దళపతి బాటలోనే ధనుష్.!

తమిళనాడు రాజకీయాలకు, రంగుల ప్రపంచమైన సినీ రంగానికి మధ్య ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, విజయకాంత్ నుండి నిన్నకాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి 'తమిళగ వెట్రి కళగం' పార్టీ పెట్టిన దళపతి విజయ్

Post Published By: dialnews
Updated : 12 August 2026, 4:20 PM IST

తమిళనాడు రాజకీయాలకు, రంగుల ప్రపంచమైన సినీ రంగానికి మధ్య ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, విజయకాంత్ నుండి నిన్నకాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి 'తమిళగ వెట్రి కళగం' పార్టీ పెట్టిన దళపతి విజయ్ వరకు.. కోలీవుడ్ స్టార్ హీరోలు రాజకీయాల్లో తమ ముద్ర వేయడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు అదే వరుసలో మరో గ్లోబల్ స్టార్, బహుముఖ ప్రజ్ఞాశాలి ధనుష్ పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది.ధనుష్ త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? తమిళనాడు రాజకీయ యవనికపై కొత్త అధ్యాయం రాయబోతున్నారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు కోలీవుడ్ వర్గాల నుండి వినపడుతున్నాయి.

ఇటీవల ఆయన తన అభిమానులకు ఇచ్చిన ఒక పిలుపు, దానికి కొనసాగింపుగా ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ తీసుకున్న ఒక కీలక నిర్ణయం ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. గత కొన్ని రోజులుగా ధనుష్ రాజకీయ ప్రవేశంపై సామాజిక మాధ్యమాల్లో అనేక ప్రచారాలు సాగుతున్నాయి. అయితే, ఇటీవల ధనుష్ స్వయంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని తన అభిమానులను కోరడం ఈ ప్రచారానికి ప్రధాన కారణమైంది. అభిమానులు కేవలం సినిమాలు చూసి విజయోత్సవాలు చేసుకోవడమే కాకుండా, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల్లో ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు.

ధనుష్ ఆదేశాల మేరకు ఆయన అభిమాన సంఘాలు వెంటనే రంగంలోకి దిగాయి. 'ఆల్ ఇండియా ధనుష్ ఫ్యాన్స్ అసోసియేషన్' కోయంబత్తూరు జిల్లా పరిధిలోని ఐదు కీలక నియోజకవర్గాల్లో కొత్త సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ధనుష్ ఫ్యాన్ క్లబ్ నాయకులు ఈ సంక్షేమ సంఘాల ద్వారా సభ్యత్వ నమోదు ప్రక్రియను భారీ ఎత్తున వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని 'ధనుష్ సంక్షేమ సంఘం' అఖిల భారత కార్యదర్శి బి. రాజా సామాజిక మాధ్యమాల వేదికగా అధికారికంగా పోస్ట్ చేస్తూ ధృవీకరించారు.
ఈ పరిణామం ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడు పొలిటికల్ హిస్టరీ గమనిస్తే.. ప్రతి నటుడు రాజకీయాల్లోకి వచ్చే ముందు తమ అభిమాన సంఘాలను నియోజకవర్గాల వారీగా బలోపేతం చేసుకోవడం, కేడర్‌ను నిర్మించుకోవడం పరిపాటిగా వస్తోంది. ఇప్పుడు ధనుష్ కూడా సరిగ్గా అదే వ్యూహాన్ని అమలు చేస్తుండటంతో, ఆయన పొలిటికల్ ఎంట్రీ ఖాయమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇటీవల దళపతి విజయ్ తన పొలిటికల్ ఎంట్రీ కంటే ముందు 'విజయ్ మక్కల్ ఇయక్కమ్' పేరుతో అభిమాన సంఘాలను బూత్ స్థాయి వరకు విస్తరించారు. ఆ తర్వాతే ఆయన అధికారికంగా పార్టీ ప్రకటించారు. ఇప్పుడు ధనుష్ కూడా అదే తరహాలో నియోజకవర్గాల వారీగా సంక్షేమ సంఘాల విస్తరణకు ఆదేశాలు ఇవ్వడంతో, తమిళనాడు పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. నటుడిగా, దర్శకుడిగా, నిర్మతగా, అలాగే హాలీవుడ్ స్థాయి వరకు వెళ్లి తన సత్తా చాటిన ధనుష్.. ఇప్పుడు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారా లేదా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా, కోయంబత్తూరు నియోజకవర్గాల నుండి ప్రారంభమైన ఈ సంక్షేమ సంఘాల విస్తరణ ప్రక్రియ రాబోయే రోజుల్లో తమిళనాడు వ్యాప్తంగా విస్తరిస్తే, కోలీవుడ్ నుండి మరొక బలమైన పొలిటికల్ లీడర్ పుట్టుకురావడం ఖాయంగా కనిపిస్తోంది.

Published : 
  • 12 August 2026, 4:20 PM IST