భారతీయ చలనచిత్ర చరిత్రలో కొన్ని సినిమాలు కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటాయి. అలాంటి అద్భుతమైన చిత్రాలలో '3 ఇడియట్స్' ఒకటి.2009లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. చదువు, కెరీర్, స్నేహం అనే అంశాలను కామెడీ జోడించి హృదయానికి హత్తుకునేలా చూపించిన ఈ సినిమాకు సీక్వెల్ రావాలని కోట్లాది మంది అభిమానులు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఆ నిరీక్షణకు త్వరలోనే తెరపడనుందని తెలుస్తోంది.ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, '3 ఇడియట్స్' సీక్వెల్ గురించి కొన్ని సంచలన విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రాజెక్టు గురించి అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ ప్రస్తుతం '3 ఇడియట్స్' సీక్వెల్ పనుల్లో నిమగ్నమై ఉన్నారని స్పష్టం చేశారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉందని ఆయన తెలిపారు. రాజ్ ప్రస్తుతం సీక్వెల్ కథపై వర్క్ చేస్తున్నారు.
నేను ఇప్పటికే ఆ కథను విన్నాను, అది చాలా అద్భుతంగా ఉంది. ప్రస్తుతం స్క్రీన్ ప్లేకి మరిన్ని మెరుగులు దిద్దే పనులు జరుగుతున్నాయి. మొదటి భాగంలో ఉన్న ఆ వినోదం, ఎమోషన్స్ ఏమాత్రం తగ్గకుండా ఈ సీక్వెల్ ఉండబోతోంది." అని అమీర్ పేర్కొన్నారు.
మొదటి భాగంలో ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులుగా కనిపించిన రాంచో, ఫర్హాన్, రాజు పాత్రలు ఇప్పుడు ఎలా ఉండబోతున్నాయి అనేది అందరిలోనూ ఉన్న ఆసక్తికరమైన ప్రశ్న. దీనిపై అమీర్ స్పందిస్తూ.. "పదేళ్ల తర్వాత ఆ పాత్రల జీవితాల్లో వచ్చిన మార్పుల నేపథ్యంలో కథ సాగనుంది. మొదటి భాగంలోని మ్యాజిక్‌ను కోల్పోకుండా, నేటి కాలానికి తగ్గట్టుగా మార్పులు చేస్తున్నాం" అని చెప్పుకొచ్చారు. మళ్ళీ ఆ పాత్రలో నటించడానికి తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు అమీర్ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.
ఇదే క్రమంలో రాజ్ కుమార్ హిరాణీతో తాను చేయాల్సిన మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించి కూడా అమీర్ క్లారిటీ ఇచ్చారు. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జీవిత చరిత్ర ఆధారంగా ఒక సినిమా చేయాలని గతంలో అనుకున్నారు. అయితే, స్క్రిప్ట్ విషయంలో ఇంకా కొన్ని మార్పులు అవసరం కావడంతో, సరైన సమయం కోసం ఆ ప్రాజెక్టును తాత్కాలికంగా వాయిదా వేసినట్లు అమీర్ వెల్లడించారు. అందుకే ప్రస్తుతం వారి దృష్టి అంతా '3 ఇడియట్స్' సీక్వెల్ పైనే ఉందని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.చేతన్ భగత్ నవల 'ఫైవ్ పాయింట్ సం వన్' ఆధారంగా తెరకెక్కిన 3 ఇడియట్స్ చిత్రంలో అమీర్ ఖాన్, ఆర్. మాధవన్, శర్మన్ జోషితో పాటు కరీనాకపూర్ కథానాయికగా నటించింది. విద్యా వ్యవస్థలోని లోపాలను ఎండగడుతూనే, "సక్సెస్ వెనుక పరిగెత్తకండి, నైపుణ్యం వెనుక పరుగెత్తండి.. అప్పుడు సక్సెస్ ఆటోమేటిక్‌గా మీ వెనుక వస్తుంది" అనే బలమైన సందేశాన్ని ఈ చిత్రం ఇచ్చింది. ఒకవేళ రాజ్ కుమార్ హిరాణీ, అమీర్ ఖాన్ కలయికలో ఈ సీక్వెల్ గనుక సెట్స్ పైకి వెళ్తే, అది ఖచ్చితంగా భారతీయ సినిమా రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. అమీర్ ఖాన్ నుంచి వచ్చిన ఈ పాజిటివ్ అప్డేట్తో మెగా సీక్వెల్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.