సినిమా ఇండస్ట్రీలో ఆర్థిక నేరాలకు కొదవే ఉండదు. చాలాసార్లు నిర్మాతలు అందులో ఇరుక్కుని ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కొచ్చాడయాన్ చిత్ర నిర్మాతకు మద్రాసు హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. సదరు నిర్మాత 4 వారాల్లోగా రూ. 2.5 కోట్లు చెల్లించాలని.. ఒకవేళ చెల్లించడంలో విఫలమైతే ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించక తప్పదని స్పష్టం చేసింది. ఈ తీర్పు ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు విషయం ఏమిటంటే.. 2014లో రజనీకాంత్, దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ భారీ మోషన్ క్యాప్చర్ సినిమా విడుదలకు ముందు కొన్ని ఆర్థికపరమైన లావాదేవీలు జరిగాయి.
సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అండ్ ప్రమోషన్ ఖర్చుల కోసం మీడియా సంస్థ యాడ్ బ్యూరో నుండి నిర్మాత జె.మురళీ మనోహర్ సుమారు రూ. 10 కోట్లు అప్పుగా తీసుకున్నారు. దీనికి పూచీకత్తుగా కొన్ని చెక్కులను అందజేశారు.సినిమా విడుదలైన తర్వాత ఒప్పందం ప్రకారం డబ్బు తిరిగి చెల్లించడంలో నిర్మాత విఫలమయ్యారు. యాడ్ బ్యూరో సంస్థ ఆ చెక్కులను బ్యాంకులో వేయగా అవి బౌన్స్ అయ్యాయి. దీంతో తమకు రావలసిన బాకీ వసూలు కోసం యాడ్ బ్యూరో సంస్థ న్యాయ పోరాటానికి దిగింది. చెక్ బౌన్స్ చట్టం కింద నిర్మాత మురళీ మనోహర్‌పై కేసు నమోదు చేసింది. ఈ కేసును విచారించిన కింది కోర్టు, గతంలోనే నిర్మాతను దోషిగా నిర్ధారిస్తూ జైలు శిక్ష విధించింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ నిర్మాత మురళీ మనోహర్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ వేలుమురుగన్.. కింద కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించారు. అయితే నిర్మాత అభ్యర్థన మేరకు డబ్బు సర్దుబాటు చేయడానికి కొంత వెసులుబాటు కల్పించారు.
రూ. 2.5 కోట్లను నాలుగు వారాల్లోగా యాడ్ బ్యూరోకు చెల్లించాలని.. లేనిపక్షంలో మెజిస్ట్రేట్ కోర్టు విధించిన జైలు శిక్ష అమలు అవుతుందని తేల్చిచెప్పారు. రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ తెరకెక్కించిన కొచ్చాడయాన్ భారతదేశంలోనే తొలి మోషన్ క్యాప్చర్ చిత్రంగా రికార్డు సృష్టించినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. తెలుగులో ఈ సినిమా విక్రమ సింహ పేరుతో వచ్చి ఇక్కడ కూడా డిజాస్టర్ అయింది. సినిమా విడుదలై దశాబ్దం దాటినా, దానికి సంబంధించిన ఆర్థిక వివాదాలు, న్యాయపరమైన చిక్కులు మాత్రం నిర్మాతను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. తాజా హైకోర్టు ఆదేశాలతో నిర్మాత మురళీ మనోహర్‌కు కష్టాలు తప్పేలా లేవు.