'జాతిరత్నాలు'తో కామెడీకి కొత్త డెఫినేషన్ ఇచ్చిన అనుదీప్, ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అయిన విశ్వక్ సేన్.. వీరిద్దరూ కలిస్తే స్క్రీన్ మీద రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందోనని ఆడియన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఉన్నారు. పైగా సితార ఎంటర్‌టైన్మెంట్స్ లాంటి పెద్ద బ్యానర్ తోడవడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. మరి ఈ క్రేజీ కాంబో బాక్సాఫీస్ దగ్గర నవ్వుల వర్షం కురిపించిందా? అనుదీప్ మార్క్ కామెడీ విశ్వక్‌కి సెట్ అయ్యిందా? పూర్తి రివ్యూలో చూద్దాం.
కథ విషయానికి వస్తే.. కోమల్ (విశ్వక్ సేన్) సినిమానే ప్రపంచంగా బతికే ఒక డైరెక్టర్. తన డెబ్యూ సినిమా కోసం అనుకున్న బడ్జెట్ కంటే భారీగా ఖర్చు పెట్టేయడంతో, ఆ చిత్ర నిర్మాత సుదర్శన్ (నరేష్) గుండెపోటుతో ఆసుపత్రిలో చేరతాడు. దీంతో ఆయన కుమార్తె చిత్ర (కయాదు లోహర్) సీరియస్ అయ్యి షూటింగ్ ఆపేస్తుంది. కోమల్‌ని ప్రాజెక్ట్ నుంచి గెంటేస్తుంది. కానీ తన సినిమాను ఎలాగైనా పూర్తి చేయాలని కోమల్ పట్టుబట్టడంతో.. చిత్ర ఒక విచిత్రమైన షరతు పెడుతుంది. మిగిలిన సినిమాను కేవలం కోటి రూపాయల్లోనే పూర్తి చేయాలన్నది ఆ కండిషన్. మరి ఇంత తక్కువ బడ్జెట్‌లో కోమల్ ఆ సినిమాను ఎలా ఫినిష్ చేశాడు? ఈ ప్రాసెస్‌లో నిర్మాత కూతురితో లవ్ ట్రాక్ ఎలా మొదలైంది? షూటింగ్ లో కోమల్ ఎదుర్కొన్న వింత సమస్యలేంటి? అన్నదే తెరపై చూడాల్సిన కథ.
స్క్రీన్ ప్లే విషయానికి వస్తే.. అనుదీప్ సినిమాల్లో లాజిక్ వెతకడం అంటే చీకట్లో నల్లిల్లు వెతకడమే. ఈ సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది. కథలో ఇంటెన్సిటీ కంటే.. సిల్లీనెస్‌కే పెద్దపీట వేశారు. ఒక చిన్న పాయింట్ చుట్టూ తనకు నచ్చిన స్టైల్‌లో ఫన్ జనరేట్ చేసుకుంటూ వెళ్ళారు డైరెక్టర్. కేవలం మెయిన్ లీడ్స్ మాత్రమే కాకుండా, ఫ్రేమ్‌లో కనిపించే చిన్న పాత్రలు కూడా పంచులు వేస్తూ ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేస్తాయి. హీరో క్యారెక్టరైజేషన్ చాలా యూనిక్‌గా, కాస్త తేడాగా ఉంటుంది. సొంత అమ్మతో మాట్లాడటాన్ని కూడా 'గలీజ్'గా ఫీలయ్యే హీరో.. హీరోయిన్ ప్రేమలో పడ్డాక ఎమోషన్స్ విలువ తెలుసుకోవడం అనే ఆర్క్ బాగుంది. లవ్ స్టోరీ ఉన్నప్పటికీ.. అది డైరెక్ట్ గా ఎక్స్ ప్రెస్ కాకుండా ఇంటర్నల్ గా నడవడం ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఇక దిల్ రాజు, నాగవంశీ, హరీష్ శంకర్ వంటి గెస్ట్ అప్పియరెన్స్ లు థియేటర్లో సర్ ప్రైజ్ చేస్తాయి. అయితే స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం కంటిన్యుటీ పూర్తిగా మిస్ అయ్యింది. ఒక సీన్‌కి మరో సీన్‌కి సంబంధం లేకుండా కేవలం సింగిల్ లైనర్స్, కామెడీ స్కిట్స్ మీద సినిమాను లాగించేశారు. ఫస్ట్ సీన్ నుంచే లాజిక్ పక్కన పెట్టి చూస్తేనే ఈ హ్యూమర్ కనెక్ట్ అవుతుంది. లేదంటే కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు. ముఖ్యంగా జాతి రత్నాలు మ్యాజిక్ ఏ కోశానా ఇందులో కనిపించదు.
నటీనటుల విషయానికి వస్తే.. విశ్వక్ సేన్ తన ఎనర్జీతో సినిమాను భుజాన వేసుకున్నాడు. కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీలో తన మార్క్ చూపించాడు. హీరోయిన్ కయాదు లోహర్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. అందంతో పాటు నటనలోనూ ఆకట్టుకుంది. సీనియర్ నటుడు నరేష్ తన అనుభవంతో ఈజీగా నవ్వించేశాడు. ఇక విలన్ గా మిర్చి సంపత్ సీరియస్ గా కనిపిస్తూనే కామెడీ పండించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.టెక్నికల్ టీం విషయానికి వస్తే.. భీమ్స్ సంగీతం జస్ట్ ఓకే అనిపిస్తుంది. పాటలు పర్లేదు కానీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకాస్త ఇంపాక్ట్ ఇచ్చేలా ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. సితార వారి నిర్మాణ విలువలు రిచ్‌గానే ఉన్నాయి. స్టోరీ లైన్ చాలా పల్చగా ఉండటం, లాజిక్ లేని సన్నివేశాల వల్ల అక్కడక్కడా సినిమా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. డ్రామా పండాల్సిన చోట కూడా కామెడీనే డామినేట్ చేయడం వల్ల ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయ్యింది.ఓవరాల్‌గా ‘ఫంకీ’.. ఫన్నీ లేదు.. డమ్మీ అయిపోయిన ఫంకీ..