సాధారణంగా గుణశేఖర్ సినిమా అంటే భారీతనం, కనువిందు చేసే సెట్స్ గుర్తుకొస్తాయి. కానీ, ఆయన తన పంథా మార్చుకుని పూర్తి వాస్తవికతకు దగ్గరగా, ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక సీరియస్ సమస్యను ఎంచుకున్నారు. అదే 'యుఫోరియా'. మరి ఈ ప్రయోగంతో గుణశేఖర్ ఆడియన్స్‌ను కన్విన్స్ చేయగలిగారా? ఈ ఎమోషనల్ జర్నీ ఎలా సాగింది? పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ విషయానికి వస్తే.. చైత్ర (సారా అర్జున్) ఒక బ్రైట్ స్టూడెంట్. ఐఏఎస్ కావాలన్నది ఆమె డ్రీమ్. ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అయినప్పటికీ పద్ధతిగా పెరుగుతుంది. అయితే స్నేహితుల ఒత్తిడితో ఒకసారి పబ్‌లో అడుగుపెడుతుంది. అక్కడ పరిచయమైన వికాస్ (విఘ్నేష్) చైత్రను చూడగానే లైన్లో పెట్టాలని డిసైడ్ అవుతాడు. మాయమాటలతో నమ్మించి, ఇంటి దగ్గర దించుతానంటూ కారులో ఎక్కించుకుంటాడు. ఆ తర్వాత డ్రగ్స్ ఇచ్చి తన గ్యాంగ్‌తో కలిసి ఆమె జీవితాన్ని నాశనం చేస్తాడు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. సిటీ పోలీస్ బాస్ జయదేవ్ (గౌతమ్ మీనన్) ఈ కేసును టేకాప్ చేస్తారు. నిందితుల తల్లిదండ్రుల నుండి వచ్చే పొలిటికల్ ప్రెజర్‌ను ఆయన ఎలా తట్టుకున్నారు? తన కొడుకు చేసిన తప్పుకు తల్లి వింధ్య (భూమిక) ఎలాంటి నిర్ణయం తీసుకుంది? చివరికి న్యాయం గెలిచిందా లేదా అన్నదే ఈ చిత్ర కథ.
స్క్రీన్ ప్లే విషయానికి వస్తే.. నేటి యువత డ్రగ్స్ మోజులో పడి తమ బంగారు భవిష్యత్తును ఎలా నాశనం చేసుకుంటున్నారో, దాని వల్ల వాళ్ల కుటుంబాలు ఎంతటి నరకాన్ని అనుభవిస్తున్నాయో చెప్పడమే దర్శకుడి ప్రధాన ఉద్దేశం. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఉదంతం లాంటి కొన్ని యదార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ కథను రాసుకున్నాడని సినిమా చూస్తే అర్థమవుతుంది. దర్శకుడు ఎలాంటి సస్పెన్స్ లేకుండా, జరగబోయే విషయాన్ని ముందే రివీల్ చేసి, డ్రామాపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఫస్టాఫ్ అంతా ఇన్వెస్టిగేషన్ డ్రామాలా సాగుతుంది. పోక్సో చట్టం గురించి, సాక్ష్యాధారాల సేకరణ గురించి డీటెయిల్డ్‌గా చూపించారు. అయితే ఇది సినిమాటిక్ అనుభూతిని ఇవ్వడం కంటే, ఒక అవగాహన కల్పించే డాక్యుమెంటరీని చూస్తున్న భావన కలిగిస్తుంది. ఇక సెకండాఫ్‌లో జైలు సన్నివేశాలు, భూమిక పాత్రలోని సంఘర్షణ హైలైట్‌గా నిలుస్తాయి. కొడుకును మార్చాలనుకునే తల్లిగా భూమిక ట్రాక్ బాగున్నప్పటికీ, అది స్క్రీన్‌పై అంత ఎఫెక్టివ్‌గా పండలేదు. క్లైమాక్స్ మాత్రం ఆలోచింపజేస్తుంది. వాణిజ్య హంగులు లేకపోవడం, కథనం నెమ్మదించడం ఈ సినిమాకు ప్రధాన బలహీనతలు.
నటీనటుల విషయానికి వస్తే.. బాధితురాలి పాత్రలో సారా అర్జున్ జీవించేసింది. ఆమె కళ్లలో కనిపించే భయం, బాధ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఇక ఈ సినిమాకు పిల్లర్ అంటే భూమికే. ఒకవైపు కొడుకు మీద ప్రేమ, మరోవైపు వాడు చేసిన తప్పును భరించలేని ఆవేదన.. ఈ రెండింటి మధ్య నలిగిపోయే తల్లి పాత్రలో ఆమె నటన పీక్స్ అని చెప్పొచ్చు. గౌతమ్ మీనన్ పోలీస్ అధికారిగా తనదైన స్టైల్లో ఆకట్టుకున్నారు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో విఘ్నేష్ నటన సహజంగా ఉంది.
టెక్నికల్ టీం విషయానికి వస్తే.. కాలభైరవ సంగీతం సినిమా మూడ్‌ను ఎలివేట్ చేసింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సీన్లలోని ఎమోషన్‌ను బాగా క్యారీ చేసింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. గుణశేఖర్ ఒక మంచి పాయింట్‌ను ఎంచుకున్నారు కానీ, దాన్ని గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో చెప్పడంలో కొంత తడబడ్డారు. ఎమోషనల్ కనెక్ట్ ఇంకాస్త బలంగా ఉంటే సినిమా రేంజ్ వేరేలా ఉండేది.ఓవరాల్‌గా యుఫోరియా.. యువతకు, తల్లిదండ్రులకు ఒక గట్టి వార్నింగ్ బెల్. కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించకుండా, ఒక సామాజిక సమస్యపై తీసిన సీరియస్ డ్రామాను చూడాలనుకునే వారికి ఈ సినిమా నచ్చుతుంది. మంచి ప్రయత్నమే.. కానీ స్లో పాయిజన్..!