తెలుగు తెరపై కామెడీ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు అల్లరి నరేష్. ఎటువంటి అట్టహాసాలు లేకుండా, కేవలం తనదైన మాటల మాంత్రిజంతో, అమాయకపు హావభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విచగల అరుదైన నటుడు ఆయన. కొంతకాలంగా సీరియస్ మరియు ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన నరేష్, మళ్లీ తన అసలు సిసలైన ట్రేడ్‌మార్క్ కామెడీ రూట్లోకి వస్తున్నారు. అదే ఆయన తాజా చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’.చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో వస్తున్న ఈ వినోదాత్మక ఫాంటసీ చిత్రాన్ని సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది.“రాశి ఓ రాశి.. మూసిలో రంభ ఊర్వశి” అనే క్యాప్షన్‌తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. అల్లరి నరేష్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్.ఈ చిత్రంలో కామెడీని పండించడానికి భారీ తారాగణమే బరిలోకి దిగింది. అల్లరి నరేష్, నరేష్ వీకేల మధ్య వచ్చే కామెడీ సీన్లు థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించడం ఖాయం. ఇక దేవలోకానికి అధిపతి అయిన ఇంద్రుడి పాత్రలో వెన్నెల కిషోర్ కనిపించి తనదైన శైలిలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.
రాశి సింగ్, విష్ణు ప్రియ, ప్రిషా సింగ్ ఈ ముగ్గురూ అప్సరసల పాత్రల్లో చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపించారు. వీరికి తోడుగా శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కూడా నవ్వులు పూయించే పాత్రల్లో కనిపించి సందడి చేయనున్నారు. అన్నపూర్ణా స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దంద, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణ పరంగా చాలా రిచ్‌గా కనిపిస్తోంది. ఫాంటసీ జోనర్‌కి కామెడీని జోడించి తెరకెక్కించిన ఈ చిత్రం కుటుంబ సమేతంగా వెళ్లి నవ్వుకునేలా ఉంటుందనిపిస్తోంది.మొత్తానికి సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు పక్కా నవ్వుల పండుగను అందించడం ఖాయంగా కనిపిస్తోంది.