ప్రముఖ యాంకర్ కన్నుమూత.. మీడియం రంగంలో విషాదం.. మూగిబోయిన దూర‌ద‌ర్శ‌న్ గొంతు..!

ప్రముఖ దూరదర్శన్ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి ఇకలేరు. ఆమె వయసు 71 ఏళ్లు. దశాబ్దాల పాటు తన గంభీరమైన స్వరంతో వార్తలను ప్రజలకు చేరవేసిన ఆమె మృతి పట్ల దూరదర్శన్ యాజమాన్యం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

Post Published By: dialnews
Updated : 13 February 2026, 5:20 PM IST

ప్రముఖ దూరదర్శన్ వార్తా వ్యాఖ్యాత సరళా మహేశ్వరి ఇకలేరు. ఆమె వయసు 71 ఏళ్లు. దశాబ్దాల పాటు తన గంభీరమైన స్వరంతో వార్తలను ప్రజలకు చేరవేసిన ఆమె మృతి పట్ల దూరదర్శన్ యాజమాన్యం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆమె మరణం భారతీయ వార్తా ప్రసార రంగానికి తీరని లోటని పేర్కొంటూ, దూరదర్శన్ కుటుంబం తరఫున ట్విట్టర్ వేదికగా ఘన నివాళులర్పించింది. సరళా మహేశ్వరి కేవలం ఒక న్యూస్ రీడర్ మాత్రమే కాదు.. ఆమె నాటి వార్తలకు సింబల్. స్పష్టమైన హిందీ ఉచ్చారణ, హుందా అయిన వ్యవహారశైలి ఆమె సొంతం. ఆడంబరాలు లేని సాధారణ చీరకట్టు, నిలకడైన స్వరంతో వార్తలు చదివే విధానం కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకునేది. వార్తలు చదివేటప్పుడు ఆమె ప్రదర్శించే స్థితప్రజ్ఞత, సహజత్వం ఆమెను మిగతా వాళ్ళ కంటే ప్రత్యేకంగా నిలిపాయి.

1976లో అనౌన్సర్‌గా దూరదర్శన్‌లో ప్రస్థానం మొదలుపెట్టిన సరళ.. 1982 నాటికి పూర్తిస్థాయి న్యూస్ రీడర్‌గా ఎదిగారు. ఆమె కెరీర్‌లో ఎన్నో చారిత్రక మరియు క్లిష్టమైన ఘట్టాలను ప్రజల ముందుంచారు. 1982 ఆసియా క్రీడల నుండి మొదలుకొని, పంజాబ్ మిలిటెన్సీ ఉద్రిక్తతలు, 1991లో రాజీవ్ గాంధీ హత్యోదంతం వంటి కీలక వార్తలను ఆమె ఎంతో సమయస్ఫూర్తితో చదివి వినిపించారు. ఉద్యోగం చేస్తూనే పీహెచ్‌డీ పూర్తి చేసిన విద్యావంతురాలు ఆమె. 1984 వరకు దూరదర్శన్‌లో సేవలందించిన అనంతరం.. ఆమె బ్రిటన్ వెళ్లారు. అక్కడ ప్రతిష్టాత్మక బీబీసీలో 1986 వరకు వార్తా వ్యాఖ్యాతగా పనిచేశారు. ఆ అంతర్జాతీయ అనుభవంతో 1988లో తిరిగి స్వదేశానికి వచ్చి, మళ్ళీ దూరదర్శన్‌లో చేరి తన ప్రయాణాన్ని కొనసాగించారు.

ఆ రోజుల్లో సాంకేతికత పరిమితంగా ఉన్నప్పటికీ.. లైవ్ న్యూస్ చదవడం ఎంతో సవాలుతో కూడుకున్న పని. అయినప్పటికీ, సరళా మహేశ్వరి దాన్ని ఎంతో సమర్థవంతంగా నిర్వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు వార్తా ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ఆమె 2005లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. భారతీయ బ్రాడ్‌కాస్టింగ్ చరిత్రలో ఆమెకంటూ ఒక సుస్థిర స్థానం ఎప్పటికీ ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఆమె మృతికి మీడియా రంగం నివాళులు అర్పించింది.

Published : 
  • 13 February 2026, 5:20 PM IST