భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే విజయాలను సాధించిన ఐదు ఐసీసీ టైటిల్ గెలిచిన జట్లను బీసీసీఐ ఘనంగా సన్మానించింది. వార్షిక నమన్ అవార్డ్స్ వేడుకలో ఈ జట్లను గౌరవిస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐదు జట్ల సభ్యులను వేదికపైకి ఆహ్వానించి ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి బీసీసీఐ ప్రతినిథులతో పాటు ఐసీసీ ఛైర్మన్ జై షా కూడా హాజరయ్యారు.2024–25 కాలంలో భారత జట్లు సాధించిన ఐసీసీ విజయాలను గుర్తిస్తూ ఈ ప్రత్యేక సన్మానం నిర్వహించారు. కేవలం ఏడాది కాలంలోనే ఐదు ఐసీసీ టైటిళ్లు సాధించడం భారత క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం.
మొదటగా భారత జూనియర్ జట్ల విజయాలను గుర్తించారు. 2026లో జరిగిన ఐసీసీ ఉమెన్స్ అండర్ 19 వరల్డ్‌కప్‌లో విజేతగా నిలిచిన జట్టును సత్కరించారు. అదే ఏడాది అండర్ 19 వరల్డ్‌కప్ గెలిచిన భారత పురుషుల జట్టును కూడా గౌరవించారు.తర్వాత 2025లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో విజయం సాధించిన భారత జట్టుకు అభినందనలు తెలిపారు. అలాగే 2025లో భారత్‌లో జరిగిన ఐసీసీ ఉమెన్స్ వరల్డ్‌కప్ 2025లో చరిత్రాత్మక విజయం సాధించిన భారత మహిళల జట్టును కూడా ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు.ఇటీవల జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026లో విజేతగా నిలిచిన భారత జట్టు కూడా ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
గౌతమ్ గంభీర్ కోచ్‌గా ఉన్న భారత జట్టు ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. ఈ విజయంతో భారత్ టీ20 వరల్డ్ కప్‌ను మూడు సార్లు గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. అంతేకాకుండా వరుసగా టైటిల్‌ను కాపాడుకున్న తొలి జట్టుగా కూడా చరిత్ర సృష్టించింది. స్వదేశంలో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా భారత్ నిలిచింది.ఈ కార్యక్రమంలో భారత మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను కూడా ప్రత్యేకంగా సత్కరించారు. ఆయనకు కల్నల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందజేశారు. 1996లో తన అంతర్జాతీయ కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి భారత క్రికెట్ అభివృద్ధిని చూసిన ద్రావిడ్, గత మూడు దశాబ్దాల్లో వచ్చిన మార్పులను గుర్తు చేసుకున్నారు.