క్రిస్టోఫర్ నోలన్ 5 కఠినమైన రూల్స్..!

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ పేరు వినగానే మనకు ఇన్సెప్షన్, ఇంటర్‌స్టెల్లార్, డంకిర్క్, టెనెట్, ఓపెన్‌హైమర్ వంటి అద్భుతమైన దృశ్యకావ్యాలు గుర్తొస్తాయి.

Post Published By: dialnews
Updated : 6 July 2026, 3:55 PM IST

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ పేరు వినగానే మనకు ఇన్సెప్షన్, ఇంటర్‌స్టెల్లార్, డంకిర్క్, టెనెట్, ఓపెన్‌హైమర్ వంటి అద్భుతమైన దృశ్యకావ్యాలు గుర్తొస్తాయి. ఆయన సినిమాల్లో ఎంతటి వైవిధ్యం ఉంటుందో, ఆయన వర్కింగ్ స్టైల్ కూడా అంతే డిఫరెంట్‌గా ఉంటుంది. సినిమా సెట్‌లోకి నోలన్ అడుగుపెడితే ఆయనొక డైరెక్టర్‌లా కాకుండా, ఒక స్కూల్ హెడ్‌మాస్టర్‌లా కనిపిస్తారని ఆయనతో పనిచేసిన నటీనటులు చెబుతుంటారు. కూల్‌గా కుర్చీలో కూర్చుని యాక్షన్, కట్ చెప్పడం నోలన్ స్టైల్ కాదు. అలాగే షాట్ గ్యాప్‌లో సెల్‌ఫోన్‌తో టైంపాస్ చేయడం ఆయనకు అస్సలు నచ్చదు. ఆయన దృష్టిలో సినిమా సెట్‌కు రావడం అంటే ఆఫీసుకు వచ్చినట్లే. అక్కడ ఆయన ఏం చెబితే అదే రూల్! నటీనటులంతా బుద్ధిగా దాన్ని ఫాలో అవ్వాల్సిందే.

నోలన్ సినిమా స్క్రిప్ట్ రాస్తున్నప్పటి నుంచే డిజిటల్ ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉంటారు. ఆయన రైటింగ్ రూమ్‌లో అసలు ఇంటర్నెట్ కనెక్షనే ఉండదు. ఎవరికీ ఈమెయిల్స్ చేయరు, ఆయన అసలు స్మార్ట్‌ఫోనే వాడరు! ఇక సినిమా సెట్‌లో కూడా నటీనటులు, టెక్నీషియన్లు ఎవరూ ఫోన్లు వాడటానికి వీల్లేదు. నోలన్‌తో ఏదైనా చెప్పాలనుకుంటే ఆయనకు టెక్స్ట్ మెసేజ్ చేయడం కాకుండా నేరుగా ఆయన దగ్గరకు వెళ్లి మాట్లాడాల్సిందే. ఫోన్లు మనుషుల ఏకాగ్రతను తీవ్రంగా దెబ్బతీస్తాయని, అవి అందుబాటులో లేకుంటేనే ప్రతి ఒక్కరూ మరింత బాగా పనిచేస్తారని నోలన్ నమ్ముతారు. నోలన్ ఏ సినిమాకైనా ఫస్ట్ వెర్షన్ స్క్రిప్ట్‌ను ఇంటర్నెట్ లేని కంప్యూటర్‌లోనే టైప్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని డెవలప్ చేసే ప్రక్రియ మొత్తం స్వీయ చేతిరాతతోనే కొనసాగిస్తారు.

