"వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమే అని నిరూపిస్తున్న టాలీవుడ్ దిగ్గజం, ఇండియన్ సినిమా గర్వించదగ్గ ప్రయోగాత్మక దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆయన, 94 ఏళ్ల వయసులో మళ్ళీ మెగాఫోన్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. "తాజా వార్త ఏమిటంటే, సింగీతం శ్రీనివాసరావు గారు తన 61వ చిత్రానికి శ్రీకారం చుట్టారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్విని దత్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, నాగ్ అశ్విన్ దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దాదాపు పదేళ్ల విరామం తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యధిక వయసులో సినిమా చేస్తున్న దర్శకుడిగా ఆయన రికార్డు సృష్టించబోతున్నారు. హాలీవుడ్ లెజెండ్ క్లింట్ ఈస్ట్‌వుడ్ సరసన ఇప్పుడు సింగీతం గారి పేరు కూడా వినిపిస్తోంది.""సింగీతం అంటేనే ఒక ప్రయోగశాల. భారతీయ సినిమాకు ఆయన ఎన్నో క్లాసిక్స్ ని అందించాడు. పుష్పక విమానంతో మాటలు లేని మూకీ సినిమాతో కమర్షియల్ హిట్ కొట్టడం ఆయనకే చెల్లింది. ఆదిత్య 369 సినిమాతో అప్పట్లోనే టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెలుగు ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ ఇచ్చారు. భైరవద్వీపం సినిమాతో గ్రాఫిక్స్ పెద్దగా లేని కాలంలోనే జానపద సినిమాలతో అద్భుతాలు సృష్టించారు. మయూరి సినిమాతో సుధా చంద్రన్ గారి నిజ జీవిత కథను ఆమెతోనే హీరోయిన్గా చేయించి జాతీయ అవార్డు గెలుచుకున్నారు.
విచిత్ర సోదరులు సినిమాతో కమల్ హాసన్ గారిని పొట్టివాడిగా చూపించిన టెక్నికల్ మ్యాజిక్ ఇప్పటికీ ఒక వింతే!" "కమల్ హాసన్ మరియు సింగీతం శ్రీనివాసరావు గారి కాంబినేషన్ అంటే ఒక చరిత్ర. 'విచిత్ర సోదరులు', 'మైఖేల్ మదన కామరాజు', 'సతీ లీలావతి' వంటి క్లాసిక్స్ వీరి కలయికలోనే వచ్చాయి. కమల్ హాసన్, సింగీతం గారిని తన గురువుగా, మార్గదర్శిగా భావిస్తారు. రీసెంట్ గా వచ్చిన 'కల్కి 2898 AD' సినిమా స్క్రిప్ట్ విషయంలో కూడా సింగీతం గారు నాగ్ అశ్విన్‌కు మెంటార్‌గా వ్యవహరించడం విశేషం. "సింగీతం గారు కేవలం దర్శకుడే కాదు.. ఆయన ఒక గొప్ప సంగీత విద్వాంసుడు, రచయిత,నటుడు కూడా. 94 ఏళ్ల వయసులో కూడా తనలో ఉన్న సినిమా ప్యాషన్‌తో కొత్త తరం దర్శకులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆయన రాబోయే కొత్త సినిమా SSR61 భారీ విజయం సాధించాలని కోరుకుందాం. మరి సింగీతం గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది? కామెంట్స్‌లో చెప్పండి.