మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తాజా చిత్రం 'పెద్ది'. 'ఉప్పెన' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ మరియు ఓవర్సీస్ ప్రీమియర్లకు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు బయటకు వచ్చాయి. క్రికెట్ నేపథ్యంతో సాగే పీరియాడిక్ చిత్రంగా రూపొందుతున్న 'పెద్ది' పలుమార్లు వాయిదా పడినప్పటికీ, ఎట్టకేలకు సినిమా యూనిట్ విడుదల తేదీని ఖరారు చేసింది. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. అయితే, భారతీయ కాలమానం ప్రకారం జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటలకు ఈ సినిమా ప్రీమియర్లు ప్రారంభం కానున్నాయి. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం పదిన్నరకే షోలు పడనున్నట్లు సమాచారం.
రామ్ చరణ్ క్రేజ్ దృష్ట్యా నార్త్ అమెరికాలో ఈ సినిమాను అత్యధిక స్క్రీన్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ట్రేడ్ అనలిస్ట్ వెంకీ వెల్లడించిన వివరాల ప్రకారం, అమెరికాలో టికెట్ ధరలు ఐమాక్స్ లో 3320 రూపాయలు. XD, PLF తెరలమీదైతే 2850 రూపాయిలు. ఇతర వెర్షన్స్ లో అయితే, 2400 రూపాయలుగా ఫిక్స్ చేశారు.ఇంత భారీ స్థాయిలో టికెట్ ధరలు ఉన్నప్పటికీ, మెగా అభిమానుల సందడి చూస్తుంటే అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే అడ్వాన్స్ బుకింగ్స్ విండో ప్రారంభం కానుంది.
ఉత్తర భారత దేశంలో ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్ భారీ స్థాయిలో విడుదల చేస్తోంది.
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన గ్లామర్ క్వీన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. అలాగే, ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ, విజి చంద్రశేఖర్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.దర్శకుడు సుకుమార్ కూడా ఈ సినిమా ప్రమోషన్లలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రామ్ చరణ్ తన కెరీర్ లోనే ఒక విభిన్నమైన రోల్ లో కనిపిస్తున్న ఈ 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.