తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన నటుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. 'పుష్ప' సినిమాతో గ్లోబల్ వైడ్‌గా క్రేజ్ సంపాదించుకున్న బన్నీ, ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టులతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తమిళ స్టార్ డైరెక్టర్, 'లోకేష్ సినిమాటిక్ యూనివర్స్' సృష్టికర్త లోకేష్ కనగరాజ్‌తో అల్లు అర్జున్ చేయబోతున్న సినిమా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు అంటే 'పాన్ ఇండియా' రేంజ్ అని మాట్లాడుకుంటాం. కానీ, అల్లు అర్జున్ - లోకేష్ సినిమా అంతకు మించి ఉండబోతోందని సమాచారం. ఈ ప్రాజెక్టుపై లోకేష్ అసోసియేట్ రత్నకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రత్నకుమార్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "ఈ సినిమా కేవలం స్టార్లు ఉన్నారనో లేదా కథ జరిగే ప్రాంతం వల్లనో పాన్ ఇండియా సినిమా అవ్వడం లేదు. ఈ కథకు ఉన్న అంతర్జాతీయ అప్పీల్ వల్ల ఇది గ్లోబల్ రేంజ్‌లో ఉంటుంది. అల్లు అర్జున్ ఈ ప్రాజెక్టులో ఉన్నారంటే, సినిమాను మనం అనుకున్న రీతిలో అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు కావాల్సిన వనరులన్నీ అందుబాటులో ఉంటాయి" అని ధీమా వ్యక్తం చేశారు. బన్నీ ఇమేజ్ ఈ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రేజీ కాంబినేషన్ ఏదో అనుకోకుండా సెట్ అయింది కాదు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ ఎంటర్టైనర్ కోసం లోకేష్ కనగరాజ్ మరియు అల్లు అర్జున్ మధ్య దాదాపు మూడు వారాల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయట. కథలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చర్చించి, ఒక పక్కా స్క్రిప్ట్‌తో మేకర్స్ ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని సమాచారం.
లోకేష్ కనగరాజ్ తన సినిమాల్లో చూపించే డార్క్ యాక్షన్ ఎలిమెంట్స్ మరియు బన్నీ ఎనర్జీ తోడైతే వెండితెరపై మంటలు చెలరేగడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఈ సినిమా షూటింగ్ లేదా ప్రీ-ప్రొడక్షన్ పనులు మే రెండో వారం నుండి పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ థీమ్ మ్యూజిక్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశం ఉండటంతో మ్యూజిక్ పరంగా కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. బన్నీ ఇప్పుడు లోకేష్ కనగరాజ్ లాంటి విజనరీ డైరెక్టర్‌తో జతకట్టడం చూస్తుంటే, టాలీవుడ్ నుండి మరో గ్లోబల్ హిట్ రాబోతోందని అర్థమవుతోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది.