అవకాశాలు రావాలంటే తప్పదా?

తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు తగిన గుర్తింపు, అవకాశాలు లభించడం లేదనే విమర్శలు చాలా కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఎంతటి ప్రతిభ ఉన్నప్పటికీ మన స్థానిక నటీమణులను పక్కన పెట్టి, ముంబై, బెంగళూరు

Post Published By: dialnews
Updated : 11 August 2026, 1:05 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు తగిన గుర్తింపు, అవకాశాలు లభించడం లేదనే విమర్శలు చాలా కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఎంతటి ప్రతిభ ఉన్నప్పటికీ మన స్థానిక నటీమణులను పక్కన పెట్టి, ముంబై, బెంగళూరు వంటి ఇతర ప్రాంతాల నుంచి భామలను దిగుమతి చేసుకుంటున్నారనే ఆరోపణలు తరచుగా వస్తుంటాయి. కోట్ల రూపాయల పారితోషికాలు ఇచ్చి ఇతర భాషా నటీమణులను తీసుకొచ్చే నిర్మాతలు, తెలుగు అమ్మాయిలకు మాత్రం ఒకటి రెండు అవకాశాలు ఇచ్చి ఆ తర్వాత పక్కన పెట్టేస్తున్నారనే బాధ చాలా మందిలో ఉంది. గతంలో అంజలి, శ్రీదివ్య, ఐశ్వర్య రాజేష్ వంటి తెలుగు మూలాలున్న కథానాయికలు కూడా ఈ విషయంపై పలుమార్లు తమ ఆవేదనను బహిరంగంగానే వ్యక్తం చేశారు.

సినిమా రంగంలోకి రావాలనుకునే కొత్త అమ్మాయిలను క్యాస్టింగ్ కౌచ్ పేరిట వేధించే కామాంధులు, ఇతరత్రా భయాల కారణంగా చాలా మంది తెలుగు అమ్మాయిలు అసలు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేయడానికే వణికిపోతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో టాలీవుడ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య కొత్తగా వచ్చే అమ్మాయిలకు ధైర్యం చెప్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజుల క్రితం ఒక సినిమా వేడుకలో మాట్లాడిన ఆమె, తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిల పరిస్థితి, వారికి లభించే అవకాశాల గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావు, ఆదరణ ఉండదు అని చాలామంది అంటుంటారు. అలాంటి మాటలు విని భయపడి, అసలు ప్రయత్నం కూడా చేయకుండా ఆగిపోయిన వాళ్లు చాలామంది ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తేనే అసలు ఫలితం ఏంటో తెలుస్తుంది. ప్రయత్నించకుండా రాదనుకోవడం సరైనది కాదు. నాకు సాయి రాజేష్ గారు, నిర్మాత SKN గారు లభించినట్లే... నాకు ఒక మంచి లైఫ్ ఇచ్చినట్లే, ప్రతి ఒక్కరికీ సరైన వ్యక్తులు తప్పకుండా దొరుకుతారు.

మన వైపు నుంచి ప్రయత్నం మాత్రం 100 శాతం ఉండాలి. కొందరికి తక్కువ సమయంలోనే అవకాశాలు రావచ్చు, మరికొందరికి కాస్త ఎక్కువ సమయం పట్టవచ్చు. కానీ ఓపికతో నిరంతరం ప్రయత్నిస్తే తప్పకుండా అవకాశాలు మీ ఇంటి తలుపు తడతాయి."అంటూ కొత్తగా పరిశ్రమలోకి రావాలనుకునే తెలుగు అమ్మాయిలకు వైష్ణవి చైతన్య పిలుపునిచ్చారు. సినిమాలపై ఉన్న తీవ్రమైన ఆసక్తితో వైష్ణవి చైతన్య మొదట్లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లలో నటించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే పెద్ద సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు దక్కాయి. టచ్ చేసి చూడు, అల వైకుంఠపురములో, రంగ్ దే, టక్ జగదీష్, వరుడు కావలెను వంటి సినిమాల్లో ఆమె మెరిసారు.తమిళంలో వెళ్లిమై సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఆమె, ఆ తర్వాత తెలుగులో 'బేబీ' చిత్రంతో కథానాయికగా అడుగుపెట్టారు. ఈ సినిమాలో ఆమె అద్భుతమైన నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు అనేక అవార్డులు వరించాయి. ఆ తర్వాత లవ్ మీ, జాక్ వంటి చిత్రాల్లో కథానాయికగా నటించిన వైష్ణవి, ప్రస్తుతం 'ఎపిక్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన వైష్ణవి చైతన్య ప్రయాణం ఎందరో కొత్త తెలుగు అమ్మాయిలకు నిరంతరం ప్రేరణగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

Published : 
  • 11 August 2026, 1:05 PM IST