దుల్కర్ సల్మాన్ దర్శకుడితో మోహన్ లాల్.!

మలయాళ చిత్రసీమకే కాకుండా భారతీయ సినిమా రంగానికి మకుటం లేని మహారాజు వంటివారు మోహన్‌లాల్. నటనలో ఆయన చూపించే వైవిధ్యం, వేసే పాత్రల్లో ఉండే జీవం గురించి ఎంత చెప్పినా తక్కువే. సరిహద్దులతో సంబంధం

Post Published By: dialnews
Updated : 22 August 2026, 7:30 PM IST

మలయాళ చిత్రసీమకే కాకుండా భారతీయ సినిమా రంగానికి మకుటం లేని మహారాజు వంటివారు మోహన్‌లాల్. నటనలో ఆయన చూపించే వైవిధ్యం, వేసే పాత్రల్లో ఉండే జీవం గురించి ఎంత చెప్పినా తక్కువే. సరిహద్దులతో సంబంధం లేకుండా ఇతర భాషల్లోనూ ప్రత్యేక పాత్రలతో మెరుస్తూనే, హీరోగా ఊపిరి సలపని వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఆయన రూటు ఎప్పుడూ డిఫరెంట్‌గా ఉంటుంది. పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లతో పాటు, కొత్త ఆలోచనలతో వచ్చే యువ దర్శకులకు ప్రోత్సాహం అందించడంలో మోహన్‌లాల్ ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా ఆయన మరొక ప్రతిభావంతుడైన యంగ్ డైరెక్టర్‌కు అవకాశం ఇచ్చారు. ఈ సారి మోహన్‌లాల్ హ్యాండ్ షేక్ ఇచ్చిన ఆ కుర్ర దర్శకుడు మరెవరో కాదు... అనూప్ సత్యన్! సాధారణ సినీ ప్రేక్షకులకు ఈ పేరు వినగానే వెంటనే గుర్తుకొచ్చే సినిమా 'వరనే అవశ్యముండ్'.

2020లో దుల్కర్ సల్మాన్, కళ్యాణి ప్రియదర్శన్, శోభన, సురేష్ గోపి ముఖ్య పాత్రల్లో వచ్చిన ఈ ఫీల్ గుడ్ డ్రామా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కుటుంబ సంబంధాలు, మనసుకు హత్తుకునే సంభాషణలతో తెరకెక్కిన ఆ సినిమాతో అనూప్ సత్యన్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటి సినిమాతోనే తన ముద్ర వేసిన ఈ యంగ్ డైరెక్టర్‌తో పనిచేసేందుకు మోహన్‌లాల్ ఇప్పుడు సిద్ధమయ్యారు. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన వార్తను స్వయంగా మోహన్‌లాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దర్శకుడు అనూప్ సత్యన్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దీంతో మలయాళ చిత్రసీమతో పాటు సౌత్ ఇండియా వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.

ఈ సినిమా చిత్రీకరణ నవంబరు నెల నుంచి శరవేగంగా ప్రారంభం కానుంది. మోహన్‌లాల్ సొంత హోమ్ బ్యానర్ లాంటి 'ఆశీర్వాద్ సినిమాస్' సహకారంతో బిను జార్జ్ అలెగ్జాండర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణ విలువల్లో ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.అనూప్ సత్యన్ సినిమాల్లో ఉండే ఒక ప్రత్యేకత ఏంటంటే... క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్, బంధాలు, అనుబంధాల కలబోత. మరి అలాంటి దర్శకుడు మోహన్‌లాల్ వంటి నటన రాక్షసుడిని తెరపై ఎలా చూపిస్తాడనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూనే, వైవిధ్యమైన పాత్రలతో అలరించే మోహన్‌లాల్ – అనూప్ సత్యన్ కాంబో వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Published : 
  • 22 August 2026, 7:30 PM IST