిస్తోంది.