తెలుగు బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని, వెండితెరపై కూడా తన సత్తా చాటుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ 'ఆట' సందీప్ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ గద్దర్ రాష్ట్ర అవార్డు ను ఆయన అందుకున్నారు. 'ఛాంపియన్' చిత్రంలోని "గిర గిర గింగిరాగిరే" అనే సూపర్ హిట్ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేసినందుకు గాను ఆయనకు ఉత్తమ కొరియోగ్రాఫర్ విభాగంలో ఈ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా ఆయన తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో తన సంతోషాన్ని పంచుకుంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.
సందీప్ తన పోస్ట్‌లో పేర్కొంటూ.. "ఎంతో శ్రమ, మరెన్నో కష్టాలు, పోరాటాల తర్వాత చివరకు ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది నా మొదటి తెలంగాణ గడ్దర్ స్టేట్ అవార్డు. నా కృషిని గుర్తించి ఈ గౌరవాన్ని అందించినందుకు చాలా గర్వంగా ఉంది" అని తెలిపారు. ఒక కళాకారుడిగా ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఈ అవార్డు ఒక గొప్ప గుర్తింపు అని ఆయన ఆవేదనలోనూ ఒక తృప్తిని వ్యక్తం చేశారు. స్వప్న సినిమా, వైజయంతీ మూవీస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అశ్విని దత్ గారు, స్వప్న దత్ గారు, మరియు దర్శకుడు ప్రదీప్ అద్వైతం గారు తనపై నమ్మకం ఉంచి ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ పాటలో నటించిన రోషన్ మరియు అనస్వర రాజన్‌లకు, అలాగే సినిమాటోగ్రాఫర్ మధీ సార్‌కు ఆయన థాంక్స్ చెప్పారు. ఇది ఒక గొప్ప మైలురాయి మాత్రమే.. సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది" అంటూ సందీప్ తన లక్ష్యాన్ని చాటి చెప్పారు. ప్రేక్షకుల ప్రేమాభిమానాలు, ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకున్నారు. గతంలో అనేక రియాలిటీ షోల ద్వారా మెప్పించిన సందీప్, ఇప్పుడు రాష్ట్ర స్థాయి అవార్డును అందుకోవడం పట్ల టాలీవుడ్ ప్రముఖులు మరియు అభిమానులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.