ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప 2: ది రూల్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగించింది.
ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.అయితే, ఈ సినిమా విజయం ఒకవైపు ఉంటే.. మరోవైపు ఈ చిత్రంలో నటించిన ఒక నటి ఆవేదన ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మరెవరో కాదు, బిగ్ బాస్ ఫేమ్ దివి.సినిమా విడుదలకు ముందు విడుదలైన టీజర్‌లో దివి ఒక కీలకమైన సీన్ లో కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో ఆమె అభిమానులు "ఈసారి దివికి మంచి బ్రేక్ దొరికింది" అని సంబరపడ్డారు. కానీ, థియేటర్లో సినిమా చూసిన ప్రేక్షకులకు మాత్రం పెద్ద షాక్ తగిలింది. టీజర్లో కనిపించినంత ప్రాధాన్యత సినిమాలో ఆమె పాత్రకు లేకపోవడమే ఇందుకు కారణం.
తాజాగా ఈ విషయంపై దివి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నన్ను ఈ సినిమా కోసం సంప్రదించినప్పుడు నా పాత్ర చాలా కీలకంగా ఉంటుందని చెప్పారు. టీజర్‌లో కూడా నా క్యారెక్టర్ హైలైట్ అవ్వడంతో, నేను సినిమాలో ఒక మేజర్ రోల్ ప్లే చేస్తున్నానని ఎంతో ఆశపడ్డాను. కానీ ఫైనల్ మూవీ చూశాక నేను షాక్‌కు గురయ్యాను. నా పాత్రకు జరిగిన అన్యాయం చూసి తీవ్ర నిరాశ చెందాను అని దివి ఆవేదన చెందింది. దివి చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సినిమా నిడివి ఇప్పటికే మూడు గంటల పైనే ఉంది.
బహుశా లెంగ్త్ ఎక్కువవ్వడం వల్ల దివి సీన్లను ఎడిటింగ్ టేబుల్ పై కట్ చేసి ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒక వర్ధమాన నటికి ఇలాంటి అనుభవం ఎదురవ్వడం బాధాకరం. టీజర్లో చూపించి హైప్ క్రియేట్ చేసి, సినిమాలో ప్రాధాన్యత ఇవ్వకపోవడం సరైనది కాదు" అని ఆమె అభిమానులు మండిపడుతున్నారు. దర్శకుడు సుకుమార్ సినిమాల్లో క్యారెక్టర్ల విషయంలో ఇలాంటి మార్పులు జరగడం కొత్తేమీ కాదు. గతంలో కూడా పలువురు నటీనటుల పాత్రలు ఎడిటింగ్‌లో తొలగించబడ్డాయి. అయితే, 'పుష్ప' వంటి భారీ ప్రాజెక్టులో అవకాశం వచ్చినందుకు సంతోషించాలా? లేక పాత్ర తగ్గిపోయినందుకు బాధపడాలా? అనే సందిగ్ధంలో దివి ఉన్నట్లు కనిపిస్తోంది.