తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు సరికొత్త డిజిటల్ విప్లవం నడుస్తోంది. ఒకప్పుడు కేవలం వెండితెరపైనే తమ అభిమాన తారలను చూసుకుని సంబరపడే ప్రేక్షకులు.. ఇప్పుడు అరచేతిలోని స్మార్ట్‌ఫోన్‌లోనే వారిని ఆస్వాదించే రోజులు వచ్చేశాయి. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, కంటెంట్ బేస్డ్ వెబ్ సిరీస్‌ల వైపు మన స్టార్ హీరోలు మొగ్గు చూపుతుండటం గమనార్హం. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటుతున్న వేళ.. ఓటీటీ వేదికగా కూడా మన హీరోలు గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఇది కేవలం ప్రయోగం మాత్రమే కాదు, మారుతున్న ఎంటర్టైన్మెంట్ బిజినెస్‌లో భాగమని స్పష్టమవుతోంది. తాజాగా టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే.. మాస్ మహారాజా రవితేజ డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఎప్పుడూ హై-వోల్టేజ్ ఎనర్జీతో థియేటర్లను దడదడలాడించే రవితేజ.. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఇది గానీ వర్కవుట్ అయితే ఒక మెయిన్ స్ట్రీమ్ మాస్ హీరో వెబ్ సిరీస్ చేయడం టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డు అవుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఒక భారీ యాక్షన్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. ఇక ఇప్పటికే ఓటీటీలో సత్తా చాటిన అక్కినేని నాగ చైతన్య.. ఈ స్పేస్‌లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటున్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన దూత వెబ్ సిరీస్‌తో చైతూ డిజిటల్ వరల్డ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సూపర్ నాచురల్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ విజయంతో రెట్టింపు ఉత్సాహంతో ఉన్న నాగ చైతన్య.. ఇప్పుడు దూత 2 చేస్తున్నారు. మొదటి సీజన్ ముగిసిన తీరు, రెండో సీజన్‌పై అంచనాలను భారీగా పెంచేసింది.
మరోవైపు వైవిధ్యమైన కథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అడివి శేష్ కూడా డిజిటల్ బాట పడుతున్నారు. థ్రిల్లర్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్‌ను సృష్టించుకున్న శేష్.. ఇప్పుడు ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌తో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతున్నారు. గూఢచారి, మేజర్, హిట్-2 వంటి సినిమాలతో నేషనల్ లెవెల్ గుర్తింపు తెచ్చుకున్న శేష్.. వెబ్ సిరీస్ ఫార్మాట్లోకి వస్తే కంటెంట్ పరంగా అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ కూడా ఒక స్పై థ్రిల్లర్ లేదా ఇన్వెస్టిగేటివ్ డ్రామా అయ్యే అవకాశం ఉందని సమాచారం. యువ హీరోలు కూడా ఈ రేసులో వెనక్కి తగ్గడం లేదు. కిరణ్ అబ్బవరం ఓటీటీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. డియర్ కామ్రేడ్ ఫేమ్ డైరెక్టర్ భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందనున్న ఒక అమెజాన్ వెబ్ సిరీస్‌లో కిరణ్ నటించనున్నారు. విశేషమేమిటంటే ఈ సిరీస్‌లో మరో విలక్షణ నటుడు, మసూధ ఫేమ్ తిరువీర్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇలా యువ దర్శకులు, టాలెంటెడ్ నటులు కలిసి ఓటీటీ కోసం సరికొత్త కథలను ఎంచుకోవడం టాలీవుడ్ స్టాండర్డ్స్‌ను పెంచుతోంది. మొత్తానికి థియేటర్లలోనే కాదు, డిజిటల్ స్క్రీన్లపై కూడా మన హీరోల హవా మొదలైందని చెప్పక తప్పదు.