స్క్రిప్ట్ సిద్ధమయ్యాక దాన్ని నటులకు ఈమెయిల్ చేయడం వంటి పనులు అస్సలు చేయరు. కేవలం వాటర్‌మార్క్స్ ఉన్న పేపర్లపై ప్రింట్ తీసుకుని, తాను ఎంపిక చేసుకోవాలనుకుంటున్న నటుల నివాసాలకు స్వయంగా వెళ్లి, ఆ స్క్రిప్ట్‌ను నేరుగా అందిస్తారు. వారు దాన్ని పూర్తిగా చదివేవరకు ఆయన బయటే వేచి ఉంటారు! దీనివల్ల తన ఐడియాలు ఆన్‌లైన్‌లో గానీ, ಆఫ్‌లైన్‌లో గానీ లీక్ కాకుండా జాగ్రత్తపడతారు. దీనితోపాటు తాను స్వయంగా వెళ్లి స్క్రిప్ట్‌ను అందించడం ద్వారా నటులకు ఒక గొప్ప సినిమా చేసే అవకాశం వచ్చిందన్న భావన కలిగి, వారు 'నో' చెప్పలేరన్నది నోలన్ ఆలోచన. సాధారణంగా హాలీవుడ్‌లో సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు దర్శకుడు, ఇతర యూనిట్ సభ్యులు కూర్చోవడానికి కెమెరాకు దూరంగా ఓ టెంట్ వేస్తారు. దాన్ని 'వీడియో విలేజ్' అని పిలుస్తారు. అందులో విలాసవంతమైన కుర్చీలు, షాట్ చూసుకోవడానికి మానిటర్లు ఏర్పాటు చేస్తారు.

ఆ హడావుడి మధ్యే దర్శకులు మానిటర్లలో షాట్ చూసి ఓకే చేస్తుంటారు. కానీ నోలన్ సినిమా సెట్లలో కుర్చీలు ఉండవట. ఆయన కెమెరా పక్కనే నిలబడి నటీనటుల హావభావాలను నిశితంగా గమనిస్తుంటారు. దీనివల్ల నటీనటులు సీన్లలోని గాఢతను ఆకళింపు చేసుకోవడానికి వీలవుతుందని, యూనిట్ మొత్తం పూర్తి ఏకాగ్రతతో పనిచేస్తారని ఆయన విశ్వసిస్తారు. ఈ విధానం వల్ల తాము మరింత ఉత్సాహం, నిబద్ధతతో పనిచేయగలిగినట్లు నటి అన్నె హాత్వే ఒక సందర్భంలో తెలిపారు. సినిమా బడ్జెట్‌ను నియంత్రించడానికి సెట్లో నోలన్ కఠిన నిబంధనలు అమలు చేస్తారు. ఒక్క క్షణం కూడా వృథా కాకుండా ప్రతి పనీ షెడ్యూల్ ప్రకారమే జరిగేలా చూస్తారు. నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఎప్పుడు పడితే అప్పుడు రిలాక్స్ అవ్వడానికి వీలుండదు. 'ఉదయం 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు మాత్రమే వాష్‌రూమ్ బ్రేక్ ఇస్తారు. ప్రతి ఒక్కరూ అప్పుడే వెళ్లిరావాలి' అని నోలన్‌తో పనిచేసిన రాబర్ట్ డౌనీ జూనియర్ ఓ సందర్భంలో గుర్తుచేసుకున్నారు.

షూటింగ్‌కు అనువైన పగటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికే నోలన్ ఈ నిబంధనలు అమలు చేస్తారు. ఈ విధానం వల్ల అనుకున్న సమయానికంటే ముందే షెడ్యూళ్లు పూర్తిచేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సినిమా సెట్స్‌ను నోలన్ ఓ కార్పొరేట్ బోర్డ్‌రూమ్‌లా భావిస్తారు. ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్తున్నట్లే కాలర్ ఉన్న షర్ట్, దానిపై డార్క్ సూట్ జాకెట్, పాలిష్ చేసిన షూస్ ధరించి పూర్తి ప్రొఫెషనల్‌గా లొకేషన్‌కు వస్తారు. ఎప్పుడూ క్యాజువల్ డ్రెస్సుల్లో కనిపించని నోలన్, ఈ వస్త్రధారణ వల్ల సెట్లకు కేవలం సరదాగా గడపడానికి కాకుండా ఓ బాధ్యత కోసం వచ్చామన్న భావన కలుగుతుందని, అందరిలో నిబద్ధతతో పనిచేయాలన్న సంకల్పం ఏర్పడుతుందని నమ్ముతారు. ఈ వివరాలు చూస్తే, క్రిస్టోఫర్ నోలన్ ఎందుకు అంతటి అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారో మరియు ఆయనను ప్రపంచం ఎందుకు అంతగా గౌరవిస్తుందో అర్థమవుతుంది. డిసిప్లిన్ మరియు ప్యాషన్ కలగలిస్తేనే నోలన్ స్థాయి సినిమాలు సాధ్యమవుతాయి మరి.

Published : 
  • 6 July 2026, 3:55 PM IST