గత ఏడాది సంచలన విజయం సాధించిన 'ధురంధర్' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'ధురంధర్ 2: ది రివెంజ్' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ సినిమాకు భారీ స్పందన లభిస్తోంది. ఇప్పటికే నగరంలోని ప్రధాన మల్టీప్లెక్స్‌లలో దాదాపు 75 శాతం టికెట్లు అమ్ముడయ్యాయి. కేవలం హిందీ వెర్షన్ మాత్రమే కాకుండా, తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
ఉగాది మరియు ఈద్ పండుగ సెలవుల నేపథ్యంలో ఈ వీకెండ్లో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మార్చి 19న అధికారిక విడుదల కంటే ముందే, మార్చి 18 సాయంత్రం 5 గంటల నుండి పెయిడ్ ప్రివ్యూ షోలు ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ ప్రివ్యూ షోల ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 32 కోట్ల వరకు వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. తెలుగు రాష్ట్రాల్లో కేవలం ప్రివ్యూల ద్వారానే కోటికి పైగా వసూళ్లు రావడం విశేషం. అయితే, ఇదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా విడుదలవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొంది.
మాస్ సెంటర్లలో 'ఉస్తాద్' హవా కొనసాగుతుండగా, హైదరాబాద్ వంటి నగరాల్లో మల్టీప్లెక్స్ ఆడియన్స్ 'ధురంధర్ 2' వైపు మొగ్గు చూపుతున్నారు. జియో స్టూడియోస్ తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచడం ఈ సినిమాకు అదనపు ప్లస్ పాయింట్ కానుంది. మరి రణవీర్ సింగ్ తన 'హమ్జా' పాత్రతో మరోసారి బాక్సాఫీస్ షేక్ చేస్తాడా? లేక పవన్ కళ్యాణ్ తన మ్యాజిక్‌తో ధురంధర్‌ను అడ్డుకుంటాడా? తెలియాలంటే మరో కొన్ని రోజులు ఆగాల్సిందే.