పండగల సీజన్ వచ్చేస్తోంది.. కానీ భారత ఇళ్లల్లో మాత్రం చక్కెర ధరలు చేదు పుట్టిస్తున్నాయి. కేవలం ఒకే ఒక్క నెలలో రిటైల్ మార్కెట్లో చక్కెర ధరలు ఏకంగా 40% పెరిగి, కిలో రికార్డ్ స్థాయిలో 67 రూపాయల మార్కును తాకింది. అయితే ఈ హఠాత్ ధరల పెరుగుదల వెనుక అసలు విలన్ ఎవరు? మన దేశాన్ని ఇంధన రంగంలో స్వయంసమృద్ధి వైపు తీసుకెళ్తున్న "ఇథనాల్ బ్లెండింగ్ పాలసీ" వల్లే చక్కెర కొరత ఏర్పడిందా? ఈ "ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్" వివాదం ఏంటి? ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్తలు దీనిపై ఏమంటున్నారు? మొదటగా చక్కెర ధరలు ఎందుకు పెరిగాయో అర్థం చేసుకుందాం. 2025-26 చెరకు సీజన్ ప్రారంభంలో మన దేశంలో సుమారు 34.3 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. కానీ, వాతావరణ మార్పుల వల్ల భారీ వర్షాలు, వరదలు, మరియు చెరకు పంటకు పట్టిన రెడ్ రాట్, టాప్ బోరర్ వంటి ప్రమాదకరమైన తెగుళ్ల కారణంగా ఈ అంచనా 30.6 మిలియన్ టన్నులకు పడిపోయింది. అంటే.. అనుకున్న దానికంటే దాదాపు 11% ఉత్పత్తి తగ్గిపోయింది.
ఉత్పత్తి తగ్గడం ఒకవైపు అయితే, పండగల సీజన్ కావడం వల్ల దేశీయంగా చక్కెర డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో కూడా చక్కెర ధరలు ఆకాశాన్ని తాకాయి. దీనికి తోడు కొంతమంది వ్యాపారులు స్టాక్‌ను అక్రమంగా నిల్వ చేయడం, బ్లాక్ మార్కెట్ కు తరలించడం వల్ల ధరలకు రెక్కలొచ్చాయి. మరి ఇందులో ఇథనాల్ పాత్ర ఏంటి? కొన్ని ఏళ్లుగా భారతదేశంలో చక్కెర మిగులు ఉత్పత్తి ఎక్కువగా ఉండేది. అవసరానికి మించి చక్కెర నిల్వలు ఉండటంతో.. చెరకు రైతులకు మిల్లుల యాజమాన్యాలు సకాలంలో డబ్బులు చెల్లించలేకపోయేవి.దీనికి పరిష్కారంగా, అలాగే క్రూడ్ ఆయిల్ దిగుమతులను తగ్గించుకోవడానికి భారత ప్రభుత్వం ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. చెరకు రసం, మొలాసిస్ నుండి ఇథనాల్ తయారు చేసి, దానిని పెట్రోల్‌లో కలిపి వాహనాలకు వాడటం ప్రారంభించారు. దీనివల్ల మిల్లులకు అదనపు ఆదాయం వచ్చింది, రైతుల బకాయిలు తీరాయి. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో.. ఈ ఏడాది చక్కెర కొరత రావడంతో, "చక్కెర చేయాల్సిన చెరకును పెట్రోల్ కోసం ఇథనాల్‌గా మార్చడం వల్లే ఈ తిప్పలు వచ్చాయా?" అనే చర్చ మొదలైంది.
ఈ ఇథనాల్ వివాదంపై దేశంలోని ఇద్దరు అగ్రశ్రేణి వ్యవసాయ ఆర్థికవేత్తలు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.రమేష్ చంద్.. ఈయన వాదన ప్రకారం.. చక్కెర ధరల పెరుగుదలకు ఇథనాల్ ప్రధాన కారణం కాదు. ఎందుకంటే గత ఏళ్లతో పోలిస్తే ఈసారి ఇథనాల్ కోసం వాడిన చెరకు శాతం 11% నుండి 9% కి తగ్గింది. అంతేకాకుండా, ప్రస్తుతం మన దేశంలో 75% ఇథనాల్‌ను చెరకు నుండి కాకుండా మొక్కజొన్న, విరిగిన బియ్యం వంటి ధాన్యాల నుండి తయారు చేస్తున్నారు. కాబట్టి వాతావరణం, పంట తెగుళ్లే అసలు కారణం కానీ ఇథనాల్ పాలసీ వైఫల్యం కాదు అని ఆయన స్పష్టం చేశారు.అశోక్ గులాటి: అయితే ప్రొఫెసర్ అశోక్ గులాటి దీనితో పూర్తిగా ఏకీభవించడం లేదు. ఉత్పత్తి తగ్గడం నిజమే అయినప్పటికీ, దేశంలో చక్కెర కొరత ఏర్పడుతున్నప్పుడు ఇథనాల్ తయారీకి చెరకును డైవర్ట్ చేయడం వల్ల పరిస్థితి మరింత జటిలమైందని ఆయన వాదించారు. ప్రభుత్వం కొన్ని నెలల ముందే దీనిని గుర్తించి, ఇథనాల్ కోసం చెరకు డైవర్షన్‌ను తాత్కాలికంగా ఆపాల్సిందని, లేదా చెరకుకు బదులు ఇథనాల్‌ను నేరుగా దిగుమతి చేసుకుని ఉంటే ఈ చక్కెర సంక్షోభం వచ్చేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ వివాదం తీవ్రం కావడంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. దేశంలో చక్కెర లభ్యతను పెంచడానికి విదేశాల నుండి రా చక్కెర దిగుమతికి అనుమతులు ఇచ్చింది. అలాగే హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై కఠిన చర్యలు చేపట్టింది. ఫలితంగా.. పోయిన వారం మార్కెట్లో కిలో రూ. 67 పలికిన చక్కెర ధరలు, ప్రభుత్వ చర్యల తర్వాత మిల్లు రేట్లలో 18% వరకు తగ్గి ప్రస్తుతం రూ. 55 కి చేరి కాస్త ఊరటనిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ, భారతదేశం లాంటి భారీ జనాభా ఉన్న దేశంలో ఒకవైపు ఇంధన భద్రత, మరోవైపు ఆహార లభ్యత రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలు. ఇథనాల్ బ్లెండింగ్ దేశ ప్రగతికి అవసరమే, కానీ అది సామాన్యుడి వంటగదిపై భారం పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది.