ఇండియన్స్‌కి బంగారమంటే ఎంత ఇష్టమో సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. పండుగలు, శుభకార్యాలు వస్తే చాలు బంగారం కొనడం మన ఆనవాయితీ. అయితే, కొంతకాలంగా సామాన్యులకు అందనంత ఎత్తులో బంగారం ధరలు రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. ధరలు ఇంకా పెరిగిపోతాయేమో అన్న భయంతో చాలామంది హడావుడిగా కొనేస్తుంటారు. కానీ అలా చేయడం సరికాదని.. ఒక కీలకమైన రేటు వద్దకు రాగానే బంగారం కొనడం ఆపేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో బంగారం ధరల మీద తీవ్రమైన ఒత్తిడి కొనసాగుతోంది. దీనికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి.
అమెరికా కరెన్సీ 'డాలర్' బాగా బలపడటం, అమెరికా బాండ్లపై రాబడి పెరగడం, మరియు అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను ఇంకా ఎక్కువ కాలం పాటు గరిష్ట స్థాయిల్లోనే కొనసాగిస్తుందనే అంచనాలు ఉండటం. సాధారణంగా డాలర్ బలపడి వడ్డీ రేట్లు పెరిగితే, ఇన్వెస్టర్లు అటువైపు మొగ్గుచూపి బంగారం కొనుగోళ్లు తగ్గిస్తారు. కానీ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. తాజా మార్కెట్ ట్రెండ్స్ ప్రకారం నిపుణులు సూచిస్తున్నది ఒక్కటే.. మార్కెట్ పెరిగినప్పుడు కంగారు పడి కొనకండి. ప్రస్తుతం 2026 మార్కెట్ లెక్కల ప్రకారం, 10 గ్రాముల బంగారం ధర 1 లక్షా 47 వేల 700 నుండి 1 లక్షా 52 వేల పైచిలుకు స్థాయికి వేగంగా చేరుకుంటే.. అక్కడ సామాన్యులు కొనుగోలును ఆపేయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే, ఆ గరిష్ట స్థాయికి చేరిన తర్వాత ఇన్వెస్టర్లు లాభాల కోసం అమ్మకాలు మొదలుపెడతారు. అప్పుడు మళ్లీ ధరలు పడిపోయే అవకాశం ఉంటుంది. ఆ హడావుడిలో అత్యధిక రేటు వద్ద కొంటే మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. బంగారం ధరలు కాస్త కిందికి దిగివచ్చినప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
ధరలు కాస్త తగ్గి 1 లక్షా 39 వేల నుంచి 1 లక్షా 40 వేల మధ్యకు వచ్చినప్పుడు కొనుగోలు దారులకు అది మద్దతు స్థాయిగా పనిచేస్తుంది. అప్పుడు కొంటే లాభదాయకం. ఒకవేళ ఆ స్థాయి కంటే కిందకు పడిపోతే అది మరొక బలమైన సపోర్ట్‌గా ఉంటుంది. స్వల్పకాలంలో ఇలా ధరలు ఎత్తుపల్లాలు చూసినప్పటికీ.. దీర్ఘకాలంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతాయని ప్రముఖ గ్లోబల్ రిసెర్చ్ సంస్థల అంచనా. కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం నిల్వలు పెంచుకుంటున్న నేపథ్యంలో, 2030 నాటికి 10 గ్రాముల బంగారం ధర సులభంగా రెట్టింపు అయ్యే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా లాంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. బంగారం ఎప్పుడైనా సురక్షితమైన పెట్టుబడే. కానీ రేట్లు విపరీతంగా పెరిగిపోయి ఓ కీలక స్థాయిని దాటినప్పుడు ఆపేసి మార్కెట్ కొద్దిగా స్థిరపడి, ధరలు కాస్త తగ్గాక కొనడం తెలివైన పని అంటున్నారు నిపుణులు.