గ్రామీ అవార్డుల్లో మెరిసిన భారతీయం.. ఇంటర్నేషనల్ వేదికపై మన సంప్రదాయం..!

సంగీత ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల వేడుకలు ఈసారి అట్టహాసంగా జరిగాయి. సంగీత దిగ్గజాలు, కొత్త తారలతో కళకళలాడిన ఈ వేడుకలో అవార్డుల సందడి ఒక ఎత్తయితే.

Post Published By: dialnews
Updated : 3 February 2026, 12:08 PM IST

సంగీత ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల వేడుకలు ఈసారి అట్టహాసంగా జరిగాయి. సంగీత దిగ్గజాలు, కొత్త తారలతో కళకళలాడిన ఈ వేడుకలో అవార్డుల సందడి ఒక ఎత్తయితే.. అక్కడ కనిపించిన ఇండియన్ టచ్ మరో ఎత్తు. అంతర్జాతీయ వేదికపై భారతీయ సంస్కృతి, ఫ్యాషన్ మరోసారి తనదైన ముద్ర వేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఈసారి రెడ్ కార్పెట్ మీద మన సంప్రదాయ అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో అమెరికన్ సింగర్ కమ్ సాంగ్ రైటర్ కెల్సియా బాలేరిని అందరి చూపును తనవైపు తిప్పుకుంది. ఆమె ప్రముఖ భారతీయ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ రూపొందించిన అద్భుతమైన చెవి రింగులు, ఉంగరాన్ని ధరించి మెరిసిపోయింది. ఫారెన్ క్యాస్ట్యూమ్స్‌కు మన సంప్రదాయ ఆభరణాలను జోడించి.. సంప్రదాయం ఆధునికతల అద్భుతమైన కాంబినేషన్‌తో ఆమె కనిపించిన తీరు ఫ్యాషన్ అక్కడున్న వాళ్లనే కాదు అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది.

మరోవైపు భారతీయ మూలాలున్న ప్రముఖ గాయని రాజా కుమారి గ్రామీ వేదికపై భారతీయ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పింది. జవాన్ టైటిల్ సాంగ్‌తో ఈమె బాగా పాపులర్ అయింది. ఆ మధ్య చిరంజీవి ఇంట్లో జరిగిన పార్టీలో కూడా రాజా కుమారి పాడింది. ఆమె కూడా సబ్యసాచి డిజైన్ చేసిన సంప్రదాయ చీరకట్టులో దర్శనమిచ్చింది. అంతర్జాతీయ వేదికపై భారతీయ చేనేత, డిజైన్ గొప్పతనాన్ని ఆమె తన ఆహార్యం ద్వారా సగర్వంగా ప్రదర్శించింది. ఆమె లుక్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ ప్రశంసలు అందుకుంటోంది.

ఇక భారతీయ, శ్రీలంక మూలాలు కలిగిన యువ సింగర్ లారా రాజ్ తనదైన శైలిలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె పాశ్చాత్య వేదికపై ఓం లాకెట్‌తో పాటు నుదుటిన పాపిడి బిళ్ల ధరించి సంప్రదాయానికి పెద్దపీట వేసింది. ఆధునిక ప్రపంచంలో కూడా తన మూలాలను మర్చిపోకుండా ఆమె ప్రదర్శించిన ఈ తీరు, అక్కడి వారికి మన సంస్కృతిపై ఉన్న మక్కువను తెలియజేసింది.మొత్తంగా చూస్తే ఈసారి గ్రామీ వేడుకలు కేవలం సంగీతానికి మాత్రమే కాదు, భారతీయ ఫ్యాషన్ ప్లస్ సంప్రదాయానికి కూడా వేదికగా మారాయి. మన డిజైనర్లు రూపొందించిన ఆభరణాలు, వస్త్రధారణలు అంతర్జాతీయ సెలబ్రిటీలను ఆకర్షించడం.. మన సంస్కృతికి దక్కుతున్న ప్రత్యేక గుర్తింపుగా భావించవచ్చు. ప్రపంచ స్థాయి వేదికలపై మనదైన ముద్ర పడటం భారతీయులందరికీ గర్వకారణం.

Published : 
  • 3 February 2026, 12:08 PM IST